జూన్ క్వార్టర్​లో బంగారం డిమాండ్ డౌన్​ : డబ్ల్యూజీసీ

ముంబై: ధరలు ఎక్కువగా ఉండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్​లో దేశంలో  బంగారం డిమాండ్ 5 శాతం క్షీణించి 149.7 టన్నులకు చేరుకుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) మంగళవారం ఒక రిపోర్టులో పేర్కొంది.  గత క్యాలెండర్ సంవత్సరం ఇదే క్వార్టర్​లో బంగారం డిమాండ్ 158.1 టన్నులుగా ఉంది.  అయితే, విలువ పరంగా రెండో క్వార్టర్​లో బంగారం డిమాండ్ 17 శాతం పెరిగి రూ.93,850 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ.82,530 కోట్లుగా ఉంది.   ఏప్రిల్–-జూన్ క్వార్టర్​లో ధరలు పెరిగాయి.

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.74 వేలు దాటింది. ఏప్రిల్–-జూన్ కాలంలో బంగారం సగటు ధర  2,338.2 డాలర్లు కాగా, 2023లో  1,975.9 డాలర్లు ఉంది. సగటు త్రైమాసిక ధర రూ. 62,700.5 కాగా, గత ఏడాది ఇదే కాలంలో రూ. 52,191.6 ఉంది.  గత ఏడాది ఇదే కాలంలో 128.6 టన్నులతో పోలిస్తే ఈ క్వార్టర్​లో మొత్తం ఆభరణాల డిమాండ్ 17 శాతం తగ్గి 106.5 టన్నులకు చేరుకుంది.