రాష్ట్రపతి, గవర్నర్​కు ఉన్న క్షమాభిక్ష అధికారాలు ఏంటి.?

రాష్ట్రపతి, గవర్నర్​కు ఉన్న క్షమాభిక్ష అధికారాలు ఏంటి.?

పోటీ పరీక్షల్లో పాలిటీ విభాగం నుంచి క్షమాభిక్ష అధికారంపై తరచూ ప్రశ్నలు అడుగుతుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి, గవర్నర్​కు ఉన్న క్షమాభిక్ష అధికారాలు, వాటి పరిమితులు, క్షమాభిక్ష రకాలు, వాటిపై సుప్రీంకోర్టుకు ఉన్న న్యాయ సమీక్ష అధికారం, పలు కేసుల గురించి తెలుసుకుందాం. 


రాష్ట్రపతికి క్షమాభిక్షాధికారం కల్పించడంలో రెండు ఉద్దేశాలు ఉన్నాయి. అవి.. న్యాయ ప్రక్రియలో ఏర్పడిన లోపాలను సరిదిద్దడం, రాష్ట్రపతి దృష్టిలో కఠిన శిక్షగా పరిగణించబడితే దాని నుంచి ఉపశమనం కల్పించడం. ఆర్టికల్ 72 ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్షాధికారాలను కలిగి ఉంటాడు. సుప్రీంకోర్టు, కోర్టు మార్షల్​తో సహా ఏ న్యాయస్థానం విధించే ఎలాంటి శిక్ష నుంచి అయినా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టవచ్చు. రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారాన్ని కల్పించడంలో రాజ్యాంగంలో కింది అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. 

    క్షమాభిక్ష అధికారం అనేది కార్యనిర్వహణాధికారం. 
    రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారంపై న్యాయ సమీక్ష జరపకూడదు. 
    క్షమాభిక్ష ప్రసాదించే విషయంలో రాష్ట్రపతి ఒక న్యాయస్థానం మాదిరిగా వ్యవహరించడు. 

న్యాయ సమీక్ష: రాజ్యాంగం ప్రకారం క్షమాభిక్షపై న్యాయ సమీక్ష చేసే అవకాశం లేదు. కానీ, సుప్రీంకోర్టు పలు కేసుల్లో ఇచ్చిన తీర్పుల ప్రకారం క్షమాభిక్షపై న్యాయ సమీక్ష జరపవచ్చు. 1998లో ఖేహార్​సింగ్​ కేసులోనూ, 2004లో ధనుంజయ కేసులోనూ, 2006లో గౌరు వెంకటరెడ్డి(ఏపూరు సుధాకర్​రెడ్డి వర్సెస్​ స్టేట్​ ఆఫ్ ఏపీ కేసు) కేసుల్లో క్షమాభిక్ష అధికారంపై న్యాయ సమీక్ష చేయవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. 

    సుప్రీంకోర్టు పలు కేసుల్లో ఇచ్చిన తీర్పుల ప్రకారం క్షమాభిక్ష విషయంలో కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. 
    క్షమాభిక్ష అప్పీలు చేసుకునే వ్యక్తి తన వాదన వినమని రాష్ట్రపతిని బలవంతం చేసే అవకాశం లేదు. 
    కోర్టు అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయాన్ని రాష్ట్రపతి కలిగి ఉండవచ్చు. 
    క్యాబినెట్​ లిఖితపూర్వకంగా ఇచ్చే సలహా ఆధారంగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలి. 
    క్షమాభిక్ష నిర్హేతుకంగాను, రాజకీయ ఉద్దేశాలతోను ఉంటే తప్ప మిగిలిన అంశాల్లో న్యాయ సమీక్షకు అవకాశం లేదు. 
    క్షమాభిక్ష ఒక అప్పీల్​ తిరస్కరించబడినప్పుడు ఎన్నిసార్లు అయినా తిరిగి అప్పీల్​ చేసుకోవచ్చు. 
    ప్రతిభా పాటిల్​ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 35 మందికి క్షమాభిక్ష పెట్టారు. ఇది మిగిలిన రాష్ట్రపతుల కంటే అత్యధికం. 

  • ఇతర న్యాయాధికారాలు: ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల నియామకం. 
  • ఆర్టికల్​ 217 ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల నియామకంతోపాటు సుప్రీంకోర్టు నుంచి న్యాయ సలహా పొందుతాడు. 
  • గవర్నర్​ అధికారాలు: ఆర్టికల్​ 161 ప్రకారం గవర్నర్​ ఆ రాష్ట్ర హైకోర్టు పరిధిలో ఉన్న న్యాయస్థానం విధించే శిక్షలకు క్షమాభిక్ష (పార్డన్ పవర్) పెడతాడు. 
  • శిక్షలకు సంబంధించి: ఎ. తగ్గించవచ్చు. బి. మార్పు చేయవచ్చు. సి. వాయిదా వేయవచ్చు. డి. శిక్షాకాలం, శిక్ష మార్పు.  కానీ, మరణశిక్ష విషయంలో క్షమాభిక్ష అధికారం కేవలం రాష్ట్రపతికే ఉంటుంది. గవర్నర్​  కేవలం మరణశిక్షను సస్పెండ్​ మాత్రమే చేయగలడు. 
  • మోహిందర్​ సింగ్​ వర్సెస్​ స్టేట్​ ఆఫ్​ పంజాబ్​ (1963): గవర్నర్​ క్షమాభిక్ష ప్రసాదించిన సందర్భంలో దానిని ఉన్నత న్యాయస్థానాలు హేతుబద్ధమైన కారణాలు లేకపోతే మాత్రమే న్యాయ సమీక్ష చేయాలని, ఉంటే చేయరాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 
  • ఆర్టికల్​ 217 ప్రకారం రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు సంబంధిత రాష్ట్ర గవర్నర్లను సంప్రదించాలి.
  • ఆర్టికల్​ 234 ప్రకారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, రాష్ట్ర పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ను సంప్రదించి రాష్ట్ర జ్యుడీషియల్​ సర్వీసు ఉద్యోగులను గవర్నర్​ నియమిస్తాడు. 
  • ఆర్టికల్​ 233 ప్రకారం జిల్లా కోర్టుల న్యాయమూర్తులను నియమిస్తాడు.  సైనిక కోర్టులు ఇచ్చిన తీర్పుల్లో, శిక్షల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్ కు లేదు (రాష్ట్రపతికి ఉంది) 

క్షమాభిక్ష రకాలు

1. పార్డన్​: నేరస్తుడికి శిక్ష నుంచి పూర్తి మినహాయింపు.
2. కమ్యూటేషన్​: శిక్ష స్వభావాన్ని మాత్రమే మార్చుతారు. కానీ, శిక్షా కాలాన్ని తగ్గించడం జరగదు. అంటే ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చవచ్చు. 
3. రెమిషన్​: శిక్ష స్వభావాన్ని మార్చకుండా శిక్షా కాలాన్ని మాత్రమే తగ్గిస్తారు. 
4. రెస్పైట్​: ఏదైనా ఒక ప్రత్యేక కారణాన్ని దృష్టిలో పెట్టుకొని క్షమాభిక్ష పెట్టడాన్ని రెస్పైట్ అంటారు. 

రిప్రైవ్​: శిక్ష అమలును తాత్కాలికంగా వాయిదా వేయడం. ముఖ్యంగా క్షమాభిక్ష పిటిషన్​ ప్రభుత్వం పరిగణనలో ఉన్నప్పుడు దీనిని కల్పిస్తారు. క్షమాభిక్ష కోసం ఎన్నిసార్లు అయిన అప్పీల్​ చేసుకోవచ్చు. మొదటి అప్పీల్​లో మాత్రమే రిప్రైవ్​కి అవకాశం ఉంటుంది. 

శతృఘన్​ చౌహన్​ వర్సెస్​ యూనియన్​ ఆఫ్​ ఇండియా: క్షమాభిక్ష విషయంలో రాష్ట్రపతి వైపు నుంచి జాప్యం జరిగితే మరణశిక్షను కమ్యూటేషన్​ (శిక్ష మార్పు) చేయవచ్చని చీఫ్​ జస్టిస్​ పి.సదాశివం తీర్పు ఇచ్చారు. 

వీటో అధికారాలు: వీటో అధికారం అంటే ఒక బిల్లును ఆమోదించకుండా తిరస్కరించడం అని అర్థం. వీటో అనే లాటిన్​ పదం నిరోధం లేదా తిరస్కారం అనే అర్థంలో ఉపయోగపడుతుంది. అయితే, రాజ్యాంగంలో వీటో అనే పద ప్రయోగం లేదు. భారత రాష్ట్రపతి నిరపేక్ష వీటో, తాత్కాలిక వీటో, పాకెట్​ వీటో అధికారాలు మాత్రమే ఉన్నాయి. 
నిరపేక్ష వీటో: ఇందులో భాగంగా రాష్ట్రపతి తన ఆమోదానికి పంపిన బిల్లుకు ఎలాంటి ఆమోదం తెలపకుండా ఉంటాడు. దీంతో ఆ బిల్లు రద్దు అవుతుంది. ఇది రెండు సందర్భాల్లో మాత్రమే ఉపయోగించబడుతుంది. ప్రైవేట్​ మెంబర్స్ (మంత్రికాని పార్లమెంట్​ సభ్యులు) బిల్లుల విషయంలో, బలహీనమైన ప్రభుత్వం, మెజార్టీ లేని ప్రభుత్వం సమర్పించే బిల్లుల విషయంలో, ఒక బిల్లు రాష్ట్రపతి పరిశీలనకు పంపిన తర్వాత ప్రభుత్వం రాజీనామా చేయగా అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం సలహా ద్వారా కూడా రాష్ట్రపతి నిరపేక్ష వీటోను ఉపయోగించవచ్చు. 

సస్పెన్సివ్​ వీటో: దీని ద్వారా రాష్ట్రపతి తన ఆమోదానికి పంపిన బిల్లును పున: పరిశీలనకు పంపవచ్చు. తర్వాత అదే బిల్లును పార్లమెంట్​ ఉభయసభలు సవరణలతో లేదా సవరణలు లేకుండా సాధారణ మెజార్టీతో ఆమోదించి రాష్ట్ర పతికి పంపితే రెండోసారి వచ్చినప్పుడు దానిని తప్పనిసరిగా ఆమోదించాలి. అంటే ఈ సందర్భంలో రాష్ట్రపతి వీటోపై పార్లమెంట్​ పైచేయి సాధిస్తుంది. 
పాకెట్​ వీటో అధికారం: ఈ సందర్భంలో రాష్ట్రపతి బిల్లును ఆమోదించడం కాని, తిరస్కరించడం కాని, పున: పరిశీలనకు పంపడం కాని చేయడు. వచ్చిన బిల్లును నిరవధికంగా తన వద్దే ఉంచుకుంటాడు. ఒక బిల్లును ఆమోదించడానికి రాజ్యాంగంలో రాష్ట్రపతికి ఒక నిర్ణీత కాలపరిమితి నిర్ధారించబడలేదు. కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడుతుంది.