
ఈ మధ్య కాలంలో డిజిటల్ మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర నేరాగాళ్లు రోజుకో పద్దతిలో, అడ్వాన్స్ డ్ టెక్నాలజీని ఉపయోగించుకుని మోసాలకు పాల్పడు తున్నారు. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు రకరకాల ట్రిక్కులు వాడుతున్నారు. ఫేక్ ఐవీఆర్ కాల్స్ ద్వారా మోసాలకు తెగబడుతున్నారు. ఆ కాల్స్ ఏంటి? ఎలా మోసం చేస్తారు? వంటి విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. సైబర్ నేరగాళ్ల మోసాలకు బలికాకుండా ఉండేందుకు అలెర్ట్గా ఉండాలి.
ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) అంటే.. బ్యాంకులు, టెలికాం కంపెనీలు, కస్టమర్ సర్వీస్ హెల్ప్లైన్లు వాడే ఆటోమేటెడ్ ఫోన్ సిస్టమ్. ఈ సిస్టమ్ ద్వారా కీ ప్యాడ్ లేదా వాయిస్ ద్వారా భాష మార్చడానికి ఫలానా నెంబర్ నొక్కండని.. ఇతర విషయాల కోసం మరో నెంబర్ను సూచిస్తుంటాయి. తద్వారా మనకు కావాల్సిన సమాచారం తెలుసుకోవడం జరుగుతుంది.
అయితే సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం దీన్నే అదనుగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఐవీఆర్ కాల్లానే మాట్లాడి, నెంబర్లు సూచిస్తారు. వాళ్లు చెప్పిన నెంబర్ నొక్కగానే అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ అయిపోతుంటుంది. ఉదాహరణకు బ్యాంక్ నుంచి కాల్ చేసినట్టు చెప్పుకుని, తమ అకౌంట్లో కొన్ని సమస్యలు ఉన్నట్టు చెప్తారు. వాటిని సవరించాలంటే ఫలానా నెంబర్ నొక్కాలని సూచిస్తారు.
అది నమ్మి నెంబర్ నొక్కారా.. ఖాతా ఖాళీ అయిపోతుంది. వీటిని గుర్తించాలంటే ఒక కాలర్ ఓటీపీ లేదా సీవీవీ అడిగితే ఫేక్ కాల్ అని పసిగట్టొచ్చు. అంతేకాకుండా త్వరగా ప్రాసెస్ చేయమని ఒత్తిడి తెస్తుంటే అనుమానించాల్సిందే.