- వీసీలను నియమించిన్రు సరే..
- వర్సిటీలు, కాలేజీల్లో సౌలతుల సంగతేంది?
రాష్ట్రంలో యూనివర్సిటీలకు సుదీర్ఘ కాలంపాటు ఎదురుచూపుల తర్వాత ప్రభుత్వం ఇటీవలే కొత్త వైస్ చాన్స్ లర్ లను నియమించింది. పదకొండు యూనివర్సిటీలకు కొత్తగా నియమించిన వీసీలు ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్, టీచింగ్, రీసెర్చ్, వసతుల కల్పన వంటి అంశాలపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అన్న విషయంపై ప్రభుత్వం డేగ కన్నుతో పరిశీలిస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. యూనివర్సిటీలు, కాలేజీల్లో ఖాళీల భర్తీలు, వసతుల సంగతి పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో సౌలతులు మెరుగుపర్చకుండానే కొత్తగా తెస్తున్న క్లస్టర్ విద్యా విధానం వల్ల ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు మాత్రమే మేలు జరుగుతుంది.
రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలకు పూర్తి స్థాయి వీసీలు లేని సమయంలో వర్సిటీల్లో చదువుకుంటున్న విద్యార్థులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి? అన్న సందిగ్ధంలో ఉండేవారు. యూనివర్సిటీల్లో తాత్కాలిక వీసీలు ఒక్కనాడు కూడా వర్సిటీల్లో తిరిగి సమస్యలను పరిశీలించిన దాఖలాలు లేవు. గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ఒకటి రెండు సార్లకు మించి తాత్కాలిక వీసీలు విశ్వవిద్యాలయాలకు వచ్చిన సందర్భాలు మనకు కనబడవు. అయితే యూనివర్సిటీలలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించటానికి తమ చేతుల్లో ఏమీ లేదంటూ వర్సిటీల రిజిస్ట్రార్ లు ఎప్పటికప్పుడు స్పష్టం చేయడంతో తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ స్థితిలో పడ్డారు విద్యార్థులు. దీంతో గత రెండేండ్లుగా యూనివర్సిటీల్లో సమస్యలపై ధర్నాలు, ఆందోళనలు లేకుండా సైలెంట్ గానే గడిచిపోయాయని చెప్పొచ్చు. ఎట్టకేలకు వీసీల నియామకం జరగడంతో వర్సిటీలు ఇప్పటికైనా గాడిలో పడతాయని విద్యార్థులు ఆశిస్తున్నారు.
క్లస్టర్ విధానంపై కసరత్తు
వర్సిటీలకు వీసీల నియామకం తర్వాత వీసీలు చేపడుతున్న చర్యలను సర్కార్ నిశితంగా పరిశీలిస్తోంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా వీసీల అడ్మినిస్ట్రేషన్ తీరు, ఇతర చర్యలు, వర్సిటీల పనితీరు గురించి వివరాలను తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. యూనివర్సిటీలు, కాలేజీల్లో ఉన్నత విద్యా శాఖ కొత్తగా అమలు చేయనున్న క్లస్టర్ విద్యా విధానం అమలుకు జరుగుతున్న కసరత్తుపైనా సర్కార్ ఫోకస్ పెట్టింది.
ప్రైవేట్ కు పెద్దపీట వేసేందుకే?
క్లస్టర్ విద్యా విధానంపై చాలామంది మేధావులు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు పెద్దపీట వేయడానికే రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఈ సిస్టంను అమలు చేయాలని చూస్తోందని భావిస్తున్నారు. ఈ సిస్టం వల్ల ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు మరింత బలోపేతం కావడానికి అవకాశం ఉందని, అదే సమయంలో ప్రభుత్వ యూనివర్సిటీలు, కాలేజీలు పూర్తిస్థాయిలో నిర్వీర్యం అయ్యే పరిస్థితి వస్తుందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలకే మొగ్గు చూపితే, ప్రభుత్వ కాలేజీలు వెనకపడతాయని, లెక్చరర్లు అడ్డా మీద కూలీలుగా మారే ప్రమాదం ఉంటుందని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యావేత్తలు చెప్తున్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలు, కాలేజీల్లో మౌలిక వసతులు ఏమాత్రం మెరుగుపర్చకుండా, ప్రైవేట్ కాలేజీలతో కలిపి క్లస్టర్లుగా మారిస్తే ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు మరింత నిర్వీర్యం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దోస్త్ విధానం ద్వారా ప్రైవేట్ విద్యా సంస్థల బలోపేతానికి సర్కార్ సహకరిస్తోందని, క్లస్టర్ విధానంతో ప్రభుత్వ విద్యా సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి.
వర్సిటీలు, కాలేజీలు మెరుగవ్వాలె..
ప్రభుత్వ యూనివర్సిటీలు, కాలేజీల్లో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు అన్ని రకాల వసతుల కల్పనతో ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు, లెక్చరర్లు, విద్యార్థి సంఘాల నేతలు సూచిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత యూనివర్సిటీలపై తీవ్ర నిర్లక్ష్యం చూపిన ప్రభుత్వం ఇకనైనా తన వైఖరిని మార్చుకోవాలని కోరుతున్నారు. సుదీర్ఘకాలం తర్వాత అయినా.. వర్సిటీలకు పూర్తిస్థాయి వీసీలను నియమించారు.అయితే వసతుల కల్పనపై కూడా ర్కారు దృష్టి పెట్టాలని అంటున్నారు. ఇందుకోసం కొత్త వీసీలు కూడా సమగ్ర చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
సర్కార్ కాలేజీలపై ‘క్లస్టర్’ పిడుగు
డిగ్రీ కోర్సుల బోధనలో సమూల మార్పులు తీసుకురావడానికి ఉన్నత విద్యా శాఖ చేపడుతున్న చర్యలు, ముఖ్యంగా క్లస్టర్ ఎడ్యుకేషన్ సిస్టంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ నాశనం అవుతుందని పలువురు విద్యావేత్తలు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 2021-–- 2022 విద్యా సంవత్సరం నుంచే కొత్త విద్యా విధానంలో క్లస్టర్ విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టాలని ఎలాంటి చర్చలు, సంప్రదింపులు లేకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నది. దీంతో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. క్లస్టర్ విద్యా వ్యవస్థలో భాగంగా.. పది డిగ్రీ కాలేజీలను ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో డిగ్రీ విద్యార్థులు క్లస్టర్ లోని ఏ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నా, తమకు నచ్చిన కాలేజీలోనే క్లాసులకు హాజరు కావచ్చని చెప్తున్నారు. మొదటి దశలో ఆరు కాలేజీలను మాత్రమే కలిపి క్లస్టర్ సిస్టంను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. క్లస్టర్ విద్యా వ్యవస్థలో ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, రెండు ప్రైవేట్ కాలేజీలు, మూడు యూనివర్సిటీ కాలేజీలను భాగస్వామ్యం చేయనున్నట్లు ఉన్నత విద్యా శాఖ యాక్షన్ ప్లాన్ ప్రకటించింది.
- డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ, వరంగల్