సీఎం మాటిచ్చి ఆరేళ్లవుతున్నా ముందుకు కదల్లే
సినీ ప్రముఖుల మీటింగ్‌తో మళ్లీ తెరపైకి
వికారాబాద్ , యాదాద్రి ప్రాంతాలపైనా నజర్
హైదరాబాద్, వెలుగు: ‘రాచకొండలో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తం’.. ఇదీ రాష్ట్రం వచ్చిన కొత్తలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ. అంతేకాదు.. 2014 డిసెంబర్లో సీఎం ఏరియల్సర్వే కూడా చేశారు. అక్కడ ఉన్న 33 వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో ఫిల్మ్ సిటీ కోసం 2 వేల ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ, ఆ తర్వాత దాని ఊసే లేదు. ఈ ఆరేళ్లలో ఆ విషయం ప్రస్తావనే రాలేదు. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌తో చిరంజీవి, నాగార్జున భేటీ సందర్భంగా మళ్లీ ఫిల్మ్ సిటీ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. అయితే, ఈసారైనా అది అమలవుతుందా లేదా అన్న దానిపై ప్రభుత్వ వర్గాలే వేర్వేరు అభిప్రాయాలు చెప్తున్నాయి. కేవలం మాట వరుసకే అన్నారని కొందరంటుంటే.. ఈసారి అమలు చేస్తారని మరి కొందరు చెబుతున్నారు.
ప్లేస్ చేంజ్ చేస్తరా?
ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ అయితే ఇచ్చారు గానీ.. ఎక్కడ అన్న దానిపైనే ఇప్పుడు మరిన్ని వాదలు వినిపిస్తున్నాయి. రాచకొండ కాకుండా వేరే ప్రాంతాల్లో పెట్టాలన్న ఆలోచనలోనూ సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. రాచకొండతో పాటు వికారాబాద్, యాదాద్రిలనూ పరిశీలిస్తున్నట్టూ అధికారులు చెబుతున్నారు. రాచకొండ ప్రాంతంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీల ఏర్పాటుకు కొందరు ఇండస్ట్రియలిస్టులు ప్రభుత్వానికి ప్రతిపాదించారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిల్మ్ సిటీ రాచకొండలో కాకపోతే.. ఫస్ట్ ఆప్షన్‌గా వికారాబాద్‌వైపు చూస్తున్నట్టు చెబుతున్నారు. అక్కడి అటవీ ప్రాంతానికి సమీపంలో ప్రభుత్వానికి వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడం, తరచూ అక్కడ షూటింగ్‌లు జరుగుతుండడంతో ఫిల్మ్‌సిటీ ఏర్పాటుకు ఆ ప్లేస్ బాగుంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్న చర్చ కూడా నడుస్తోందని అధికారులు అంటున్నారు. యాదాద్రి టెంపుల్‌ను భారీ హంగులతో పునర్నిర్మిస్తున్న నేపథ్యంలో.. అక్కడ కూడా ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అంశమూ పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు.