- సూపర్‑8కు కరీబియన్ల అర్హత
- రాణించిన రూథర్‌ఫోర్డ్, జోసెఫ్, గుడకేశ్
తరౌబా: టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్.. న్యూజిలాండ్‌కు ఊహించని షాకిచ్చింది. బ్యాటింగ్‌లో షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (39 బాల్స్‌లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68 నాటౌట్), బౌలింగ్‌లో అల్జారీ జోసెఫ్ (4/19), గుడకేశ్ మోతీ (3/25) చెలరేగడంతో.. గురువారం జరిగిన గ్రూప్–సి లీగ్ మ్యాచ్‌లో విండీస్ 13 రన్స్ తేడాతో కివీస్‌పై గెలిచింది. దీంతో హ్యాట్రిక్ విజయాలతో కరీబియన్ టీమ్ సూపర్–8కు అర్హత సాధించగా, కివీస్‌కు నిరాశే ఎదురైంది. టాస్ ఓడిన విండీస్ 20 ఓవర్లలో 149/9 స్కోరు చేసింది. తర్వాత న్యూజిలాండ్ 20 ఓవర్లలో 136/9 స్కోరుకే పరిమితమైంది. గ్లెన్ ఫిలిప్స్ (33 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40) టాప్ స్కోరర్. ఫిన్ అలెన్ (22), సాంట్నెర్ (21 నాటౌట్) పోరాడి విఫలమయ్యారు. రూథర్‌ఫోర్డ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
‘టాప్’ ఫెయిలైనా..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ను కివీస్ బౌలర్లు వణికించారు. బౌల్ట్ (3/16), సౌథీ (2/21), ఫెర్గుసన్ (2/27) దుమ్మురేపడంతో కరీబియన్ టాప్ ఆర్డర్ బెంబేలెత్తింది. ఇన్నింగ్స్ ఆరో బాల్‌కే ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (0) డకౌటయ్యాడు. బ్రెండన్ కింగ్ (9)తో కలిసి నికోలస్ పూరన్ (17) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా కివీస్ బౌలింగ్ ముందు నిలవలేకపోయారు. ఇక్కడి నుంచి వరుస విరామాల్లో రోస్టన్ ఛేజ్ (0), పావెల్ (1) వికెట్లు పడటంతో విండీస్ 30 రన్స్‌కే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వచ్చిన రూథర్‌ఫోర్డ్ ఇన్నింగ్స్‌ను ఆదుకున్నాడు. రెండో ఎండ్‌లో సరైన సహకారం లభించకపోయినా తాను మాత్రం భారీ హిట్టింగ్‌తో రన్‌రేట్‌ను పెంచాడు. అకీల్ హుస్సేన్ (15) ఉన్నంతసేపు స్ట్రయిక్ రొటేట్ చేసి ఆరో వికెట్‌కు 28 రన్స్ జత చేసి వెనుదిరిగాడు. భారీ ఆశలు పెట్టుకున్న హిట్టర్ ఆండ్రీ రసెల్ (14) కూడా ఎక్కువసేపు వికెట్ కాపాడుకోలేదు. 13వ ఓవర్‌లో బౌల్ట్ వేసిన ఆఫ్ కట్టర్‌ను షాట్‌గా మల్చబోయి షార్ట్ థర్డ్ మ్యాన్‌లో ఫెర్గుసన్‌కు క్యాచ్ ఇచ్చాడు. 76/7తో కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌ను రూథర్‌ఫోర్డ్ మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. రొమారియో షెఫర్డ్ (13)ను నిలబెట్టి లాంగాన్, లాంగాఫ్‌లో భారీ సిక్స్‌లు కొట్టాడు. ఈ క్రమంలో 33 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. చివర్లో అల్జారీ జోసెఫ్ (6) విఫలమైనా, రూథర్‌ఫోర్డ్ మంచి టార్గెట్‌ను నిర్దేశించాడు.
ఫిలిప్స్ మినహా..
టార్గెట్ ఛేజింగ్‌లో ఫిలిప్స్ మినహా మిగతా వారు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. దీనికి తోడు విండీస్ బౌలర్లు అల్జారీ జోసెఫ్, మోతీ వరుస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. మూడో ఓవర్‌లో డేవన్ కాన్వే (5)తో మొదలైన వికెట్ల పతనం వేగంగా సాగింది. అలెన్ ఫర్వాలేదనిపించినా రచిన్ రవీంద్ర (10), విలియమ్సన్ (1), డారిల్ మిచెల్ (12) నిరాశపర్చారు. 63/5 స్కోరుతో కష్టాల్లో పడిన కివీస్‌ను ఫిలిప్స్ గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. ఈ దశలో జేమ్స్ నీషమ్ (10), సాంట్నెర్ ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగారు. ఫిలిప్స్‌తో కలిసి 45 రన్స్ జోడించి ఆశలు రేకెత్తించారు. కానీ 16వ ఓవర్‌లో నీషమ్ ఔట్ కావడంతో ఛేజింగ్ క్లిష్టమైంది. 18వ ఓవర్‌లో ఫిలిప్స్ కూడా వెనుదిరగడంతో కివీస్ ఆశలు ఆవిరయ్యాయి. సౌథీ (0), బౌల్ట్ (7), ఫెర్గుసన్ (0 నాటౌట్)కు విండీస్ బౌలర్లు పెద్దగా చాన్స్ ఇవ్వలేదు. హుస్సేన్, రసెల్ చెరో వికెట్ తీశారు.
సంక్షిప్త స్కోర్లు
వెస్టిండీస్: 20 ఓవర్లలో 149/9 (రూథర్‌ఫోర్డ్ 68*, బౌల్ట్ 3/16). న్యూజిలాండ్: 20 ఓవర్లలో 136/9 (ఫిలిప్స్ 40, అలెన్ 26, జోసెఫ్ 4/19, మోతీ 3/25).