హైదరాబాద్ , వెలుగు: ఇక గ్రామాల్లోనూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించనున్నారు. తడి చెత్త నుంచి వర్మీ కంపోస్టు ఎరువును తయారు చేసి రైతులకు విక్రయించనున్నారు. పొడి చెత్తను రీసైక్లింగ్ చేస్తారు. గ్రామాల్లో పారి శుద్ధ్యం మెరుగుకోసం తీసుకొస్తున్న ఈ స్కీం కింద తొలుత జిల్లాకు మూడు గ్రామాలను ఎంపిక చేసి మోడల్‌గా తయారు చేస్తారు. అది సక్సెస్ అయితే అన్ని గ్రామాల్లోనూ ప్రవేశపెడతారు. పల్లెల్లో చెత్తను కాల్చడం, వాగుల్లో పడేయడంతో పర్యావరణం కలుషితమవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్ ను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.
ఇందుకోసం 32 జిల్లాల్లో 96 పంచాయతీలను ఎంపిక చేశారు. వీటికి గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల రూ.3.25 లక్షల చొప్పున కేటాయించింది. వీటితోపాటు మరో రూ.లక్ష చొప్పున స్వచ్ఛ భారత్ నిధులు కేటాయించారు. ఒక్కో గ్రామానికి రూ.4.25 లక్షలను సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్(ఎస్‌డబ్ల్యూ ఎం) కోసం వాడనున్నారు. ఎస్‌డబ్ల్యూ ఎం రూల్స్‌పై అధికారులు ఆయా పంచాయతీ కార్యదర్శు లకు ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు.
తడి చెత్తతో కంపోస్టు ఎరువు
ఎంపిక చేసిన మోడల్ విలేజీల్లో 300 జనాభాకు ఒక వాహనాన్ని , పారి శుద్ధ్య కార్మి కుడిని నియమిస్తారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు ఇంటింటికీ రెండు డస్ట్ బిన్లు ఇస్తారు. ఈ మేరకు గ్రామస్తులకూ అవగాహన కల్పిస్తారు. పాచిపోయిన ఆహారం, కుళ్లిన కూరగాయలు, ఆకు కూరలు మొదలైన వాటిని తడి చెత్త డస్ట్ బిన్‌లో వేయాలి. చిత్తు కాగితాలు, తుప్పు పట్టిన వస్తువులు, కలప, ప్లాస్టిక్ తదితర పొడి చెత్తను వేరొకడస్ట్ బిన్‌లో వేయాలి. పొడి చెత్తను రీసైక్లింగ్ ప్లాంట్లకు తరలిస్తారు. అలాగే తడి చెత్తను వర్మీ కంపోస్టు ప్లాంట్‌లో ఏడాదిపాటు నిల్వ చేస్తారు. ఇది ఎరువుగా మారాక రైతులకు అమ్ముతారు. వచ్చే రెండు నెలల్లో రాష్ ట్రంలోని మోడల్ విలేజీలన్నింటిలో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్లను ప్రారంభించనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.