2019 నుంచి వందే భారత్ లాంటి, అత్యంత పిరమయిన 72 దాకా రైళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్లీపర్ కోచ్‌లు తగ్గిపోయినాయి. 53కు పైగా ట్రైన్లు క్యాన్సిల్ అయ్యాయి. సామాన్యుడి రైలుబండ్లు తగ్గుతున్నాయి. డబ్బున్నోడు ప్రయాణించే రైళ్లకు ప్రోత్సాహం లభిస్తున్నది. ట్రైన్లలో చౌక భోజనం కరువు అయ్యింది. స్టేషన్లలో భోజనం లభించే కాస్ట్లీ ఫుడ్ కోర్ట్లు వచ్చాయి. రూ.450 కోట్లు ఖర్చు చేసి రాణి కమలాపతి స్టేషన్ ఆధునికీకరించారు. అమృత్ కాల్ పేరిట దేశంలో వెయ్యికి పైగా స్టేషన్ల ఆధునికీకరణ ప్రారంభం అయిపోయింది.
మరో వైపు సీనియర్ సిటిజన్స్ రాయితీకి కోత పెట్టి రూ. 5,800 కోట్లు మిగిలినయి అని చెప్పుకునే కేంద్రం, భోపాల్ నుంచి నడిచే వందే భారత్ రైలు ఖర్చు 69 కోట్లు, సగం నష్టాలు వస్తున్నాయి అంటున్నది. అదేవిధంగా ఇండోర్ నుంచి నడిచే వందే భారత్ లో 530 మంది సీటింగ్ ఉంటే ఇటీవల మూడు నెలల నివేదికలో యావరేజ్‌గా 130 మంది ప్రయాణం చేశారంటున్నారు. గతంలో సామాన్యుల రైలు స్పీడు గంటకు 47.6 కిలోమీటర్లు ఉండగా ఇప్పుడు 42.3 కిలోమీటర్లకు తగ్గింది. 750 స్టేషన్లలో 300 దాకా ప్రైవేట్ పరం చేశారు.
సామాన్య రైళ్లలో సౌకర్యాలు కరువు
దేశంలో మాల్స్ మెరుపులు చూడడానికే జనం ఎక్కువగా వెళతారు. కొనుగోలు శక్తి లేక, కొనేటోళ్ళు తక్కువే ఉంటారు. ఇప్పుడు రైల్వే స్టేషన్లలో మాల్స్ అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు! లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే 90,000 కోట్ల లాభాలు సాధించిన దాఖలాలు ఉన్నాయని బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఇటీవల చెప్పారు. సామాన్యుల రైలులో సౌకర్యం పెంచడం, సామాన్య ప్రయాణీకుడికి అందుబాటు ధరలో భోజనం ఉండేది.
ఇప్పుడు రోజురోజుకు సామాన్యుడి రైళ్లలో సౌకర్యాలు మాయం అయిపోతున్నాయి. పాసింజర్ రైళ్ల నెంబర్‌కు ముందు సున్నా ఒకటి యాడ్ చేసి ఎక్స్ ప్రెస్ ట్రైన్ గా పేరు మార్చారు. కానీ, సౌకర్యాలు ఏవీ మారలేదు. మురళి గంజ్ నుంచి పూర్ణిమ స్టేషన్ దాకా టికెట్ధర 15 రూపాయలు ఉంటే 35 రూపాయలు చేశారు. తిరుపతి నుంచి చెన్నైకి 35 రూపాయలు ఉంటే 70 రూపాయలు చేశారు. సామాన్యులకు అందుబాటులో లేని వందే భారత్ రైళ్లను మాత్రం ప్రారంభిస్తూనే ఉన్నారు.
బుల్లెట్ ట్రైన్ ఎక్కడ?
దేశంలో 2014 నుంచి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ గురించి చెబుతున్న పీఎం మోదీ లక్ష్యం ప్రకారం..2022లోనే రావాల్సి ఉన్నది. అయితే, ఆ ట్రైన్ దేశంలో 2028 నాటికి రావొచ్చు అని ఇప్పుడు అంటున్నారు. పది ఏండ్ల పీఎం మోదీ పాలనలో పేదల కోసం ఎన్ని రైళ్లు వేశారో తెలియదు! అయితే రైలు ప్రయాణంలో పేదల గోస మాత్రం తీరలేదు!
ప్రకటించిన ఉద్యోగాలు ఏవి?
--2017 అక్టోబర్‌లో పీయూష్ గోయల్ మంత్రిగా ఉన్నపుడు రైల్వేలో 10 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాల పేరిట అధికారంలోకి వచ్చిన పీఎం మోదీ..తన పది ఏండ్ల హయాంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. అయితే, కనీసం ఈ పది ఏండ్లలో కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారు. రైల్వే స్టేషన్లో చాయ్ అమ్మినాను అని చెప్పుకునే పీఎం అవే స్టేషన్లలో సామాన్యుల కోసం ఏమీ చేయలేదు. రైల్వేలో 3 లక్షల 12 వేల ఖాళీలు ఉన్నాయని 2023లో చెప్పిన ప్రభుత్వం, ఇప్పటివరకు ఎంతమందిని నియమించారని ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు జవాబుగా 2024 జనవరి 30 నాటికి ఒక లక్ష 49 వేల మందిని భర్తీ చేశామని పేర్కొన్నారు. వికసిత్ భారత్ , అమృత్ భారత్ అంటే ఇదేనేమో!-------
- ఎండి మునీర్,
సీనియర్ జర్నలిస్ట్