కవర్ స్టోరీ : షాపింగ్​​..   డిజార్డర్..!

కవర్ స్టోరీ : షాపింగ్​​..   డిజార్డర్..!

షాపింగ్... అంటే సరదా కాదు. అదొక ఎమోషన్’’​ అంటున్నారు నేటి జనరేషన్. కొత్త డ్రెస్, కొత్త నగ, కొత్త చెప్పులు, కొత్త గాడ్జెట్స్.. ఇలా కొత్త వాటిపై కాస్త మక్కువ ఎక్కువ. అప్పటికే ఆ వస్తువులు ఉన్నా, అవసరం లేకపోయినా వాటిని కొనేవరకు మనసు లాగుతూనే ఉంటుంది. తీరా కొన్న తర్వాత దాని వాడకం మూన్నాళ్ల ముచ్చటే. ఒకట్రెండు సార్లు వాడాక కొత్త మురిపెం తీరిపోతుంది. అది తీరగానే పక్కన పడేయడమే. నెల తిరగక ముందే మళ్లీ కొత్త వాటి కోసం వేట మొదలు. క్రెడిట్ కార్డుల కల్చర్​ వచ్చాక కొత్తవి కొనాలంటే డబ్బులు చేతిలో.. కాదు కాదు... బ్యాంకులో కూడా ఉండాల్సిన పని లేకుండా పోయింది.

క్రెడిట్​ కార్డుతో కొనేస్తున్నారు. ఖాళీ టైం దొరికినా, స్ట్రెస్​లో ఉన్నా... ఆన్​లైన్​లో​ గేమ్స్ ఆడినంత ఈజీగా​ షాపింగ్ చేసేస్తున్నారు. ‘ఆన్​లైన్​లో చూసినంత మాత్రాన కొనేస్తారా?’ అని కొందరు అనొచ్చు. కానీ, అలా చూడటం కూడా తగ్గించుకోవాలి. లేదంటే మెంటల్​ హెల్త్​ మీద ఎఫెక్ట్​ బాగానే పడుతుందని మరీ మరీ హెచ్చరిస్తున్నారు ఎక్స్​పర్ట్స్.  

ఒకప్పుడు షాపింగ్ చేయాలంటే.. ఒక టైం పెట్టుకుని, ఫలానా రోజు బయటికి వెళ్లాలి. అలా వెళ్లినప్పుడు ఇంట్లో నిండుకున్న సరుకుల నుంచి కాళ్లకు వేసుకునే చెప్పుల వరకు అన్నీ ఒకేసారి కొనుక్కునే వాళ్లు. కానీ తరువాత తరువాత... నెలకు నాలుగు ఆదివారాలు ఉంటే అందులో ప్రతి వారం షాపింగ్​కి వెళ్లడం మొదలుపెట్టారు కొందరు. వాళ్లు ఒక్కోవారం ఒక్కో షాపింగ్​ చేసేవాళ్లు. ఒకవారం బట్టలు, చెప్పులు.. మరో వారం ఇంట్లోకి కావాల్సినవి మాత్రమే కొనేలా ప్లాన్ చేసుకునేవాళ్లు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ తీరు కూడా మారిపోయింది.

ఏ పని మీద బయటకు వెళ్లినా ఏదో ఒకటి షాపింగ్ చేయకుండా వచ్చేవాళ్లు కాదు. వేరే ఊళ్లకు వెళ్తే షాపింగ్​కి ప్రత్యేకంగా ఒక షెడ్యూల్ పెట్టుకుంటారు. ఇదంతా చదువుతుంటే... ‘ఇంత షాపింగ్ చేస్తున్నామా?’ అనిపించొచ్చు. కానీ, ఇదంతా చాలా మామూలు విషయం. ఇప్పుడు చెప్పబోయేది అంతకు మించింది. చాలా ప్రమాదకరమైనది కూడా. అదే.. ‘ఆన్​లైన్​ షాపింగ్​’. ఆన్​లైన్​లో షాపింగ్​ చేస్తే అంత ప్రమాదం ఏం ఉంటుంది? కాస్త ఓవర్​ కాకపోతే.. అంటున్నారు కదా! కానీ ఇది జోక్​ కాదు. చాలా సీరియస్​గా మాట్లాడుకోవాల్సిన విషయం అంటున్నారు ఎక్స్​పర్ట్స్. అది ఎందుకో వివరించేదే ఈ వారం కవర్​ స్టోరీ.

షాపింగ్ చేయడం ఎక్కువైతే అది ‘ఓనియో మానియా’గా మారుతుంది.  ఓనియో మానియా కేవలం ఆన్ లైన్ షాపింగ్ కి మాత్రమే కాదు. ఏదైనా సరే కంట్రోల్ లేకుండా కొనడాన్ని ఇలా పిలుస్తారు. అయినా ఎక్కువగా  ప్రపంచంలో పెద్దన్నగా చెప్పుకునే అమెరికాలో ఐదు శాతం మంది ఓనియో మానియాతో బాధపడుతున్నారనేది ఒక అంచనా. ఇక్కడే ఇంకో విషయం చెప్తున్నారు ‘ఆన్​లైన్​ షాపింగ్​కి అడిక్ట్​ అవ్వడం అంటే.... జూదం లేదా సెక్సువల్​ అడిక్షన్​ వంటి వాటికి అడిక్ట్ అవ్వడం లాంటిదేన’ని చెప్తున్నారు ఎక్స్​పర్ట్స్​. ఇందులో నిజమెంత? అనే ప్రశ్న తలెత్తుతుంది ఎవరికైనా. అందుకు సమాధానం... ఆన్​లైన్​ షాపింగ్​ వల్ల వచ్చే యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటివి​. అవి డిజార్డర్​కి దారితీస్తాయి. అదే.. కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్​.

దీన్నే ఓనియో మానియా, బైయింగ్ షాపింగ్ డిజార్డర్ (బీఎస్​డీ), పాథలాజికల్ బైయింగ్ అనే పేర్లతో పిలుస్తారు. మామూలుగా అయితే ఇంటర్నెట్​ వాడకం, షాపింగ్ చేయడం ఈ రెండూ మెదడుకు సంతోషాన్నిచ్చే అంశాలు. ఇంటర్నెట్​ వాడేటప్పుడు లేదా షాపింగ్ చేసేటప్పుడు మనసుకు నచ్చింది చేస్తుంటారు. కాబట్టి మెదడులో ‘డోపమైన్’ అనే హార్మోన్​ విడుదలవుతుంది. ఈ హార్మోన్​ని హ్యాపీ హార్మోన్ అని అంటారు. ఇది మనసుకు హాయిని కలిగిస్తుంది. మరయితే ఆన్​లైన్​లో షాపింగ్ చేస్తే..? ఇంకా హ్యాపీగా ఉండొచ్చు కదా అనుకోవచ్చు. అలా అనుకోవడం పెద్ద పొరపాటు. ఆన్​లైన్​ షాపింగ్​ మరీ ఎక్కువగా చేస్తుంటే కనుక దానివల్ల హ్యాపీనెస్ రావడం సంగతి పక్కన పెడితే.. అప్పటివరకు ఉన్న హ్యాపీనెస్​ కూడా హుష్​ కాకి అవుతుందట!

ఆ రెండూ కలిస్తే అంతే...

 ‘‘ఇంటర్నెట్ వాడకం, షాపింగ్​ అనేవి రెండూ మితంగా ఉండాలి. వీటిలో ఏది ఎక్కువైనా వ్యసనంగా మారే అవకాశాలు చాలా ఎక్కువ. అలాంటిది ఆ రెండూ కలిస్తే? ఫలితంగా మెదడులో డోపమైన్​ రష్ పెరుగుతుంది’’ అంటున్నారు డాక్టర్​ ఇలియాజ్​. ఈయన స్టాన్​ఫోర్డ్ యూనివర్సిటీలో సైకియాట్రి డిపార్ట్​మెంట్​ క్లినికల్ ప్రొఫెసర్, స్టాన్​ఫోర్డ్ ఓసీడీ క్లినిక్​ డైరెక్టర్. ఈయన కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్​ లేదా షాపింగ్ అడిక్షన్​ గురించి స్టడీ చేశాడు. ఈయన చెప్పేదాన్ని బట్టి... ఆన్​లైన్​లో షాపింగ్ చేయడం వల్ల వెంటనే ఒకలాంటి తృప్తి కలుగుతుంది. కాబట్టి దాన్ని తప్పించుకోవడం కష్టమనే చెప్పాలి.

ఇది యాంగ్జయిటీ, డిప్రెషన్​ వంటివి ఉన్నవాళ్లపై ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. దాంతో వాళ్లలో అప్పటికే ఉన్న సమస్య అంతకుముందుకంటే ఎక్కువయ్యే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ‘డిప్రెషన్​’ అనేది ట్రీట్​మెంట్​కి తగ్గిపోయే స్టేజ్​లో ఉండాలి. అంతేకానీ, ట్రీట్​మెంట్ చేయలేని పరిస్థితికి చేరుకుంటే.. దాన్నుంచి బయటపడడం చాలా కష్టం. ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే వెంటనే అది పరిష్కారం అయిపోవాలి అనుకోవడం సహజం. ఈ విషయంలో కూడా అంతే.. డిప్రెషన్ అనేది  చాలా త్వరగా తగ్గిపోవాలి. వెంటనే మంచి మూడ్​లోకి వెళ్లిపోవాలి అనుకుంటారు. అందుకని మూడ్ సెట్ అవ్వడానికి తాత్కాలికంగా ఏదైనా ఎలిమెంట్​ ఉంటే బాగుండు అని ఆప్షన్స్ వెతుక్కుంటారు. 

ఈ విషయాన్ని ప్రాక్టికల్​గా చెప్పేందుకు నా ఉదాహరణ చెప్తా. కొవిడ్ ప్యాండెమిక్ మొదలయిన కొన్ని నెలల్లోనే మూడ్​ బూస్ట్​ దేనివల్ల అవుతుందా అని చూశా. ఆ పరిస్థితుల్లో కూడా నేను షాపింగ్​కి అడిక్ట్​ కాలేదు. అప్పుడప్పుడు యాంగ్జైటీ, స్ట్రెస్, ఒంటరిగా కూర్చుని ఆన్​లైన్​ షాపింగ్ చేయడం వంటివి చేశా. షాపింగ్ చేసినవి వచ్చాక షాపింగ్ గురించి మళ్లీ ఆలోచించలేదు. అయితే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే... షాపింగ్ చేయడం వల్ల లేదా కొన్న వస్తువుల వల్ల నాకు హ్యాపీనెస్ రాలేదు. కానీ, ఆన్​లైన్​లో షాపింగ్ చేశాక అవి నా దగ్గరకు వచ్చేవరకు ఎదురు చూసినప్పుడు సంతోషం కలిగింది. అంటే... ఆ ఎదురుచూపుల్లోనే నా సంతోషం ఉందన్నమాట! షాపింగ్​ చేసిన వస్తువులు నా దగ్గరకి వచ్చాక అంత సంతోషంగా ఏం అనిపించలేదు” అని ఆన్​లైన్​ షాపింగ్​లో హ్యాపీనెస్ తనకు ఎక్కడ దొరికిందో చెప్పారు డాక్టర్ ఇలియాజ్.

ఇదే విషయం గురించి క్లినికల్ సైకాలజిస్ట్, అసోసియేట్​ ప్రొఫెసర్​ థియా మాట్లాడుతూ... ‘‘ప్రతి ఒక్కరి విషయంలో జరిగేది ఇదే. షాపింగ్​ కార్ట్​లో వస్తువులు నింపేయడం లేదా కొనడం వల్ల వచ్చే ఎనర్జీని మాటల్లో చెప్పలేం. కొన్న వస్తువులు చేతిలోకి వచ్చాక ఉండే ఫీలింగ్​ కంటే.. షాపింగ్​ కార్ట్​లోకి వస్తువులను పెట్టినప్పుడు వచ్చే ఫీలింగ్​ చాలా ఎక్కువ రెట్లు ఉంటుంది. ఇదే విషయం మీద గతంలో ఎలుకల మీద స్టడీ చేసినప్పుడు కూడా ‘డోపమైన్ రష్’ జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

ఆ స్టడీలో బెల్​ రింగ్​ అవ్వగానే.. ఎలుకలు కొకైన్ (డ్రగ్) వస్తుందని ఆశించేవి. కానీ, ఆ డ్రగ్ వాటి దగ్గరకు చేరకముందే వాటి మైండ్​లో డోపమైన్​ రష్ జరిగేది. అందుకు కారణం డ్రగ్ ఇవ్వబోయేముందు బెల్ మోగుతుందన్న విషయం వాటికి తెలుసు. కాబట్టి బెల్​ మోగగానే అవి ఎగ్జైట్​ అవుతాయి. అదే ఆన్​లైన్ షాపింగ్ విషయానికొస్తే.. అందులో కొకైన్​ వంటి ఏ డ్రగ్ ఉండదు. కానీ, డోపమైన్​ బంప్​ మాత్రం ఉంటుంది. దానివల్లే మళ్లీ మళ్లీ షాపింగ్ చేయాలి అనుకుంటారు’’ అని చెప్పారు ఎన్​వైయు లాంగోన్ హెల్త్​ యూనివర్సిటీకి చెందిన ఈ ప్రొఫెసర్​. 

కొన్నేండ్ల క్రితమే చెప్పాయి

ఆన్‌లైన్‌ లో విచ్చలవిడిగా షాపింగ్ చేయటం 2024 నాటికి మానసిక వ్యాధిగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019 లోనే హెచ్చరించింది. స్మార్ట్ ఫోన్​లో, ఇతర డిజిటల్ మాధ్యమాల ద్వారా అతిగా షాపింగ్ చేయటం వలన ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకునే వాళ్ల సంఖ్య పెరగడమే ఇందుకు కారణం అని ఈ అంశంపై రీసెర్చ్‌ చేసిన గార్ట్‌‌నర్‌ అప్పుడే చెప్పింది. ఇది అమెరికన్​ టెక్నలాజికల్​ రీసెర్చ్​ అండ్​ కన్సల్టింగ్​ ఫర్మ్​ . ‘ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కోసం కస్టమర్లు ఖర్చుపెట్టే డబ్బు మొత్తం 2022 నాటికి10 శాతం పెరుగుతుంది. దీనివల్ల కోట్ల మంది అప్పుల బారినపడతారు.  

తరచూ షాపింగ్‌ చేసేలా ఆయా కంపెనీలు ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌, పర్సనలైజేషన్‌‌ టెక్నాలజీ ద్వారా కస్టమర్స్​ని ఆకర్షిస్తాయి. కాలు కదపకుండా ఇంటి నుంచి కొనడం అనేది రానురాను పెరుగుతుంది. దానివల్ల ఆర్థిక పరిస్థితి తలకిందులు అవుతుంది’ అని కొన్నేండ్ల క్రితమే అంచనా వేశారు. జర్నల్ ఆఫ్​ కన్జ్యూమర్​ సైకాలజీ 2014 లో చేసిన స్టడీ ప్రకారం, రిటెయిల్ థెరపీ అనేది క్షణికానందాన్ని ఇస్తుంది. దానికి అలవాటు పడితే దీర్ఘకాలికంగా బాధపడాల్సి వస్తుంది. మిచిగాన్ యూనివర్సిటీ కూడా దీనిపై 2014 లోనే ఒక స్టడీ చేసింది. అందులో ఆన్​లైన్​లో చూసి షాపింగ్ చేయకుండా వదిలేసిన వాళ్ల కంటే తమకు నచ్చిన వాటిని కొన్న వాళ్లలో 40 రెట్ల కంటే ఎక్కువ సంతోషం దొరికిందని తేలింది.

షాపింగ్ మానేయొద్దు కానీ..

ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో మెంటల్ హెల్త్ సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంతో తాత్కాలికంగా దొరికే సంతోషం కూడా చూస్తున్నారు. అదే కంపల్సివ్ షాపింగ్​ చేసేందుకు దారితీస్తుంది. ఒత్తిడి, ఆందోళన, ఆత్మన్యూనత వంటి ఎమోషన్స్​ని ఇది దాచిపెడుతుంది. షాపింగ్ చేయడం అదుపు చేసుకోలేకపోతే షేమ్​గా ఫీలయ్యేలా చేస్తుంది. అలాగని ఆన్​లైన్ షాపింగ్​ చేయడం మానలేరు. కానీ, అదో వ్యసనంలా కాకుండా హ్యాపీగా షాపింగ్ చేయలేరా? అంటే.. ఎందుకు  చేయలేరు కచ్చితంగా చేయొచ్చు అంటున్నారు ఎక్స్​పర్ట్స్. 

అదెలాగంటే...రెండు రకాల మనుషులు

మొదటి నియమం.. ఎవరైనా, ఎప్పుడైనా మంచి వాటిపైనే దృష్టిపెట్టాలి. నిర్ణయాలు తీసుకునే విషయంలో డెసిషన్ మేకర్స్ రెండు రకాల వాళ్లు ఉంటారు. ఒకరు పరిపూర్ణవాదులు (మ్యాగ్జిమైజర్స్) . వీళ్లెలా ఉంటారంటే.. ఒకటి ప్రయత్నిస్తే దాని ఫలితం బెస్ట్​గా ఉండాలని కోరుకుంటారు. ఆ రిజల్ట్​ బెస్ట్​గా ఉండడం కోసం ఎంత ప్లానింగ్ చేశారు? ఎంత టైం పట్టింది? వంటి విషయాలేవీ పట్టించుకోరు. వాళ్లకు కావాల్సింది కోరుకున్నది కోరుకున్నట్టే జరగడం. 

రెండో రకం వాళ్లు తృప్తిపరులు(శాటిస్​ఫయర్స్). వాళ్లు అనుకున్న వాటిలో ఎన్ని కరెక్ట్​గా జరిగాయి? అనేది చూసుకుని వాటికి టిక్​ మార్క్​ పెట్టుకుని తృప్తి పడతారు. ఇటువంటి వాళ్ల లైఫ్​ ఎప్పటిలానే నడుస్తుంటుంది. ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు ఇక్కడ చెప్పుకున్న రకాల్లో రెండో రకం వాళ్లలా ఉండడం బెటర్. ఇలా ఉంటే కోరుకున్న ఐటెమ్ దొరకలేదని బాధపడాల్సిన అవసరం ఉండదు. రీసెర్చ్​లో కూడా.. మంచి నిర్ణయాలు తీసుకునే వాళ్లు సంతోషంగా ఉన్నారు. చాలా తక్కువ సార్లు నిరాశకి గురయ్యారు అని తేలింది.

క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్​ సేవ్​ చేయొద్దు!

ఇంపల్సివ్​ బైయింగ్ డిజార్డర్ బారిన పడకుండా ఉండాలంటే ఆటోమెటిక్​గా జరిగే పనులకి ఫుల్​స్టాప్​ పెట్టాలి. ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలంటే.. క్రెడిట్​ కార్డ్​తో ఆన్​లైన్​ షాపింగ్​ చేస్తుంటారు చాలామంది. అయితే, కార్డు ద్వారా ఆన్​లైన్​ షాపింగ్​ చేయాలంటే కార్డ్ డీటెయిల్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్​ ఎంటర్​ చేయాల్సి ఉంటుంది. అదంతా ఒకసారి సేవ్ చేశారంటే షాపింగ్​ ఈజీ అయిపోతుంది.

అంటే.. ఆటోమెటిక్​గా అయిపోయే పనులకు అలవాటు పడినట్టే. ఈ అలవాటును తగ్గించుకుంటే చాలా బెటర్. అందుకని క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్​ని సేవ్​ చేయొద్దు. అప్పుడు షాపింగ్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడల్లా కార్డ్ డీటెయిల్స్ అన్నీ మళ్లీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి తరచూ ఆన్​లైన్​లో షాపింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ కొంతవరకు తగ్గుతుంది అంటున్నారు డాక్టర్ ఇలియాజ్.

వెయిటింగ్ పీరియడ్

ఏ వస్తువైనా కొనేటప్పుడు అది మనకు ఇప్పుడు అవసరమా? కాదా? అనే ప్రశ్న వేసుకోవాలి. ఆ తర్వాతే వాటిని కొనేందుకు సిద్ధం కావాలి. అవి అప్పటికి అవసరం లేదనిపిస్తే వాటిని కొనకూడదు. అలా కొనకుండా ఉండాలంటే.. వాటిని కార్ట్​లో వేసుకునో, విష్​లిస్ట్​లో పెట్టుకునో కొంత టైం వెయిటింగ్​లో పెట్టాలి. అది ఒకరోజు, వారం, నెల అయినా కావచ్చు. షాపింగ్ చేసే యాప్​లోనే వెయిటింగ్​లో ఎందుకు అనుకుంటే.. వేరే చోట నోట్​ చేసి పెట్టుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అనవసరమైన వాటిని వెంటనే కొనొద్దు. 

ఇలా చేయడం వల్ల వెయిటింగ్ అయిపోయేలోపు దాన్ని కొనాలనే ఆలోచన మారొచ్చు అని జె.బి మెకిన్నన్ అనే పుస్తక రచయిత చెప్పాడు. ఆయన రాసిన ‘ది డే ది వరల్డ్ స్టాప్స్​ షాపింగ్ : హౌ ఎండింగ్​ కన్జ్యూమరిజం సేవ్స్ ద వరల్డ్ అండ్ అవర్​సెల్ఫ్స్​​’ పుస్తకంలో ‘‘నేను ఏదైనా కొనాలనుకున్నప్పుడు దాన్ని వెయిటింగ్​ లిస్ట్​లో పెట్టి నిద్రపోతా. వెయిటింగ్ పీరియడ్​ తర్వాత కూడా దాన్ని కొన్నానంటే అది నిజంగా అవసరమైనదే అయి ఉంటుంది. అలా చేయడంలో అర్థముంది. అలాగే తక్కువ క్వాంటిటీలో కొన్నప్పుడు కూడా డోపమైన్ రష్​ జరిగి గిల్టీగా ఫీలవుతారు. అందుకే ఆన్​లైన్​ షాపింగ్ మొదలుపెట్టినప్పుడు అవసరమైనవి, సరసమైన ధరల్లో లభించేవి మాత్రమే కొనాలి. అలా కొన్న వస్తువులను బట్టి సంతోషం వస్తుంది. అలాకాకుండా ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొంటే.. అవి ఎందుకు కొన్నానా? అని ఆలోచిస్తా” అని రాశాడు.

ఈ నెలలో ఏమీ కొనొద్దు 

‘ఈ నెలలో అసలు షాపింగ్ చేయొద్దు. ఏమీ కొనొద్దు’ అనేదే నాలుగో రూల్. మినిమలిజం గురించి ఎన్నో పుస్తకాలు రాసిన రచయిత కౌర్ట్నే కార్వెర్ ఈ లైన్​ చెప్పింది. మూడు నెలల వరకు ఏమీ కొనకూడదనే నియమం పెట్టుకున్నప్పటి నుంచి ఆమె సింపుల్​ లైఫ్​కి అట్రాక్ట్ అయిందట! ఒక నెల లేదా మూడు నెలల పాటు షాపింగ్ చేయకుండా ఉంటే మెదడుకు కాస్త బ్రేక్ ఇచ్చినట్టే. అప్పుడు కొత్త వాటిపై దృష్టిపెట్టగలుగుతారు. ఒకవేళ ఏదైనా కొనాలనుకున్నప్పుడు అది ఎంతవరకు అవసరం? అనేది కూడా ఆ గ్యాప్​లో అర్థమైపోతుంది అని చెప్పిందామె.

ఫీడ్ ఎడిట్ చేయాలి

ఇన్​బాక్స్, సోషల్ మీడియా ఫీడ్ ఎడిట్ చేయాలి. ఎక్స్​పర్ట్స్ కూడా మొదట్లో ఆన్​లైన్​ షాపింగ్ అనేది ట్రెడిషనల్ షాపింగ్​ కంటే బెటర్ ఆప్షన్​ అనుకున్నారు. ఎందుకంటే షాప్​కి వెళ్లి అక్కడ కళ్లకు ఏదో నచ్చి అవసరం లేకపోయినా దాన్ని తీసుకోవాలనే కోరిక కలుగుతుంది. దానిబదులు ఏ ఐటెమ్​ కావాలో దాన్నే ఆన్​లైన్​లో వెతికి కొనుక్కోవడం బెటర్ ఆప్షన్​ అనుకున్నారు. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కేంటంటే.. ఏ కంపెనీ అయినా తమ బిజినెస్ జరిగేందుకు మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ చాలా ఆకర్షణీయంగా చేస్తుంటాయి.

అలాంటివి చూసినప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారైనా వాటిని కొనాలనే ఆశను కలిగిస్తాయి. దాంతో మళ్లీ షాపింగ్​ మాయావలలో చిక్కుకుపోతారు. అందుకని దీనికి సొల్యూషన్.. అడ్వర్టైజింగ్ ఈ–మెయిల్స్​ని అన్​సబ్​స్ర్కైబ్ చేయడం. సోషల్ మీడియాలో ప్రొడక్ట్స్​ కొనమని అడ్వర్టైజింగ్ ఇచ్చే ఇన్​ఫ్లుయెన్సర్లని అన్​ఫాలో లేదా మ్యూట్ చేయడం. వాళ్లు షేర్ చేసిన పోస్ట్​లు స్పాన్సర్​ చేసినవా? కాదా? గమనించాలి. స్పాన్సర్‌‌ చేసినవైతే కొనాలని లేకపోయినా కొనేలా చేస్తాయి.అందుకే ఆన్​లైన్​ షాపింగ్​ ఆలోచించి చేస్తే ఆనందం దక్కుతుంది. అదే ఆందోళన పడి ఎడాపెడా కొనేశారంటే... ఇక అంతే సంగతులు. డబ్బు రెండు రకాలుగా ఖర్చువుతుంది. ఒకటి షాపింగ్​కి, రెండోది డాక్టర్​కి.

ఎగ్జయిట్​మెంట్

అనుకున్న విషయాలు జరగనప్పుడు కోరుకున్నది కొనుక్కుంటే సంతోషంగా అనిపిస్తుంది. అప్పుడు మెదడులో డోపమైన్ లెవల్స్ పెరిగి ఇంకా కొనాలనిపించేలా చేస్తాయి. డోపమైన్ విడుదల అయినప్పుడు అది మామూలు షాపింగ్ అయినా సరే గొప్ప రివార్డ్​ ఏదో అందుకున్నంత ఆనందంగా ఉంటుంది. ఆన్​లైన్​ షాపింగ్ చేస్తే కొన్న వస్తువు ఇంటికొచ్చేవరకు ఆ సంతోషం అలాగే ఉంటుంది. బాక్స్​లో ఏముందో అనే ఉత్సుకత పెరుగుతుంది. అది చూడగానే డోపమైన్​ ఎక్కువై ఉత్సాహం రెట్టింపవుతుంది. 

ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఒక ఉపాయం కూడా ఉంది. అదే.. రిటైల్ థెరపీని మరో మార్గంలోకి మళ్లించడం. అదెలాగంటే డబ్బు ఖర్చు చేయడం వల్ల కలుగుతున్న ఆనందాన్ని డబ్బులు దాచడంలో వెతుక్కోవాలి. అనుకున్నది సాధించడం కోసం డబ్బును దాచిపెడుతున్నప్పుడు ఆనందంగా కలుగుతుంది. జరగబోయే విషయం గురించి ఎదురుచూడడంలో ఉండే ఆనందాన్ని ఈ రకంగా దక్కించుకోవచ్చు. అప్పుడు డోపమైన్​ అనేది రిలీజ్ అవుతూనే ఉంటుంది. దాంతో ఎగ్జయిట్​మెంట్​ ఉంటుంది. 

హ్యాపీనెస్​కి కారణమేంటి?

ఈ మహాప్రపంచంలో ఒంటరితనం, ఒత్తిడి, భయం, ఆర్థిక ఇబ్బందులు వంటివి ఎవరో ఒకరు ఎదుర్కొంటూనే ఉంటారు. అలాంటివాళ్లలో కొందరు ఆన్​లైన్​ షాపింగ్​ని తమ సమస్యల నుంచి బయటపడేసేందుకు ఒక అవుట్​లెట్​లా ఫీలవుతారు. బయటి ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి, సమాజంతో కలవడానికి ట్రై చేస్తుంటారు. కానీ, అది వీలుకాకపోవడం వల్ల ఆన్​లైన్ షాపింగ్ మీద ఎక్కువగా ఆధారపడతారు. 
అదే ఆ తరువాత వాళ్లకి ఒక మానసిక సమస్యలా మారిపోతుంది. 

ఆన్​లైన్​లో ఉన్న షాపింగ్ సైట్స్​లో కొనడం చాలా ఈజీ. పగలు, రాత్రి అనే తేడా ఉండదు. ఏ టైంలో అయినా... ఎంత ఖర్చు అయినా పెడతారు. ఇలా షాపింగ్​ చేసేటప్పుడు ‘మీరు ఈ ఐటెమ్​ కొని... ఇన్ని రూపాయలు ఆదా చేశారు’ అనే మెసేజ్​ ఇంకా ఈజీగా ఖర్చుపెట్టిస్తుంది. డబ్బు వృథా చేయడంలేదనే భావనలో ఉంటారు. పైగా ఎంతో కొంత మొత్తం మిగిలింది అన్న ఆలోచనతో కావాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చుపెడుతుంటారు. అలాగే ‘ఇప్పుడు కొనండి. తరువాత డబ్బు కట్టండి. అంటే బై నౌ, పే లేటర్’ (బిఎన్​పిఎల్) సర్వీస్​లు చూసి టెంప్ట్​ అవుతారు కొందరు. ఇలాంటి వాటివల్ల కొత్తగా అప్పుల్లో పడడం తప్ప ఉపయోగం ఉండదు. ఇలాంటి ఆఫర్ల వల్ల ఎక్కువ ఖర్చు అవుతున్నా వెనకాడకుండా కొంటుంటారు.

 షాపింగ్​ చేయించడం కోసం ‘లో స్టాక్ అలర్ట్​, సెల్లింగ్ క్విక్​లీ, లిమిటెడ్ సేల్స్, లిమిటెడ్ ఎడిషన్స్, న్యూ రిలీజెస్’ వంటివి పెడుతుంటారు. ఆ ఒత్తిడి​ వల్ల ‘అప్పటికప్పుడు అయిపోతాయేమో’ అనే కంగారులో అనవసరంగా కొనేస్తారు. బట్టలకు సంబంధించిన ఆన్​లైన్​ షాపింగ్ సైట్స్​లో ‘టైలర్డ్ సజెషన్స్(మెజర్​మెంట్స్​)’ కూడా ఇస్తుంటాయి. దీనివల్ల కూడా కరెక్ట్​ సైజ్​ దొరుకుతుందని అవసరం లేకపోయినా కొంటుంటారు. అవసరానికి ఏదో వెబ్​సైట్ బ్రౌజ్ చేస్తారు. ఆ పని అయిపోతుంది. కానీ మీ బ్రౌజింగ్​ పూర్తయ్యాక కూడా ఏవో ఒక అడ్వర్టైజ్​మెంట్స్ వస్తుంటాయి. ఆన్​లైన్​లో బ్రౌజ్ చేసేటప్పుడు మనసుకు కళ్లెం వేయకపోతే షాపింగ్ చేసే ఆలోచన లేకపోయినా చేసేస్తారు. 

అడిక్ట్ అయ్యారా? లేదా?

అనవసరమైన వస్తువులను కొనడం. అవసరం లేని ఐటెమ్​ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసి విపరీతంగా రీసెర్చ్ చేయడం. షాపింగ్ వల్ల వృథా ఖర్చులు చేయడం. షాపింగ్ కంట్రోల్ చేసుకోలేక ఆర్థికం​గా ఇబ్బంది పడడం. ఇంట్లో లేదా వర్క్​ ప్లేస్​లో కూడా ఎక్కువ టైం ఆన్​లైన్​ షాపింగ్​కి కేటాయించడం వల్ల ప్రాబ్లమ్స్ రావడం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని షాపింగ్​కి అడిక్ట్ అయ్యారా? లేదా అనేది చెప్తారు

మెంటల్​ హెల్త్​ ఎక్స్​పర్ట్స్​. అయితే, వీటితోపాటు మరికొన్ని కండిషన్స్ కూడా కనిపిస్తాయి. అవేంటంటే.. యాంగ్జయిటీ, ఈటింగ్​, ఇంపల్స్ కంట్రోల్, డిప్రెషన్ వంటి మూడ్, పర్సనాలిటీ, సబ్​స్టెన్స్ యూజ్ డిజార్డర్స్​తో పాటు కంపల్సివ్​ గ్యాంబ్లింగ్, జుట్టు లాక్కోవడం, గిచ్చుకోవడం వంటివి చేస్తుంటారు. 

సింపుల్ ట్రిక్స్

  • థెరపీ, పక్కవాళ్ల సపోర్ట్ ఈ డిజార్డర్​ బారిన పడిన వాళ్లు మామూలు స్థితికి రావడానికి హెల్ప్ అవుతుంది. సీబీటీ(కాగ్నిటివ్​ బిహేవియరల్​ థెరపీ) ఎఫెక్టివ్​గా పనిచేస్తుంది. 

  • కొత్త అలవాట్లు డెవలప్ చేసుకోవడం వల్ల కూడా మైండ్ డైవర్ట్ చేయొచ్చు.
  • షాపింగ్​కి ఒక లిస్ట్ తయారుచేసుకుని దానికే పరిమితం కావాలి. అది కష్టమనిపిస్తే ఇంట్లో వాళ్లు లేదా ఫ్రెండ్స్​ సాయం తీసుకోవాలి. 
  • షాపింగ్​ బిల్ చెల్లింపులు డబ్బురూపంలోనే ఉండాలి. 
  • ఆన్​లైన్​ షాపింగ్ సైట్స్, యాప్స్ బ్లాక్ చేసేయాలి. 

వీళ్లకు ఉపయోగం!

షాపింగ్ అనేది యాంగ్జైటీ, పారానోయియా వంటి మానసిక సమస్యలు ఉన్నవాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు కొందరు ఎక్స్​పర్ట్స్. ఎందుకంటే యాంగ్జైటీ వల్ల నాలుగు షాపులు తిరిగి నచ్చినవి సెలక్ట్ చేసుకుని కొనడం అనేది ఇటువంటి వాళ్లకు పెద్ద టాస్క్​. ఇది కొంతవరకు మంచిదే. కానీ, మితిమీరితే సమస్యలా తయారవుతుంది. కాబట్టి ఆన్​లైన్​ షాపింగ్​ వల్ల ఎంత లాభం ఉందో.. అదే స్థాయిలో నష్టం కూడా ఉంది.

అప్పటికే ఏదో ఒక ఒత్తిడిలో ఉండి, దాన్నుంచి బయటపడడం కోసం ఆన్​లైన్​ షాపింగ్​ని ఎంచుకోవడం సరికాదు. అలాంటి పరిస్థితుల్లో ఆన్​లైన్ షాపింగ్ చేస్తే క్రెడిట్ కార్డులకు కట్టాల్సిన అప్పులు పెరిగిపోతాయి. అందుకని ఆన్​లైన్​ షాపింగ్​లో కొనాల్సిన అవసరం లేదు. ఆ క్షణం నచ్చిన ఐటెమ్​ కార్ట్​లో వేసుకుంటే చాలు. మెదడుకి కావాల్సిన సంతోషం దక్కుతుంది. అలాంటప్పడు జేబుని ఖాళీ చేసుకుని ఇబ్బంది పడడం ఎందుకు? కొనకుండా కార్ట్​ల్లో నింపుకుని సంతోషించే వాళ్లు ఉన్నారని ఎక్స్​పర్ట్స్ చెప్పిన మాట ఉండనే ఉంది.

మనీష పరిమి