- – సత్తా చాటిన షై హోప్
బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): టీ20 వరల్డ్ కప్ సూపర్–8 కీలక పోరులో వెస్టిండీస్ విజృంభించింది. ఓపెనర్ షై హోప్ (39 బాల్స్‌లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 82 నాటౌట్) చెలరేగడంతో.. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో విండీస్ 9 వికెట్ల తేడాతో అమెరికాను చిత్తు చేసింది. ఫలితంగా రన్‌రేట్ (1.814)ను కూడా మెరుగుపర్చుకుని గ్రూప్–2లో రెండో ప్లేస్‌లోకి దూసుకొచ్చింది. దీంతో సెమీస్ చేరే అవకాశాలను పెంచుకుంది.
తొలి మ్యాచ్‌లో విండీస్‌ను ఓడించిన ఇంగ్లండ్ (0.412) మూడో ప్లేస్‌కు పడింది. టాస్ ఓడిన అమెరికా 19.5 ఓవర్లలో 128 రన్స్‌కే ఆలౌటైంది. ఆండ్రీస్ గౌస్ (29) టాప్ స్కోరర్. కరీబియన్ బౌలర్లు రసెల్ (3/31), రోస్టన్ ఛేజ్ (3/19), అల్జారీ జోసెఫ్ (2/31) కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు యూఎస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. రెండో ఓవర్‌లోనే స్టీవెన్ టేలర్ (2) ఔట్ కావడంతో గౌస్, నితీశ్ కుమార్ (20) ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు. ఆరోన్ జోన్స్ (11), మిలింద్ కుమార్ (19), షాడ్లీ వాన్ (18), అలీ ఖాన్ (14 నాటౌట్) కాసేపు పోరాడినా కరీబియన్ బౌలర్లు ఏమాత్రం చాన్స్ ఇవ్వలేదు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 10.5 ఓవర్లలోనే 130/1 స్కోరు చేసి నెగ్గింది. స్టార్టింగ్ నుంచే భారీ హిట్టింగ్‌తో చెలరేగిన హోప్ యూఎస్ బౌలింగ్‌ను ఉతికి ఆరేశాడు. రెండో ఎండ్‌లో జాన్సన్ చార్లెస్ (15) నిరాశపర్చినా తొలి వికెట్‌కు 67 రన్స్ జోడించాడు. తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ (12 బాల్స్‌లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 27 నాటౌట్) కూడా దుమ్మురేపాడు. హోప్, పూరన్ గ్రౌండ్ నలువైపులా భారీ సిక్స్‌లు బాదుతూ రెండో వికెట్‌కు 23 బాల్స్‌లోనే 63 రన్స్ జోడించి విజయాన్ని అందించారు. ఛేజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సోమవారం సౌతాఫ్రికాతో విండీస్ తలపడనుంది.