నిత్యావసర స్టోర్లకు అమెరికన్ల రష్

నిత్యావసర స్టోర్లకు అమెరికన్ల రష్

వాషింగ్టన్: వివిధ దేశాలపై భారీగా సుంకాలు విధిస్తూ ప్రెసిడెంట్  డొనాల్డ్  ట్రంప్  తీసుకున్న నిర్ణయం ఆ దేశ పౌరులపై తీవ్రంగా  ప్రభావం చూపుతున్నది. ట్రంప్  టారిఫ్​లు అమల్లోకి రాకముందే అమెరికన్లు నిత్యావసర స్టోర్లకు పరుగులు పెడుతున్నారు. ధరలు పెరగక ముందే తమకు కావాల్సిన వస్తువులను కొంటున్నారు. దీంతో దేశంలోని నగరాల్లో నిత్యావసర దుకాణాలన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్  వస్తువులకు విపరీతమైన డిమాండ్  ఏర్పడింది. తైవాన్  నుంచి అమెరికాకు ఎలక్ట్రానిక్  ఉత్పత్తులు భారీగా దిగుమతి అవుతాయి. 

తైవాన్ పై 32 శాతం సుంకాలు విధించడంతో ఎలక్ట్రానిక్  వస్తువుల ధరలు గణనీయంగా పెరగనున్నాయి. దీంతో ఉన్న సమయంలోనే తమకు అవసరమైన వస్తువులు కొని ధరాఘాతం నుంచి తప్పించుకోవాలని అమెరికన్లు భావిస్తున్నారు. ‘‘ఓ హైఎండ్  ఫీచర్లున్న ల్యాప్ టాప్  కొనాలని గత కొద్ది రోజులుగా నేను ప్లాన్  చేస్తున్నాను. నా ఫొటోగ్రఫీ కోసం మంచి స్టోరేజీ ఉన్న ల్యాప్ టాప్  కొనాలనుకుంటున్న. అందుకోసం తైవాన్  బ్రాండ్  ప్రోడక్ట్ ను ఆర్డర్  చేశా. 

అయితే, తైవాన్ పై అధ్యక్షుడు ట్రంప్  32 శాతం దిగుమతి సుంకాలు విధించడంతో రేట్లు మరింత పెరగనున్నాయి. అదృష్టవశాత్తు ట్రంప్  కొత్త టారిఫ్​లు ప్రకటించే ముందే నేను ఆర్డర్  పెట్టిన. కాబట్టి నా మీద ప్రభావం ఉండదు” అని జాన్  గుటెర్రెస్  తెలిపాడు. కాగా.. ట్రంప్  టారిఫ్ లు అమెరికా కాలమానం ప్రకారం ఈనెల 5న అమల్లోకి వచ్చాయి.

ఎగ్జిక్యూటివ్  ఆర్డర్లపై 500 న్యాయ సంస్థల దావా

లీగల్  కమ్యూనిటీని టార్గెట్  చేస్తూ ట్రంప్  జారీచేసిన ఎగ్జిక్యూటివ్  ఆర్డర్లను 500 న్యాయ సంస్థలు శుక్రవారం కోర్టులో సవాలు చేశాయి. అమెరికాలో ప్రఖ్యాత న్యాయ సంస్థల నుంచి మినహాయింపులు పొందేందుకు, కొన్నింటిని శిక్షించేందుకు ట్రంప్  ఇదివరకే ఎగ్జిక్యూటివ్  ఆర్డర్లు జారీచేశారు. దీనిపై న్యాయ సంస్థలు ఫెడరల్  కోర్టులో కేసు వేశాయి.