నేను బాగున్నాను.. ఆందోళన అవసరం లేదు: అల్లు అర్జున్

నేను బాగున్నాను.. ఆందోళన అవసరం లేదు: అల్లు అర్జున్

సంధ్య థియేటర్ ఘటనలో నాటకీయ పరిణామాల మధ్య అరెస్టై విడుదలైన అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లో మీడియా తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు చట్టంపై గౌరవం ఉందని, కోర్టులో కేసు ఉన్నందున ఆ విషయంపై ఏమీ మాట్లడనని  అన్నారు. తనకు మద్ధతుగా నిలిచిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం దురదృష్టకరమని, ఆ కుటుంబానికి సానుభూతి చెబుతున్నట్లు తెలిపారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. గత 20 ఏళ్లుగా థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తున్నానని, ఎప్పుడూ ఇలా జరగలేదని, ఇది అనుకోకకుండా జరిగిన ఘటన అని విచారం వ్యక్తం చేశారు. అరెస్టు పరిణామం తన ఫ్యామిలీకి ఛాలెంజింగ్ సిచువేషన్ అని అన్నారు. 

పుష్ప2 ప్రీమియర్ షో కోసం అల్లు అర్జున్ థియేటర్ కు వెళ్లడం, అభిమానులు భారీగా చేరుకోవడంతో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందడం, దీంతో థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కేసులు నమోదవడం తెలిసిన విషయమే. అయితే ఈ కేసులో శుక్రవారం మధ్యాహ్నం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్టు చేసి.. అతని స్టేట్ మెంట్ తీసుకొని ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అటునుండి నేరుగా చెంచల్ గూడ జైలుకు తరలించారు. రాత్రంతా జైలులోనే ఉన్న అల్లు అర్జున్ ఉదయం ఆరున్నర ప్రాంతంలో జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. చెంచల్ గూడ జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన అల్లు.. అక్కడ లాయర్లతో సుమారు అరగంటకు పైగా చర్చలు జరిపి ఇంటికి వెళ్లారు.