కనీస మద్దతు ధర.. వ్యవసాయ ధరల కమిషన్​ విధులేంటి.?

కనీస మద్దతు ధర.. వ్యవసాయ ధరల కమిషన్​ విధులేంటి.?

రెండో ప్రపంచ యుద్ధం, దేశ విభజన, ఆహార సంక్షోభం వల్ల ధరలు పెరుగుదలతో ధరలపై నియంత్రణ విధించారు. 1వ ప్రణాళికలో ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగి ధరలు తగ్గడంతో ధరల నియంత్రణ ఎత్తివేశారు. 1957లో అశోక్​ మెహతా అధ్యక్షతన గల ఆహార ధాన్యాల విచారణ సంఘం కేంద్ర ప్రభుత్వం ఆహార ధాన్యాల వర్తకాన్ని చేపట్టాలని సిఫారసు చేసింది. ఫలితంగా 1959లో ఆహార ధాన్యాల్లో ప్రభుత్వ వర్తకం ప్రారంభమైంది. కానీ ఆచరణలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఉదాహరణకు మార్కెట్​ ధర కంటే గోధుమ సేకరణ ధర తక్కువగా ఉండేది. భారీగా ఆహార ధాన్యాలు సేకరించడంతో టోకు వ్యాపారస్తులు అవినీతి విధానాలను అవలంబించేవారు. 

1959లో భారత్​కు వచ్చిన ఫోర్డ్​ పౌండేషన్​ బృందం నాట్లు వేయడానికి పూర్వమే కనీస మద్దతు ధర ప్రకటించాలని సూచించింది. 1964లో ఎల్​కే ఝా (ఆహార ధాన్యాల సంఘం)  వ్యవసాయ ధరల కమిషన్​ ఏర్పాటును సూచించింది. ఈ సిఫారసులపై 1965లో వ్యవసాయ ధరల కమిషన్​ (ఏపీసీ) ఏర్పడింది. ఇది ప్రతి సంవత్సరం మద్దతు, సేకరణ, జారీ ధరలను ప్రకటిస్తుంది. అయితే, వీటిని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్​ కమిటీ ఆమోదించాలి. దీనిని 1985లో వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్​గా పేరు మార్చారు. ప్రస్తుతం వ్యవసాయ వ్యయ, ధర కమిషన్​ చైర్మన్​ విజయ్​పౌల్​ శర్మ. 

ఆహార జోన్ల ఏర్పాటు: వ్యవసాయ ధరల స్థిరత్వానికి 1964లో ఆహార జోన్​లను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఎనిమిది గోధుమ జోన్లు ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంలో రైస్​ జోన్​లు ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రయోగం విఫలమవడంతో ప్రతి రాష్ట్రం ఒక జోన్​గా ఏర్పడింది. ఒక జోన్​లో ఆహార ధాన్యాలు స్వేచ్ఛగా తరలిపోవచ్చు. కానీ ఒక జోన్​ నుంచి మరో జోన్​కు తరలిపోరాదు. మిగులు రాష్ట్రాల నుంచి ఆహార ధాన్యాలను ప్రభుత్వం సేకరించి కొరత రాష్ట్రాలకు అందించేది. 

వ్యవసాయ ధరల కమిషన్​ విధులు

  •  వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయంపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం.
  • వ్యవసాయ మార్కెట్​ పద్ధతిని, మార్కెటింగ్​ వ్యయాన్ని పరిశీలించి వ్యవసాయ వ్యయాన్ని తగ్గించడానికి మార్కెటింగ్​లోని వివిధ దశల్లో ధరల మార్జిన్​ను సిఫారసు చేయడం.
  • వ్యవసాయ ఉత్పత్తుల ధరల సమస్యలపై ప్రభుత్వం కోరినప్పుడు సలహాలు ఇవ్వడం.
  • సీఏసీపీ మద్దతు ధరను, సేకరణ ధరను, జారీ ధరను ప్రకటించడం. 

సేకరణ ధర: లక్ష్మిత ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాలకు, బఫర్​ స్టాక్​ నియమాలకు ఆహార ధాన్యాలను సేకరిస్తారు. ఆహార ధాన్యాలను మిల్లర్స్​, రైతుల నుంచి సేకరించడానికి ప్రభుత్వం చెల్లించే ధర సేకరణ ధర. ఫుడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా సేకరించేటప్పుడు మిల్లర్లు తప్పనిసరిగా ప్రభుత్వానికి అమ్మాల్సిన ఆహార ధాన్యాలను లెవీగా పిలుస్తారు. అందుకే దీన్ని లెవీ ధర అని పిలుస్తారు. సేకరణ ధర మద్దతు ధర కంటే ఎక్కువగాను, మార్కెట్​ ధర కంటే తక్కువగాను ఉంటుంది. మద్దతు ధరని విత్తనాలు వేయకపూర్వం ప్రకటిస్తే సేకరణ ధరను పంటలు పండిన తర్వాత పంట చేతికొచ్చే ముందు ప్రకటిస్తారు. సేకరణ ధర కనీస స్థాయి మద్దతు ధరకు సమానంగా ఉంటుంది. 

బఫర్​ స్టాక్​: డిమాండ్​కు అనుగుణంగా సప్లయ్​ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం బఫర్​ స్టాక్​ను ఏర్పాటు చేస్తుంది. ఇది ధరల స్థిరీకరణకు దోహదపడుతుంది. ఆహార ధాన్యాల సప్లయ్​ పెరిగి ధర తగ్గినప్పుడు ఆహార ధాన్యాలను సేకరించగా, సప్లయ్​ తగ్గి కొరత ఏర్పడినప్పుడు ఈ నిల్వల నుంచి ఆహార ధాన్యాలను మార్కెట్​లోకి విడుదల చేసి ధరల పెరుగుదలను నివారిస్తుంది. 

జారీ ధర: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలను పంపిణీ చేయడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ ధరకు అందజేస్తుందో అది కేంద్ర జారీ ధర. సాధారణంగా సేకరణ ధర కంటే తక్కువ ధరకే కేంద్రం రాష్ట్రాలకు జారీ చేస్తుంది. ఈ రెండింటి వ్యత్యాసమే కేంద్రం భరించే సబ్సిడీ. యూపీఏ ప్రభుత్వం 2013లో ఎన్​ఎఫ్​ఎస్​ఏను తీసుకువచ్చారు. దీని ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు రేషన్​ షాపుల కోసం కిలో బియ్యం రూ.3, గోధుమలు రూ.2, ముతక ధాన్యాలు రూ.1కు అందజేస్తారు. ఈ చట్టం ప్రకారం మొదటి మూడేండ్లు ఇవే ధరలుంటాయి. తర్వాత కాలానుగుణంగా కేంద్రం నిధులను నిర్ణయిస్తుంది. అయితే అవి కనీస మద్దతు ధరలను మించరాదు. కేంద్ర ప్రభుత్వం ఈ సబ్సిడీ ధరలను పెంచకుండా వాటినే కొనసాగిస్తోంది.  
రేషనింగ్​, చౌక ధరల దుకాణాలు: ప్రజా పంపిణీ వ్యవస్థ మన దేశంలో రేషన్​షాపులు, చౌకధరల దుకాణాలు నిర్వహించడం ద్వారా బలహీనవర్గ వారి అవసరాలు తీరుస్తుంది. 

విత్తనాలు వేయకముందే ఆయా పంటలకు కనీస ధరను హామీ ఇస్తూ ప్రభుత్వమందించే మద్దతునే ‘మద్దతు ధర’ అంటారు. దీనిని సీఏసీపీ సిఫారసు చేస్తుంది. ఎంత పంట పండినప్పటికీ ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా (కొనజూపిన) ఉన్న కనీస ధర మద్దతు ధర. ఉత్పత్తిదారులకు దీర్ఘకాలంలో ఒకానొక ధర కంటే తక్కువ ధరకు పడిపోకుండా ప్రభుత్వం అందించే కనీస హామీ ధర మద్దతు ధర. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసిన వ్యాపారులపై చట్టరీత్యా చర్యలు తీసుకునే వీలుంటే అది చట్టబద్ధమైన మద్దతు ధర. నిత్యావసర సరుకుల చట్టం 1955 కింద స్టేషనరీ ప్రొవిజన్స్​ ఆఫ్​ ది షుగర్​ కేన్​ ఆర్డర్​ 1966లో భాగంగా 2009 వరకు చెరకు పంటకు ఈ రకమైన మద్దతు ధర ప్రకటించారు. 

దీనిని 2009లో సవరించి స్టేషనరీ మినిమమ్​ ప్రైజ్​ స్థానంలో ఫెయిర్​ అండ్​ రెమ్యునరేటివ్​ ప్రైజ్​ను ప్రకటిస్తున్నారు. కేంద్రం ప్రకటించిన ఎంఎస్​పీ కంటే రాష్ట్రం ఎక్కువ ధర ప్రకటిస్తే అది రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ధర. ప్రభుత్వం 22 పంటలకు తప్పనిసరిగా కనీస మద్దతు ధరను, చెరకు పంటకు ఎఫ్​ఆర్పీని ప్రకటిస్తోంది. ఖరీఫ్​ పంటలు 14, రబీ పంటలు 6, వాణిజ్య పంటలు 2, చెరకుకు ఎఫ్ఆర్​పీని ప్రకటిస్తుంది. ప్రతి సంవత్సరం ధర విధాన నివేదికను ఐదు గ్రూపులుగా (ఖరీఫ్​, రబీ, చెరకు, జనుము, కోప్రా) నివేదిస్తుంది. 

ధరల విధానం సమీక్ష 

స్థిరత్వం: సీఏసీపీ ఏర్పడిన తర్వాత కొంత వరకు ధరలో అస్థిరత్వం తగ్గింది. 
ద్రవ్యోల్బణ ధోరణి: ప్రతి సంవత్సరం సీఏసీపీ కనీస మద్దతు ధరలు పెంచడం వల్ల ద్రవ్యోల్బణ ధోరణి కనిపిస్తుంది.
మిగులు రాష్ట్రాలకు అనుకూలం: ఎంఎస్​పీ మిగులు రాష్ట్రాలకు అనుకూలంగా ఉంది. పంజాబ్​, హర్యానా, పశ్చిమ ఉత్తర్​ప్రదేశ్​ నుంచి ఎఫ్​సీఐ 95శాతం గోధుమలను సేకరిస్తుంది. పంజాబ్​, ఏపీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, తమిళనాడుల నుంచి 85 నుంచి 90శాతం బియ్యం సేకరిస్తుంది. కాబట్టి ఆ రాష్ట్రాల్లోనే ఎంఎస్​పీ వల్ల రైతులు లబ్ధి పొందుతున్నారు. 
పెట్టుబడిపై ప్రతికూల ప్రభావం: వరి, గోధుమ సేకరణ ధర పెరగడంతో వనరుల కొరత దృష్ట్యా ప్రభుత్వం ఇతర రంగాల్లో చేసే స్థిర పెట్టుబడి తగ్గుతోంది. 
పంటల తీరు మారడం: ముఖ్యంగా గోధుమ వ్యయంతో పోల్చితే గోధుమ మద్దతు ధర ఎక్కువగా పెరిగింది. ఫలితంగా రైతులు పప్పు ధాన్యాలు, ముతక ధాన్యాలకు ఉపయోగించే భూమిని గోధుమ, వరి పంట వైపు బదిలీ చేస్తున్నారు. 
ఉత్పత్తి వ్యయాలకే ప్రాధాన్యత: ఎంఎస్పీని నిర్ణయించేటప్పుడు ఉత్పత్తి వ్యయాన్ని ప్రధాన ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. డిమాండ్​ వైపు కారణాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. 
పెద్ద రైతులకు అనుకూలం: నూతన వ్యవసాయ వ్యూహాన్ని అవలంబించి ఉత్పత్తి చేసే పెద్ద రైతులే లబ్ధి పొందారు. 
మిగతా కాయధాన్యాల విస్మరణ: ప్రజా పంపిణీ వ్యవస్థలో వరి, గోధుమకి ప్రాధాన్యత ఇచ్చి నాసిరకపు ఆహార ధాన్యాలను పంపిణీ చేయలేదు. ప్రజా పంపిణీ వ్యవస్థ మొదట్లో పట్టణాలకే పరిమితమైంది. 
గ్రామీణ పేదలపై చెడు ప్రభావం: సేకరణ ధరలు, ఆహార ధాన్యాల ధరల పెరగడం వల్ల వ్యవసాయ కూలీలు, ఉపాంత రైతులపై చెడు ప్రభావం పడింది. కొందరి అధ్యయనాల్లో గ్రామాల్లో పైనున్న 20శాతం వారి సంక్షేమమే పెరిగింది.