హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఉన్నట్టా ? లేనట్టా?

హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఉన్నట్టా ? లేనట్టా?
  • తాజాగా ఏర్పాటైన హైడ్రా దూకుడు 
  • 2010లోనే ఏర్పాటైన లేక్​ ప్రొటెక్షన్​ కమిటీ  
  • చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపుపైనా ప్రత్యేక చర్యలు
  •  హైడ్రాను తెచ్చి.. కమిటీపై స్పష్టత ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీలో కబ్జాలకు గురైన చెరువుల పరిరక్షణకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ( హైడ్రా) దూకుడు చూపుతుండగా.. హెచ్ఎండీఏ పరిధిలోని లేక్​ప్రొటెక్షన్​కమిటీ ఉన్నట్టా? లేనట్టా? అన్నట్టుగా మారింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా  హైడ్రాను ఏర్పాటు చేయగా.. నెల రోజుల్లోనే దూకుడు చూపుతోంది. దీన్ని ఔటర్​రింగ్​రోడ్​లోపలి పరిధిలోకే పరిమితం చేశారు. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలోని 7 జిల్లాల్లో చెరువుల కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే లేక్ ప్రొటెక్షన్ కమిటీ భవిష్యత్ ఏంటనేది చర్చనీయాంశమైంది. 

దీన్ని 2010లో గత కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసింది. హెచ్ఎండీఏ కమిషనర్​ చైర్మన్ గా, సభ్యులుగా మెట్రోవాటర్​బోర్డు, పోలీస్​, జీహెచ్​ఎంసీ, పీసీబీ, పంచాయితీరాజ్, ఇరిగేషన్, ఈపీటీఆర్ఐ, ఎన్ జీఆర్ఐ, హైదరాబా ద్​, రంగారెడ్డి, మెదక్​, నల్గొండ, మహబూబ్​నగర్ జిల్లాల కలెక్టర్లను నియమిస్తూ  జీవో జారీ చేసింది. ఇన్నేండ్లలో కమిటీ 19 సార్లు భేటీ అయింది. చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపులపై చర్యలు తీసుకుంది. తాజాగా హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మాత్రం లేక్​ప్రొటెక్షన్​కమిటీ పై క్లారిటీ ఇవ్వడంలేదు. ఆ కమిటీ ఉంటుందా.. లేదంటే హైడ్రాలో కలిపేసి హెచ్ఎండీఏ పరిధిలో విస్తరిస్తారా? తెలియని అయోమయం నెలకొంది.  

హైడ్రాను విస్తరిస్తారా..విలీనం చేస్తారా?

 ఇన్నేండ్లలో లేక్​ ప్రొటెక్షన్​ కమిటీ  2,275 చెరువుల పరిరక్షణకు ఎఫ్​టీఎల్, బఫర్​జోన్​లను నిర్దేశించింది. కబ్జాలు, అక్రమ నిర్మాణాల తొలగింపునకు తీసుకోవాల్సిన చర్యలపైనా ప్రభుత్వానికి నివేదికను అందజేసినట్టు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి తెలిపారు. చెరువుల పరిరక్షణ పైనా సూచనలు చేస్తూ.. ఆక్రమణల తొలగింపు చర్యలను సూచించింది.  హెచ్ఎండీఏ 7,285 కి.మీ. పరిధిలో విస్తరించగా..  దీన్నికాదని ఔటర్ రింగ్ రోడ్డు లోపలి 455 చెరువుల పరిరక్షణకు హైడ్రా పని చేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. హైడ్రా.. లేక్​ప్రొటెక్షన్​కమిటీ కలిసి పనిచేస్తా యా..? లేదంటే వీటిని ఏదో ఒకదానిలో విలీనం చేస్తారా..? అనేదానిపైనా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదు. అయితే.. హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల కబ్జాలపై ప్రస్తుతం లేక్​ప్రొటెక్షన్​కమిటీకి వస్తున్న ఫిర్యాదులపైనా అధికారులు స్పందిస్తున్నారు.

 లేక్ కమిటీ దూకుడు చూపుతుందా?

గ్రేటర్​సిటీ పరిధిలోనే హైడ్రాను పరిమితం చేసి, అవతల హెచ్ఎండీఏ పరిధిని లేక్​ప్రొటెక్షన్​కమిటీకే ఉంచే చాన్స్ ఉందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.  అయితే.. హైడ్రా లెక్కనే లేక్​ప్రొటెక్షన్​కమిటీ దూకుడు చూపుతుందా? అనే చర్చ కూడా నడుస్తోంది. ఇప్పటికే హెచ్​ఎండీఏ పరిధిలో వందల సంఖ్యలో చెరువులు కబ్జా కోరల్లో చిక్కాయి. రంగారెడ్డి, మెదక్​, నల్గొండ, మహబూబ్​నగర్​వంటి జిల్లాల్లోనే ఎక్కువగా ఆక్రమణలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వాటిని తొలగించాలంటే హైడ్రా మాదిరిగానే దూకుడు చూపాల్సి ఉంటుంది. కాగా.. ఇంతకాలంగా లేక్​ప్రొటెక్షన్ కమిటీ రిపోర్టులకే పరిమితమైందనే విమర్శలు ఉన్నాయి. ఇందుకు రాజకీయ ఒత్తిళ్లతోనే యాక్షన్​తీసుకోవడంలో కమిటీ ముందుకెళ్లడంలేదు. భారీగా ఫిర్యాదులు వస్తున్నా స్పందించడంలేదు. హైడ్రా స్థాయిలో అధికారాలు కల్పిస్తే.. లేక్ ప్రొటెక్షన్ కమిటీ కూడా దూకుడు చూపుతుందని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు.