అధికారం మారగానే ఆధారాలు ధ్వంసం: వెస్ట్‌‌ జోన్ డీసీపీ విజయ్‌‌కుమార్

అధికారం మారగానే ఆధారాలు ధ్వంసం: వెస్ట్‌‌ జోన్ డీసీపీ విజయ్‌‌కుమార్
  • ఫోన్​ ట్యాపింగ్​తో ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైల్స్ తయారీ
  • ఎన్నికల టైమ్​లో ఒక పార్టీ డబ్బులను చేరవేసిన్రు
  • హర్డ్​డిస్క్​ల ధ్వంసంలో ప్రణీత్​కు రాధాకిషన్​రావు సహకారం
  • ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టాల్సి ఉంది
  • వెస్ట్‌‌ జోన్ డీసీపీ విజయ్‌‌కుమార్ వెల్లడి 

హైదరాబాద్‌‌, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు రాజకీయాలతో సంబంధం లేని ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైల్స్‌‌ను కూడా తయారు చేశారని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్‌‌కుమార్ వెల్లడించారు. ఎన్నికల టైమ్​లో ఒక రాజకీయ పార్టీ డబ్బులు రవాణా చేశారని చెప్పారు. కాంగ్రెస్ కు అనుకూలంగా రిజల్ట్ వచ్చి రాష్ట్రంలో అధికారం మారగానే ఆధారాలు ధ్వంసం చేశారని తెలిపారు. ఈ విషయంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్​రావు నుంచి సమాచారం రాబడుతున్నామని ప్రకటించారు. చంచల్‌‌గూడ జైల్లో ఉన్న రాధా కిషన్‌‌ను బంజారాహిల్స్‌‌ పోలీసులు కస్టడీలోకి తీసుకుని స్టేషన్‌‌కు తరలించి ప్రశ్నిస్తున్నామని వెల్లడించారు. ఈ మేరకు గురువారం వెస్ట్ జోన్ డీసీపీ విజయ్‌‌కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘‘ఎస్‌‌ఐబీలో హార్డ్‌‌డిస్క్‌‌లు ధ్వంసం చేసిన కేసులో రాధాకిషన్‌‌రావును అరెస్ట్ చేశాం. నాంపల్లి కోర్టు అనుమతితో ఈ నెల 10 తేదీ వరకు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నం. రాధాకిషన్ రావు నుంచి కీలక వివరాలు రాబట్టాల్సి ఉంది. కొంతమంది ప్రముఖులు, ప్రైవేట్‌‌ వ్యక్తుల ప్రొఫైల్స్‌‌ను అనధికారకంగా రూపొందించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారు. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించి ప్రొఫైల్స్‌‌ను తయారు చేశారు. బెదిరింపులకు పాల్పడి పార్టీకి చెందిన డబ్బులు చేరవేశారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావడంతో హార్డ్ డిస్క్‌‌లను ధ్వంసం చేయించారు. ఎస్ఐబీలోని హార్డ్‌‌డిస్క్‌‌లను ధ్వంసం చేసిన ప్రణీత్​రావుకు రాధాకిషన్ సహకరించాడు. హార్డ్‌‌డిస్క్‌‌ల్లోని ప్రొఫైల్స్‌‌కు సంబంధించిన వ్యవహారాలు బయటి రాకుండా ఆధారాలను ధ్వంసం చేశారు” అని డీసీపీ వివరించారు.