తప్పుడు రిపోర్టు ఇచ్చిన  డిప్యూటీలపై చర్యలేవి?

  • డీఎస్సీ పోస్టుల వేకెన్సీ లిస్ట్ సమర్పించడంలో పొరపాట్లు
  • టీచర్ యూనియన్ల ఫిర్యాదుతో కలెక్టర్​ ఎంక్వైరీకి ఆదేశం
  • విచారణ ముగిసినా ఆ అధికారులపై చర్యలు నిల్

హైదరాబాద్ సిటీ, వెలుగు: డీఎస్సీ పోస్టుల భర్తీ సమయంలో స్కూళ్లలో టీచర్ల వేకెన్సీ లిస్ట్​ను సరిగ్గా సమర్పించలేదనే కారణంతో విచారణ ఎదుర్కొన్న హైదరాబాద్ జిల్లాలోని డిప్యూటీ ఈఓ, డీఐఓఎస్ లపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఆరుగురు డీఐఓఎస్​లు, ఒక డిప్యూటీఈఓపై విచారణ ముగిసి మూడు వారాలు కావస్తున్నా.. కలెక్టర్ అనుదీప్​దురిశెట్టి ఇంతవరకు ఎలాంటి యాక్షన్​తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారుల తప్పిదంతో అవసరం ఉన్న స్కూల్స్​లో కాకుండా అవసరం లేని స్కూళ్లలో టీచర్లను నియమించారు. దీంతో అవసరానికి మేర టీచర్ల సంఖ్య పెరుగుతుందని భావించిన స్కూళ్లకు నిరాశే మిగిలింది. ఈ విషయంపై ఓ టీచర్​యూనియన్​నాయకులు కలెక్టర్ అనుదీప్​ను కలిసి ఫిర్యాదు చేయడంతో డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ తో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు డీఐఓఎస్​లు, ఓ డిప్యూటీ ఈఓపై డీఈఓ ఆర్.రోహిణి  సమక్షంలో విచారణ జరిపారు. రిపోర్టును కలెక్టర్ కు సమర్పించారు. విచారణ ముగిసి మూడు వారాలు కావస్తోంది. కానీ బాధ్యులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు.

మొత్తం 584 పోస్టుల భర్తీ

హైదరాబాద్ జిల్లాలో 878 డీఎస్సీ పోస్టులు ఉండగా, అధికారులు 584 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. రిజర్వేషన్​, కోర్టు కేసులు తదితర కారణాలతో 262 పోస్టుల భర్తీని పెండింగ్​పెట్టారు. సర్టిఫికెట్​వెరిఫికేషన్​ టైంలో సమస్యల కారణంగా మరో 32 పోస్టుల భర్తీని నిలిపివేశారు. పోస్టింగులు తీసుకున్నవారిలో ఎస్జీటీలు 386, ఎస్ఏలు 107, లాంగ్వేజ్ పండిట్లు​91 మంది ఉన్నారు.