AUS vs WI, 1st Test: ఊహించని ఫీల్డ్ సెటప్..విండీస్ మాస్టర్ ప్లాన్‌కు మార్ష్ బోల్తా

AUS vs WI, 1st Test: ఊహించని ఫీల్డ్ సెటప్..విండీస్ మాస్టర్ ప్లాన్‌కు మార్ష్ బోల్తా

క్రికెట్ లో కొన్ని ఫీల్డ్ సెటప్ లు ఊహించని విధంగా ఉంటాయి. ఆటగాడి బలహీనతలను బట్టి కెప్టెన్ చేసే ఈ మార్పులు కొన్నిసార్లు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. మరికొన్ని సార్లు వికెట్ రాకపోతే ప్రయోగాత్మకమైన ఫీల్డ్ సెట్ ను గతంలో మనం గమనించే ఉంటాం. తాజాగా వెస్టిండీస్ ఒక కొత్త ఫీల్డ్ సెటప్ పరిచయం చేసి అందులో సఫలమైంది. మాస్టర్ ప్లాన్ తో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ను ఔట్ చేశారు.  

అడిలైడ్ ఓవల్‌లో జరుగుతున్న తొలి టెస్టులో నేడు (జనవరి 18) ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్‌ను అవుట్ చేయడానికి వెస్టిండీస్ ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని ఉపయోగించింది. మార్ష్ వికెట్ వికెట్ కోసం ముగ్గురు ఫీల్డర్లను స్లిప్ లో ఉంచారు. అయితే మూడో స్లిప్ లో ఉన్న ఫీల్డర్ కాస్త ముందు వచ్చి నిలబడ్డాడు. పేస్ బౌలర్ కీమర్ రోచ్ స్లో బాల్ వేయడంతో డిఫెన్స్ చేయాలని చూసిన మార్ష్.. సరిగ్గా మూడో స్లిప్ ప్లేయర్ ఎక్కడ నించున్నాడో అక్కడే క్యాచ్ ఇచ్చాడు. దీంతో విండీస్ సెట్ చేసిన ఫీల్డ్ వ్యహం ఫలించింది. క్రీజ్ లోకి వచ్చిన దగ్గర నుంచి తడబడిన మార్ష్.. 26 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.    

ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో విఫలమైన వెస్టిండీస్ బౌలింగ్ లో ఆకట్టుకుంది. ఆస్ట్రేలియాను మొదటి ఇన్నింగ్స్ లో 283 పరుగులకే ఆలౌట్ చేసింది. డెబ్యూ బౌలర్ షారోన్ జోసెఫ్ 5 వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు. మొదటి ఇన్నింగ్స్ లో 188 పరుగులకే విండీస్ ఆలౌటైన విండీస్..రెండో ఇన్నింగ్స్ లో అదే పేలవ ఆటతీరును కొనసాగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి 6 వికెట్లకు 73 పరుగులు చేసింది. ప్రస్తుతం విండీస్ 22 పరుగులు వెనకబడి ఉంది.