హామీలు ఏమైనయ్​ సారూ!

ఐఆర్, పీఆర్సీ, కారుణ్య నియామకాలేవీ పట్టించుకోరా..?

రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ముఖ్యమంత్రి మాట్లాడే మాటలకు చట్టబద్ధత ఉండాలి. చేసిన ప్రతి వాగ్దానం శాసనం కావాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉద్యోగులకిచ్చిన హామీలన్నీ నీటిమీద రాతలుగా మిగిలి పోతున్నాయి. 2018 ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఉద్యోగులపై వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత వాటిని పట్టించుకోనేలేదు. ఐఆర్, పీఆర్సీ, భార్యాభర్తల బదిలీలు, కారుణ్య నియామకాలు,  ఇలా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు ఆయన ఇచ్చిన హామీలు  ఎన్నో పెండింగ్ లోనే ఉండిపోయాయి. ప్రభుత్వం ఇంకా ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై స్పందన లేకుండా ఉంటే జేఏసీలు ఉద్యమించక తప్పనిపరిస్థితి వచ్చేలా ఉంది. కానీ ఉద్యోగ సంఘాలు పోరాడే పరిస్థితి ఉందా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది.

‘ఐఆర్‌‌‌‌‌‌‌‌, పీఆర్సీ గురించే ఈ సమావేశం. ఈ రోజే ఐఆర్‌‌‌‌‌‌‌‌ ప్రకటిద్దామనుకున్నాం. కానీ పీఆర్సీ కమిటీ వేయకుండా ఐఆర్‌‌‌‌‌‌‌‌ ఇవ్వటం సాంప్రదాయం కాదు. అందుకని ఈ రోజే పీఆర్సీ కమిటీని నియమించుకుందాం. ఒక ఆస్పిషియస్‌‌‌‌‌‌‌‌ డే అదే మన స్టేట్‌‌‌‌‌‌‌‌ ఫార్మేషన్‌‌‌‌‌‌‌‌ డే.. జూన్‌‌‌‌‌‌‌‌ 2 నాడు ఐఆర్‌‌‌‌‌‌‌‌ ప్రకటిస్తా. పీఆర్సీ నివేదికను ఆగస్టు 15కి వారం ముందే తెప్పించుకుని ఆగస్టు 15 నుంచి అమలు చేసుకుందాం. పీఆర్సీకి ఏడాది గడువు ఎందుకు? 3 నెలలు చాలు. అవసరమైతే ముగ్గురు కమిషనర్లను నియమించుదాం. భార్యాభర్తలు ఒకే ఆఫీసులో పని చేయాలి. లేదా పక్క పక్క ఆఫీసుల్లో ఉండాలి. ఇక ముందు భార్యాభర్తల బదిలీలపై జీరో కంప్లైంట్స్‌‌‌‌‌‌‌‌ ఉండాలి. ఉద్యోగి మరణించిన 10 రోజుల్లో వారసులకు కారుణ్య నియామకం చేస్తాం. కేబినెట్‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌ కమిటీ కొనసాగుతుంది. ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది’.. ఇవి 2018 మే 16న ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాల్లో కొన్ని. ఆ రోజు తమది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ప్రకటించుకున్నారాయన. 2014లో పెద్ద చర్చ లేకుండానే 43 శాతం ఫిట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ప్రకటించి, ఆ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌ నుంచి అమలు చేశారు. నాలుగేళ్ల తర్వాత 2018లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఐదున్నర గంటలపాటు 18 సమస్యలపై చర్చించి 13 సమస్యల పరిష్కారానికి అంగీకారం కుదిరిందని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ సంతోషించారు. కానీ ఆయన హామీలు ఇచ్చిన తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవం మూడు సార్లు వచ్చిపోయింది. కానీ ఏ  జూన్‌‌‌‌‌‌‌‌ 2న కూడా ఐఆర్‌‌‌‌‌‌‌‌ ప్రకటించలేదు. ఏమంటే ఇంకా పీఆర్సీ కమిటీ బాధ్యతలు స్వీకరించలేదన్నారు. ఆగస్టు 15లు వచ్చాయి.. పోయాయి. ఇప్పటికీ పీఆర్సీ నివేదిక రాలేదు.

ఏండ్ల తరబడి ఎదురుచూపులు

2018 జూలై 1 నుంచి అమలు జరగాల్సిన పీఆర్సీపై 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ముగ్గురు కమిషనర్లతో వేసిన కమిటీ గడువును 30 నెలలకు పొడిగించారు. భార్యాభర్తల బదిలీలు జరగనేలేదు. కారుణ్య నియామకాల కోసం ఏండ్ల తరబడి ఎదురు చూపులు తప్పటం లేదు. 2016 వేసవిలో మధ్యాహ్న భోజనం విధులు నిర్వహించిన హెడ్ మాస్టర్లు, టీచర్లకు రూ.25, రూ.18.75 చొప్పున ఇవ్వటం అన్యాయం, నిబంధనల ప్రకారం ఎర్నింగ్ లీవ్స్ ఇవ్వాలి సర్‌‌‌‌‌‌‌‌ అంటే అవును కదా, వేసవి సెలవుల్లో టీచర్ల సేవలు వినియోగించుకున్నందున ఎర్నింగ్ లీవ్స్ జమ చేయాలన్నారు సీఎం కేసీఆర్. మర్నాడే ఉత్తర్వులు ఇవ్వండి అని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. కానీ నాలుగేండ్లు గడిచిపోయినా నేటి వరకు ఉత్తర్వుల జాడ లేదు.

నియామకాలు లేక.. ఉన్న సిబ్బందిపై భారం

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ చేస్తాం, ఇక ముందు కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌, ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ వ్యవస్థనే రద్దు చేస్తాం అని 2014లో ఎన్నికలకు ముందూ, తర్వాతా చెప్పిన మాటలూ అమలులో కానరాలేదు. కనీసం ఆయా ఉద్యోగులకు చేస్తున్న పనికి సమానమైన వేతనం ఇవ్వాలని 2016 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస వేతనాలు కూడా ఇవ్వటం లేదు. రాష్ట్రంలో ప్రతి నెల సగటున వెయ్యి మంది రిటైర్‌‌‌‌‌‌‌‌ అవుతున్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికే వేలాది ఖాళీలున్నాయి. వాటిని భర్తీ చేసే ఆలోచన చేయటం లేదు. సిబ్బంది అవసరమైన స్థాయిలో లేకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే పని భారం పెరుగుతున్నది. 10 జిల్లాలను 33 జిల్లాలుగా పునర్విభజించారు. జిల్లాకో కలెక్టర్‌‌‌‌‌‌‌‌ను, ఎస్పీని ఇచ్చారు. అదేవిధంగా జిల్లాకో డీఈవోను, వివిధ కార్యాలయాల్లో తగినంత సిబ్బందిని ఇవ్వాల్సిన అవసరాన్ని మాత్రం విస్మరించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌ వయసు 61ఏండ్లు చేస్తామని హామీ చేశారు. పార్టీ మేనిఫెస్టోలోనూ ప్రకటించారు. కానీ ఇంకా అమలులోకి రాలేదు. మరోవైపు ఉపాధ్యాయులకు గత ఆరేళ్లుగా ప్రమోషన్లు లేవు. 10479 అప్‌‌‌‌‌‌‌‌గ్రేడెడ్‌‌‌‌‌‌‌‌ పండిట్‌‌‌‌‌‌‌‌, పీఈటీ పోస్టులతోపాటు ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్లు సుమారు పదివేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పదోన్నతులు ఇస్తే 25 వేల మందికి లబ్ది చేకూరుతుంది. పాఠశాలల్లో సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌ టీచర్ల కొరత  తీరుతుంది. కానీ ఉపాధ్యాయుల ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోతున్నది.

ధనిక రాష్ట్రం అంటూనే కోతలా?

నూతన సరళీకృత ఆర్థిక విధానాలకు అనుగుణంగా పెన్షన్‌‌‌‌‌‌‌‌ సంస్కరణల అమలులో భాగంగా 2004లో ఆ నాటి కేంద్ర పాలకులు ప్రవేశపెట్టిన కంట్రిబ్యూటరీ పెన్షన్‌‌‌‌‌‌‌‌ విధానాన్ని పార్లమెంటులో చట్టం కాకుండానే 2004 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 1 నుండే రాష్ట్రంలో దొడ్డిదారిన అమలు జరపగా, తెలంగాణ రాష్ట్రంలో పాత పెన్షన్‌‌‌‌‌‌‌‌ విధానాన్ని కొనసాగించుకునే అవకాశం వచ్చినప్పటికీ ఏకపక్షంగా సీపీఎస్‌‌‌‌‌‌‌‌ అమలు జరపటానికే నిర్ణయించి పీఎఫ్‌‌‌‌‌‌‌‌ఆర్డీఏతో ఒప్పందం చేసుకున్నారు. 2004 కంటే ముందే ఎంపిక జరిగి నియామక ప్రక్రియ ఆలస్యమై 2004 సెప్టెంబర్ 1 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్‌‌‌‌‌‌‌‌ వర్తింప జేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రాష్ట్రంలో ఇంకా అమలు జరగటం లేదు. మరోవైపు ధనిక రాష్ట్రం అని గొప్పలుపోతారు. కానీ లాక్‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌ విధించిన 10 రోజులకే ఏకపక్షంగా వేతనాలు, పెన్షన్లలో 3 నెలలపాటు కోత విధించారు.

జొజ్జర కొట్టి పంపేస్తున్నరు

ప్రభుత్వం ఇచ్చిన హామీలుపై పట్టీపట్టనట్టుగా ఉంటే అమలుకోసం పట్టుబట్టి అవసరమైతే పోరాడి సాధించాల్సిన బాధ్యత ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలపై ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలో సంఘాలన్ని జేఏసీగా ఏర్పడి ఉధృతమైన పోరాటాలు నిర్వహించి గణనీయమైన విజయాలు సాధించిన చరిత్ర ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో జేఏసీ పునర్నిర్మాణం జరగలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు సమస్యలపై ఐక్యంగా పోరాడే పరిస్థితి కనిపించటం లేదు. ఉద్యోగుల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరిగి పోతున్నది. ప్రభుత్వానికి ఉద్యోగులతో అవసరమొచ్చినప్పుడు కొందరు నాయకులను ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌కు పిలిపించుకుని ”త్వరలోనే మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకుందాం” అంటూ జొజ్జర కొట్టి పంపిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె సందర్భంలోనూ, హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంలో ఇలాంటి ప్రకటనలు గమనించవచ్చు. పాలకులెవరైనా, సంఘ నాయకుల రాజకీయ అనుబంధాలు ఎలా ఉన్నా సభ్యుల ప్రయోజనాలే పరమావధిగా నాయకత్వం పని చేయాలి. లేకుంటే ఆయా సంఘాల అస్థిత్వానికే ప్రమాదం కలుగుతుంది.

ప్రశ్నించే గొంతు నొక్కేస్తున్నరు

సీఎంని నేరుగా కలిసి సమస్యలు చెప్పుకునే అవకాశం లేదు. తమ శాఖలోని సమస్యలను పరిష్కరించే స్వేచ్ఛ మంత్రులకు, అధికారులకు ఉన్నట్లు కనిపించదు. ఏడేళ్లయినా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల గుర్తింపు, సివిల్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ జాయింట్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు జరగనేలేదు. సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో సంఘాలను చీల్చి కొత్త సంఘాలను పెట్టించిన వారే ఇప్పుడు ఇన్ని సంఘాలెందుకంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేస్తున్నారు. సంఘాల మధ్య ఐక్యతాలోపం వలన కొత్త డిమాండ్లను సాధించుకోవటం కాదు కదా ఉన్న హక్కులను కూడా కాపాడుకోలేని స్థితి ఏర్పడింది. చివరకు నెల మొదటి తేదీన జీతం ఇవ్వమని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగులంతా సంఘటితమై ప్రభుత్వాన్ని నిలదీయగలిగినపుడు మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప పాలకుల దయాదాక్షిణ్యాలతో ఎన్నడూ పరిష్కారం కాలేదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడటానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలన్ని ఏకతాటి మీదికి వచ్చి పోరాటాలు నిర్వహించటం మినహా మరో మార్గం లేదు. సంఘాల నాయకులను అందుకు మానసికంగా సిద్దం చేయాల్సిన బాధ్యత ఆయా సంఘాల సభ్యులదే.-చావా రవి, టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి