- డీవోపీటీని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు
- చర్యలు తీసుకోకుండా ఫిర్యాదును రాష్ట్రానికి పంపడంపై సీరియస్
- రజత్ బిడ్డ పెండ్లి ఖర్చును ఓ కాంట్రాక్టు కంపెనీ చెల్లించిందని గతంలో డీవోపీటీకి ఫిర్యాదు
- విచారించి చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎస్‌కు లేఖ రాసిన డీవోపీటీ సెక్రటరీ
- దీన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన గవినోళ్ల శ్రీనివాస్
హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని డీవోపీటీని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. రజత్‌పై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకుండా.. ఆ పిటిషన్‌ను తెలంగాణ సీఎస్‌కు ఎలా పంపుతారని ప్రశ్నించింది. ఇందుకు అనుసరించాల్సిన ప్రొసీజర్ ఏమిటో కౌంటర్ వేయాలని స్పష్టం చేసింది. రజత్ కుమార్ కుమార్తె పెండ్లి ఖర్చులను ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రముఖ కాంట్రాక్టు కంపెనీ చెల్లించిందని, దీనిపై మీడియాలో వచ్చిన వార్తలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ నారాయణపేట జిల్లాకు చెందిన రైతు గవినోళ్ల శ్రీనివాస్.. డీవోపీటీకి ఫిర్యాదు చేశారు.
మీడియాలో ప్రచురితమైన కథనాలను కంప్లైంట్‌కు జత చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచిస్తూ తెలంగాణ సీఎస్‌కు డీవోపీటీ సెక్రటరీ లేఖ రాశారు. దీన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును గవినోళ్ల శ్రీనివాస్ ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సోమవారం జస్టిస్ యశ్వంత్ సిన్హా విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున మోహిత్ కే జాకర్ వాదనలు వినిపించారు.
బిగ్ వేవ్ ఇన్‌ఫ్రా పేరుతో చెల్లింపులు
‘‘2021 డిసెంబర్ 17 నుంచి 21 మధ్య ఐదు రోజులపాటు హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లలో ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ కుమార్తె పెండ్లి ఘనంగా నిర్వహించారు. పెండ్లి ఖర్చును ప్రముఖ కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజనీరింగ్ చెల్లించింది. దీనిపై మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై జనవరి 28న గవినోళ్ల శ్రీనివాస్.. డీవోపీటీకి కంప్లైంట్ చేశారు. బిగ్ వేవ్ ఇన్‌ఫ్రా పేరుతో ఈ పెండ్లికి సంబంధించిన హాళ్లు, రూంలు, తాజ్ ఫలక్‌నుమా హోటల్‌లో డిన్నర్ బిల్లులు చెల్లించారు. బిగ్‌వేవ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న వారే మేఘా ఇంజనీరింగ్‌లోని వివిధ సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్నారు’’ అని పిటిషనర్ లాయర్ జాకర్ తెలిపారు.
తెలంగాణ సీఈవోగా పని చేసినప్పుడు కూడా రజత్ కుమార్‌పై అనేక ఆరోపణలు వచ్చాయన్నారు. ఐఏఎస్‌లపై అవినీతి ఆరోపణలు వస్తే ఆలిండియా సివిల్ సర్వీసెస్‌కు కూడా చెడ్డపేరు వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన డీవోపీటీ సెక్రటరీ రూపేశ్ కుమార్.. మార్చి 2న తెలంగాణ సీఎస్‌కు లేఖ రాశారని, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారని, ఆరు నెలలు గడిచినా ఆ కంప్లైంట్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. స్పందించిన న్యాయమూర్తి.. అసలు కంప్లైంట్‌ను రాష్ట్రానికి ఎందుకు పంపాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలన్నారు. స్పెషల్ సీఎస్ స్థాయి అధికారిపై చీఫ్ సెక్రటరీ ఎలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ.. విచారణను అక్టోబర్ 12కు వాయిదా వేశారు.
పెండ్లికి నాలుగు నెలల ముందే హోటల్ బుకింగ్స్
రజత్ కుమార్ కుమార్తె పెండ్లి డిసెంబర్ 17 నుంచి 21 మధ్య జరగ్గా.. ఇంతకు నాలుగు నెలల ముందే (జులై 31న) తాజ్ గ్రూప్‌నకు చెందిన ప్రముఖ హోటళ్లను బుక్ చేశారు. ఇందుకోసమే జులై ఒకటిన బిగ్‌వేవ్ ఇన్‌ఫ్రా పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. ఈ కంపెనీనే ఈవెంట్లు, డిన్నర్, హోటల్ రూమ్‌లు బుక్ చేసి, బిల్లులు చెల్లించిందని, దానికి సంబంధించిన ఇన్‌వాయిస్‌లతో ‘న్యూస్ మినిట్’ కథనం ప్రచురించింది.
బిగ్‌వేవ్ కంపెనీ గురించి ఆరా తీయగా అందులో మేఘా ఇంజనీరింగ్ సంస్థ డైరెక్టర్లే ఉన్నారని, బిగ్‌వేవ్ కంపెనీని వెదుక్కుంటూ తాము వెళ్లగా ఆ అడ్రస్‌లో అలాంటి కంపెనీ ఏదీ లేదని తేలిందని అందులో పేర్కొంది. ఈ పెండ్లికి సంబంధించిన వ్యవహారాలను రజత్ కుమార్‌తో పాటు ఆయన ఓఎస్డీ ప్రభాకర్‌రావు పర్యవేక్షించారని వివరించింది. రజత్ కుమార్ తన కుమార్తె పెండ్లికి హాజరైన 70 మంది అతిథులకు తాజ్ ఫలక్‌నుమాలో లావిష్ డిన్నర్ ఇచ్చారని, ఇందుకు ఒక్కో ప్లేట్‌కు రూ.16,520 చొప్పున బిల్లు చెల్లించారని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన బిల్లుల వివరాలను న్యూస్ మినిట్ తన కథనంలో పొందుపరిచింది.