వారెవ్వా విండీస్: ఛాంపియన్ ఆటతో ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించారుగా

వారెవ్వా విండీస్: ఛాంపియన్ ఆటతో ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించారుగా

భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ లో వెస్టిండీస్ జట్టు అర్హత సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. క్వాలిఫయర్ మ్యాచ్ ల్లో పసికూన చేతుల్లో ఓడిపోవడంతో క్రికెట్ లో ఇక విండీస్ కథ ముగిసిందనుకున్నారు. ఇక ఆ జట్టు కోలుకోవడం కష్టమే అనుకున్నారు. దీనికి తోడు ఆటగాళ్ల రిటైర్మెంట్, బోర్డుతో విబేధాలు విండీస్ క్రికెట్ ను కిందకు లాగేసాను. అయితే వరల్డ్ కప్ తర్వాత ఆ జట్టు ఛాంపియన్ ఆటతో ఆకట్టుకుంది. పటిష్టమైన ఇంగ్లాండ్ కు షాకిస్తూ సూపర్ విక్టరీ కొట్టింది. 

ఇంగ్లాండ్ తో మూడు వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డే ఆంటిగ్వా వేదికగా జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ అంచనాలకు తగ్గట్లు ఆడి 50 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటైంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హ్యారి బ్రూక్ 71 పరుగులు చేసి టాప్ స్కోరర్. సాల్ట్ 45, క్రాలి 48, సామ్ కరణ్ 38 పరుగులతో రాణించారు. మిగిలిన ఆటగాళ్లు తలో చేయి వేయడంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసింది. విండీస్ బౌలర్లలో షెపర్డ్, మోటీ, ఒషేం థామస్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. 

326 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో విండీస్ 48.5 ఓవరల్లో 6 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. విండీస్ జట్టును కెప్టెన్ షై హోప్ ముందుండి నడిపించాడు. 83 బంతుల్లో 7 సిక్సులు, 4 ఫోర్లతో విండీస్ కెప్టెన్ అజేయంగా 109 పరుగులు చేసాడు. ఓపెనర్ అతనాజ్ 66 పరుగులతో రాణించగా.. చివర్లో షెపర్డ్ 28 బంతుల్లోనే 3 సిక్సులు, 4 ఫోర్లతో 49 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.  ఇరు జట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 6న, మూడో వన్డే డిసెంబర్ 9న జరుగుతాయి.