రైతు ఆత్మహత్యలకు కారణాలేంటి?

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగి పోతాయని, రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని అందరూ ఆశించారు. కానీ, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు గడిచినా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, మరణాలు ఆగకపోగా మరింత పెరిగాయి. ఏ రాష్ట్రంలో నైనా రైతుల ఆత్మహత్యలు నిరోధించినప్పుడే రైతు సంక్షేమం జరుగుతున్నట్లు భావించాలి. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మనదేశంలోని 13 రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నట్లు నేషనల్ క్రైం రిపోర్ట్ బ్యూరో(ఎన్సీఆర్బీ) వివరాలు వెల్లడించాయి. అయినా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవడం లేదు. 

రైతు సంక్షేమం విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని టీఆర్​ఎస్​ ప్రభుత్వం చెబుతున్న మాట. కానీ, ప్రభుత్వం చెబుతున్న మాటలకు.. వాస్తవానికీ పొంతన లేదని ఈ లెక్కలు చూస్తే తెలుస్తుంది. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఈ విధంగా ఉన్నాయి.  2019లో 491, 2020లో 466 , 2021లో 640 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందులో కౌలు రైతులు 40 శాతం మంది ఉన్నట్లు ఎన్సీఆర్బీ రిపోర్టు తెల్పుతున్నది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలు, వారి పిల్లలు అనాధలుగా మారిపోతున్నారు. ఆత్మహత్యలకు కారణాలను తెలుసుకొని వాటిని పరిష్కరించటానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. కనీసం రాష్ట్ర మంత్రివర్గంలో కూడా రైతు ఆత్మహత్యలపై చర్చించడం లేదు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం 4వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకినట్లు ఈ రిపోర్టు వెల్లడించింది. దేశంలో మహారాష్ట్ర, కర్నాటక తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉన్నట్లు లోక్ సభలో వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రకటించారు.

ఆత్మహత్యలను ఆపలేని రైతుల బీమా
రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 14 నుంచి రైతులకు బీమా పథకం అమలులోకి తెచ్చింది. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి, పాస్ పుస్తకం ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా వర్తింపజేసింది. ఆ ఏడాది ఆగస్టు 14 నుంచి మరుసటి సంవత్సరం ఆగస్టు 15 వరకు బీమా కాలం ఉంటుంది. 59 సంవత్సరాలు దాటిన వారికి ఎలాంటి పరిహారాలు ఉండవు. అయితే రైతు ఆత్మహత్యలకు సంబంధించి ఎక్కువ మంది 60 సంవత్సరాలకు పైబడిన వారే మరణిస్తున్నారు. బీమా లెక్కల ప్రకారం రైతుల మరణాలు ఈ విధంగా ఉన్నాయి. 2018-19లో 17,619 మంది రైతులు మరణిస్తే క్లెయిమ్​ల కింద బీమా కంపెనీలు రూ.880 కోట్లను చెల్లించాయి. 2019-20లో 18,781 మంది మరణిస్తే క్లెయిమ్​ల కింద రూ.939 కోట్లు చెల్లించాయి. ఇక 2020-21లో 13,095 మంది రైతులు మరణిస్తే.. క్లెయిమ్​ల కింద రూ.654.75 కోట్లు చెల్లించాయి. అంటే మూడేండ్లలో సుమారు 50 వేల మంది రైతులు మరణిస్తే.. రూ.2,474.75 కోట్లు క్లెయిమ్​ల కింద బీమా కంపెనీలు చెల్లించాయి. మూడు సంవత్సరాల్లో 59 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన రైతులు 50 వేల మంది మరణించడం అత్యంత విచారకరం. ఇందులో ఏటా విద్యుత్ శాఖ లోపాల వల్ల 650 మంది రైతులు మరణిస్తున్నారు. రైతు బీమా అమలు జరుగుతున్నా ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. కేంద్రం ఇస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి, రాష్ట్రం చేస్తున్న రుణమాఫీ రైతు ఆత్మహత్యలను ఆపడం లేదు.

కౌలు రైతులను గుర్తించడం లేదు..
స్వాతంత్ర్యానికి పూర్వం మనదేశం ఎస్టేట్లు ఉన్న రాజ్యంగా ఉంది. ఆ తర్వాత ఎస్టేట్లను రద్దు చేసి ఇండియన్ యూనియన్‌‌లో కలిపేశారు. తెలంగాణ నిజాం ఎస్టేటుగా ఉన్నది. 1849లో రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేసి 1907లో భూ చట్టాలు తెచ్చారు. 1950లో రక్షిత కౌలుదారీ చట్టం, 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కౌలు చట్టం, 2011లో లైసన్స్ రైతుల అధీకృత చట్టం తెచ్చారు. తెలంగాణ పుట్టి పెరిగింది కౌలులోనే. అలాంటి రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కౌలుదార్ల హక్కులను ఒక్క కలంపోటుతో తొలగించింది. ఒకవైపు కౌలు చట్టాలను చట్టబద్ధంగా అంగీకరిస్తూనే మరోవైపు రెవెన్యూ రికార్డుల్లో సాగుకాలం తొలగించి రక్షణ లేకుండా చేశారు. రైతుబంధు ఇస్తున్నామంటూ ప్రచారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. 60 శాతం నిధులు భూస్వాములకే ఇస్తోంది. రైతుబంధుకు బదులు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇవ్వడం ద్వారా కౌలు రైతులకు కూడా సహాయం చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ధరల నిర్ణాయక సంఘాన్ని(సీఏసీపీ) ఏర్పాటు చేసి బోనస్ ను ఇవ్వడం ద్వారా వాస్తవ సాగుదారులకు న్యాయం జరుగుతుంది. ప్రస్తుత ప్రభుత్వం భూస్వాములకు, భూ యజమానులకు బడ్జెట్ నిధులు దోచిపెడుతోంది. చివరికి పొరుగు దేశం పాకిస్తాన్ లో కూడా పకడ్బందీ కౌలు చట్టాలు ఉన్నాయి. కౌలు చట్టాల్లో 1) రాతపూర్వక అగ్రిమెంటు, 2) ప్రాపర్టీ మెయింటెనెన్స్, 3) ప్రాపర్టీని నష్టపరచ్చడం, 4) ముందస్తు నోటీసు లేకుండా కౌలుదారున్ని తొలగించడం, అక్రమంగా కౌలుదారుల తొలగింపు, 5) కౌలుదారు మరణంతో అతని వారసునికి హక్కు కలిగించడం లాంటివి అనేక రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. కానీ, మన రాష్ట్రంలో మాత్రం అమలు జరపడం లేదు.

రైతు ఆత్మహత్యలకు కారణాలేంటి?
రైతుల ఆత్మహత్యలు, మరణాలకు చాలా కారణాలు ఉన్నాయి. 1) ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు పూర్తిగా దెబ్బతినడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ఇవ్వకపోవడం, 2) వ్యవసాయ ఉత్పత్తులను పెట్టుబడికన్నా తక్కువ ధరకు అమ్ముకొని అప్పుల్లో కూరుకుపోవడం, 3) కేంద్ర పంటల బీమా పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకోవడం - తిరిగి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకపోవడం, 4) మెట్ట ప్రాంతాలకు నీటి వసతులు లేకపోవడం, 5) మార్కెట్లలో మోసాలు, కనీస మద్దతు ధర అమలు లేకపోవడం, మార్కెట్ కమిటీల నిర్లక్ష్యం, 15 శాతం పంటను కొనుగోలుదారులు దోపిడీ చేయడం, 6) నూతన టెక్నాలజీని, యాంత్రీకరణను కౌలుదారులు వాడుకోలేకపోవడం, 7) పండిన పంటను నిల్వ చేసుకునే సదుపాయాలు, గోదాముల సౌకర్యం లేకపోవడం వల్ల 20 శాతం పంటలు నష్టపోవడమో, తక్కువ ధరకు అమ్ముకోవడమో జరుగుతోంది. 8) ఎఫ్ సీఐ సంస్కరణలు చేపట్టి అన్ని పంటలను సేకరించకపోవడం(ఉత్తరాదిలో ముతక ధాన్యాలు, పప్పులు, నూనెగింజలు సేకరిస్తున్నారు), 9) ఉత్పాదకత తగ్గడం, 10) పండిన పంటను ప్రాసెసింగ్ చేసే అవకాశాలు లేకపోవడం వల్ల ముడి ఉత్పత్తులనే అమ్మడం, 11) బ్యాంకులు రుణాలివ్వకపోవడం వల్ల అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు తెచ్చి పండిన పంట వడ్డీకే చెల్లించడం, 12) కల్తీ విత్తనాల వల్ల పెట్టుబడి పెట్టిన తర్వాత కాతా, పూతా లేకుండా పంటలు దెబ్బతింటున్నాయి. ఈ సంవత్సరం 20 వేల క్వింటాళ్ల కల్తీ విత్తనాలు పట్టుబడినా కల్తీ వ్యాపారులు, పాలకుల - మిలాఖత్ వల్ల ఎవరిపైనా కఠిన చర్యలు తీసుకోలేదు.

ఆత్మహత్యల నివారణకు ఉద్యమించాలె
రైతు ఆత్మహత్యలకు కారణమవుతున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలి. అందుకోసం నిపుణులతో కమిటీ వేసి పరిష్కారాలు కనుగొనాలి. కేరళ తరహాలో రాష్ట్రంలో కూడా ‘రుణ విమోచన కమిషన్’ ఉన్నా అది ఆత్మహత్యలను నివారించడంపై శ్రద్ధ చూపడం లేదు. అందువల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతులు, రైతు సంఘాలు ఎన్ని ఆందోళనలు చేపట్టినా రాష్ట్ర ప్రభుత్వం చెవికెక్కడం లేదు. చివరికి అసెంబ్లీలో క్రైం రికార్డ్స్​ బ్యూరో రిపోర్టుపై చర్చించకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని గుర్తు చేస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిపుణులతో ఒక కమిటీని వేసి ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలి. దీనిని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళితేనే రైతుల ఆత్మహత్యలను అడ్డుకోగలుగుతాం.
- సారంపల్లి మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు, అఖిల భారత కిసాన్ సభ