టీచర్​ ఎమ్మెల్సీలు, సంఘాలు  ఏం చేస్తున్నట్టు? : పోలంపెల్లి ఆదర్శన్ రెడ్డి

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాల్సిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అసలు సమస్యలే లేవు అన్నట్లుగా ప్రవర్తిస్తున్న తీరు పట్ల సమస్త ఉపాధ్యాయలోకం అసహనంతో వున్నది. అనేక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్న ఉమ్మడి రాష్ట్రంలో  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే అన్ని రకాల పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయని భావించి నాడు ఉపాధ్యాయులందరూ సంఘాలకతీతంగా ఎంతో ఐక్యతతో తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించారు.

సమైక్యులుగా ముద్రపడ్డ వారిని సైతం 2012 ఎమ్మెల్సీ ఎన్నికల్లో మట్టి కరిపించిన చరిత్ర ఉపాధ్యాయులది. అలాంటి చరిత్ర కల్గిన ఉపాధ్యాయుల ఆలోచనలకు భిన్నంగా ప్రవర్తిస్తూ ప్రస్తుత చట్టసభల్లో ఉపాధ్యాయుల పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలు ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం వుంది. 

సంఘాల ప్రాధాన్యం తగ్గుతోంది

ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్సీ వ్యవస్థ తిరిగి ఏర్పాటు అయినప్పటి నుంచి సంఘాల ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. వ్యక్తి పూజ పెరుగుతూ వస్తోంది. కానీ అదే సమయంలో  అనేకమైన సంఘాలు ఆవిర్భవించాయి. దీనికి కారణం సమస్యలపై గళం విప్పాల్సిన నాయకులు స్తబ్దుగా నిమ్మకు నీరెత్తినట్లు వుంటున్నారు. స్పందించే నాయకత్వం కరువై సమస్యలవారీగా ఉపాధ్యాయులు గ్రూపులుగా విడిపోయి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి, అసోసియేషన్లుగా, ఫోరంలుగా ఏర్పరచుకొని పోరాడడానికి సిద్దం అవుతున్నారు.

ఇక ఉపాధ్యాయుల కుటుంబాలను మానసిక క్షోభకు గురిచేసి ఎంతో మంది ఉపాధ్యాయులను కంటతడి పెట్టించిన జీవో 317 ద్వారా ఉపాధ్యాయులకు కల్గిన నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. కానీ బాసటగా నిలవాల్సిన ఉపాధ్యాయ సంఘాలు కానీ ఆయా సంఘాల నుంచి ఉపాధ్యాయుల పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలు గానీ, మేము ఉన్నామని తప్పకుండా న్యాయం జరిగేంతవరకు  పోరాడుతామని భరోసా కల్పించిన వారు ఎవరూ లేరు. పైగా వారికి జరిగిన నష్టాన్ని వారే వివిధ నిరసనల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం అయ్యే దశలో ఎన్నెన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు.

నేతల స్వార్థం

ఉపాధ్యాయ సంఘాలను ప్రభుత్వం వారికి అవసరం వుంటే కానీ దగ్గరకు తీయడం లేదు. కానీ గౌరవ ఎమ్మెల్సీ లు అధికారులను గానీ, మంత్రిని గానీ ముఖ్యమంత్రిని గానీ కలిసి సమస్యలను వివరించి పరిష్కారం కోసం కృషి చేసిన సందర్భం ఏదీ కానరాలేదు. కానీ ఉపాధ్యాయులు మాత్రం  వారి వారి స్వప్రయోజనాల కోసం స్పౌజ్, నాన్ స్పౌజ్ ఉపాధ్యాయులుగా విడిపోయి ఒక ఫోరంగా ఏర్పడి ఉపాధ్యాయుల బలహీనతలను ఆసరాగా చేసుకొని కోర్టు ఫీజుల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు.  

సమస్యలు ఎన్ని ఉన్నా కాస్తో కూస్తో అయిన ఈ మాత్రం సౌకర్యాలు ఉపాధ్యాయులుగా మనం అనుభవిస్తున్నాం అంటే దానికి కారణం సంఘాలే. కానీ నేటి నాయకుల్లో ఆ నిబద్ధత కరువైంది. వ్యక్తి గత ప్రయోజనాలు ప్రాధాన్యంగా మారిపోయాయి. స్వార్థం పెరిగిపోయింది. అలాంటి నాయకులకు, సంఘాలకు గుణపాఠం చెప్పే విధంగా ఉపాధ్యాయుల ఆలోచనా తీరు మారుతోంది. మారాలి కూడా.

ఎమ్మెల్సీల చొరవ ఏది?

రాష్ట్రంలో ప్రస్తుత హాట్ టాపిక్ పోటీ పరీక్షలు, పదో తరగతి వార్షిక పరీక్ష పేపర్ లీకేజి. ఈ అంశం రాజకీయ రంగుదాల్చుతున్న క్రమం కూడా ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారుతోంది. నిజంగా లీకేజిలో ఉపాధ్యాయుల ప్రమేయం ఉంటే వారి పైన చర్య తీసుకోవడంలో ఎవరికీ ఆక్షేపణ లేదు. కానీ ఎలాంటి సంబంధం లేకుండానే ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం సర్వీస్ నుంచి తొలగించడం చకచకా జరిగిపోతున్నాయి.

ఈ విషయంలో అధికారులు విచక్షణతో కూడిన నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇటీవల ఉపాధ్యాయుల ఆదరాభిమానాలతో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ గానీ,  గతంలో ఎన్నిక కాబడిన ఎమ్మెల్సీలు గానీ ఉపాధ్యాయుల పక్షాన ప్రకటన చేయకుండా చోద్యం చూస్తున్నారని ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు. ఇప్పుడే కాదు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వారి ప్రవర్తన  ఇలాగే ఉంటోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

317తో కష్టాల కడలి

317ద్వారా అనేక ఉపాధ్యాయ కుటుంబాలు వందల మైళ్ళు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సమయపాలన పాటించే క్రమంలో అనేక మంది ఉపాధ్యాయులు యాక్సిడెంట్లు జరిగి అసువులు బాసిన ఘటనలు అనేకం చూస్తున్నాం.317 ద్వారా స్థానికత కోల్పోయి నష్టపోయిన ఉపాధ్యాయులకు మ్యూచువల్ బదిలీల ద్వారానైనా కాస్తో కూస్తో కొంతమందికి అయినా న్యాయం జరుగుతుందని భావిస్తే మనలోనే కొంత మంది ఉపాధ్యాయులు (ఒక ప్రధాన సంఘం సభ్యులు) మ్యూచువల్ బదిలీల కు అవకాశం ఇస్తే వారికి సర్వీసు ప్రొటెక్షన్ కల్పించవద్దని కోర్టుకు వెళ్ళడం, కోర్టు ప్రభుత్వం సర్వీసు ప్రొటెక్షన్ కల్పిస్తూ ఇచ్చిన జీవో 402 కొట్టివేయడం ఫైనల్ తీర్పు ఇంకా రాకపోవడం చూస్తూనే వున్నాం.

కానీ ఎమ్మెల్సీలు గా ఈ విషయంలో వారు ఏ రోజూ  మాట్లాడింది లేదు. ఈ విషయంలో మళ్లీ  స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులందరూ మరో గ్రూపు గా ఏర్పడి పోరాటం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఎంతో కాలంగా అసంతృప్తిగా వున్న ఉపాధ్యాయులను తృప్తి పర్చాలనే ఉద్దేశ్యమే కావచ్చు లేదా రాజకీయ ప్రయోజనాలే కావచ్చు గత ఏడున్నర సంవత్సరాలుగా ఆగిపోయిన ఉపాధ్యాయుల పదోన్నతులకు, బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపితే, బదిలీల్లో స్పౌజ్ ఉపాధ్యాయులకు ప్రాధాన్యత పాయింట్లు ఇవ్వొద్దని కోర్టుకు వెళ్ళడం, ఈ విషయం పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు నోటీసులు ఇచ్చింది.

కౌంటర్ దాఖలు చేయాల్సిన అధికారులు గడువులోగా దాఖలు చేయకపోవడం వల్ల మళ్లీ కోర్టు ఏప్రిల్ 11 వరకు కేసు వాయిదా వేసింది. దాంతో ఎంతో కాలంగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయుల ఆశలకు మరోసారి భంగం కలిగింది.  - పోలంపెల్లి ఆదర్శన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు, తెలంగాణ టీచర్స్ యూనియన్, కరీంనగర్ శాఖ