ఆధ్యాత్మికం: మనిషి బతికున్నంతవకు అనుభవించేవి ఏమిటో తెలుసా..

ఆధ్యాత్మికం: మనిషి బతికున్నంతవకు అనుభవించేవి ఏమిటో తెలుసా..

ఈ విశ్వమే ఓ అద్భుతం .అందులో మానవ జన్మ మరీ విశిష్ట౦. స్వర్గం, నరకం, భూమి , ఆకాశాన్ని సృష్టించిన భగవంతుడు జీవకోటికి ప్రాణం పోశాడు .ప్రాణులకు నిద్ర, ఆకలి , భయం , ఆహారం  ......ఇవన్ని సహజమే ! చీము , రక్తం ,మాలాలతో నిండి ఉండే ఈ శరీరం చివరకు శిథిలమై మరణానికి చేరువవుతుంది . 

కాని మనం ఆస్తిపాస్తులూ... అందం... -ఆనందం.... భయాలూ... బంధాలూ వీటితో కొట్టు మిట్టాడుతుంటాం..  ఇవేవీ శాశ్వతంగా మనతో ఉండిపోవు. అవి ఎప్పుడూ స్థిరంగా ఉండవు. మరి మనతో పాటే ఉండేవేంటి? అంటే.. ఊపిరి ఉన్నంత వరకూ మనిషి మూడు అవస్థలు అనుభవిస్తుంటాడు అని అంటారు గురువులు. అవేంటంటే జాగ్రదావస్థ (మేల్కొని ఉండటం), స్వప్నావస్థ (కలలు కనడం), సుషుప్తావస్థ (నిద్రపోవడం). వీటిని మనిషి దూరం చేసుకోలేడు. అలాగని వీటి నుంచి దూరంగా పారిపోలేడు.. కదా..! 

ఈ మూడు అవస్థలు లేకుంటే జీవితం లేదనిపిస్తుంటుంది. మరి ఇవి శరీరానికి సంబంధించినవా? లేక ఆత్మకు చెందినవా? అనే ప్రశ్న ఎప్పుడో ఉదయించింది. చూడబోతే ఆత్మకు సంబంధించినవే అనిపిస్తుంటుంది చాలామందికి. కానీ, ఈ మూడూ బుద్ధిపరమైనవే గాని, ఆత్మకు సంబంధించినవి కావని రుషులు రాసిన మాట!. 

చీకట్లో నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా నేలపై పడి ఉన్న తాడును చూసి పాము అనుకొని భయపడటం ఎంత సహజమో, వెలుతురులో చూసినప్పుడు అది పాము కాదు, తాడు అని గుర్తు పట్టడం కూడా అంతే సహజం.. ఎలాగైతే.. పాము కాని తాడు పాములా కనపడిందో, అలాగే ఆత్మలో లేని ఈ మూడు అవస్థలు కూడా ఆత్మలో ఉన్నట్టు అనిపిస్తాయి!. వెలుతురు లాంటి జ్ఞానంతో చూసినప్పుడే ఆ మూడు అవస్థలూ ఆత్మకు సంబంధించినవి కావని తెలుస్తుంది. 

ఒక అవస్థలో ఉంటే 

మేల్కొని ఉన్నప్పుడు కలలు కనలేం..  నిద్రపోలేం. కలలు కంటున్నప్పుడు మేల్కొని ఉండలేం... నిద్రపోలేం..  అలాగే నిద్ర పోతున్నప్పుడు మేల్కొనడం.... కలలు కనడం రెండూ ఒకేసారి జరగవు. ఒక అవస్థలో ఉన్నప్పుడు, ఇంకో అవస్థను బుద్ధి తెలుసుకోలేదు. ఆత్మ మాత్రం అన్ని అవస్థలనూ తెలుసుకుంటుంది. ఆత్మ నిత్యమని, బుద్ధి అనిత్యమని దీని అర్ధం.

 జాగ్రదావస్థలో అంటే మేల్కొని ఉన్న సమయంలో మనిషి తన చుట్టూ ఉన్న వాటిని తెలుసుకోవటానికి సూర్యుడు, దీపం, ఇంద్రియాలు, బుద్ధి సాయపడతాయి. అవి లేకుంటే మనిషి దేన్నీ చూడలేడు. తెలుసుకోలేడు. కలలు కంటున్నప్పుడు కూడా ఆ కలల్లో కనిపించే వాటిని బుద్ధి గ్రహిస్తుంది. మేల్కొన్న తర్వాత కూడా, కలలో చూసిన వాటిని బుద్ధి గుర్తుంచుకుంటుంది. అందుకే నాకు కలలో అది కనిపించింది. ఇది జరిగింది అని నిద్రలేవగానే వాటి వివరాలు చెప్తుంటాం. కలలో కనిపించేవన్నీ నిజాలు కావు కానీ, అవి నిజమే అన్నట్టు బుద్ధికి అనిపిస్తాయి. రోజూ బుట్టలోని పూలను చూసే మనిషి  ఏదో ఒకరోజు అందులో పూలు లేకున్నా దాన్ని పూల బుట్ట అని గుర్తిస్తాడు!. కలలో చూసిన వాటికీ ఇదే వర్తిస్తుంది. ఇక చివరిది సుషుప్తి అవస్థ. ఈ అవస్థలో మనిషి బుద్ధి అజ్ఞానంలో, దేన్నీ గుర్తించలేని స్థితిలో ఉంటుంది. నిద్ర పోతున్నప్పుడు ప్రాణమనే పదార్థం పనిచేస్తుంటుంది. ప్రాణమే లేకుంటే మనిషికి శరీరం ఎక్కడిది? 

ఆత్మను తెలుసుకోవాలంటే.. 

ఆత్మను తెలుసుకోవాలంటే బుద్ధికి సంబంధించిన జాగ్రత్, స్వప్న, సుషుప్తావస్థల్ని వదిలేయాలని గురువులు ఉపదేశిస్తారు. ఈ మూడు దశల తరవాత వచ్చే నాలుగో దశలోనే ఆత్మను దర్శించడం సాధ్యమవుతుందని, అందుకే ఆత్మని 'తురీయం" (నాలుగోది లేదా చివరిది) అని అంటారు. చీకట్లో నేలపై పడి ఉన్న తాడును నిజమైన జ్ఞానదృష్టితో చూడకపోవడం వల్ల అది పాములా, కర్రలా, పూలదండలా బుద్ధికి తోచే అవకాశం ఉంది. దాన్నే దీపం వెలుతురులో చూసినప్పుడు అది పాము కాదని, తాడని నిజం తెలుస్తుంది. అలా యథార్థంగా తెలుసుకోవాల్సిందే ఆత్మస్వరూపం! 

ఎక్కడ చూసినా...

మేలిమి బంగారం ముద్దలో పైకి చూసినా, లోపల చూసినా కనిపించేది శుద్ధమైన బంగారమే. అలాగే పైన, లోపల ఎక్కడ చూసినా అన్నిచోట్లా యథార్థంగా కనిపించేది. ఆత్మ...  మాత్రమే. అందులో ఎలాంటి మార్పూ ఉండదు. దాన్ని తెలుసుకుంటే చాలు. అన్నీ తెలుసుకున్నట్లే. శరీరధారణతో సంక్రమించిన జాగ్రత్, స్వప్న, సుషుప్తావస్థలను మనిషి తన ప్రమేయం లేకుండా పొందుతూనే ఆత్మ స్వరూపం తెలుసుకోవడానికీ ప్రయత్నించాలి. 

ఆత్మశోధన లేకుండా కేవలం తినటం, నిద్ర, కలలకే పరిమితం కావడం మనిషి చేయాల్సిన పనులు కావు. ఆత్మ శోధనలోనే యోగులు తరించారు. కేవలం మనిషికే కాదు... ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి చివరి గమ్యం ఆత్మ దర్శనమే!. ఆ ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత లోకంలో ఇంకేదీ అవసరం ఉండదు. అసలీ లోకంతోనే పని ఉండదు.

 మిగతా ప్రాణులతో పోలిస్తే మానవుడు కొంత విశిష్టమైనవాడు .ఎందుకంటే భగవంతుడు అతనికి ప్రజ్ఞ అనే విషయాన్ని బహుకరించాడు .అదే జ్ఞానం.దీని సాయంతోనే మనిషి మోక్షగామి కాగలిగాడు .తనలోని జ్ఞానాన్ని ఉపయోగించి మనిషి మోక్షసాధనకు ప్రయత్నిస్తే పుణ్యం కలుగుతుంది .జ్ఞానాన్ని మరుగుపరుచుకుని అజ్ఞానంతో బతికితే నరకమే ప్రాప్తి .లేదంటే జంతు జన్మే గతి .పాపపుణ్యాలు సమానంగా ఉన్నప్పుడే భూమిపై తిరిగి మనిషిగా జన్మిస్తాడు

–వెలుగు, లైఫ్​‌‌–