
భారతదేశంలోని గిగ్ వర్కర్స్కు ఉద్యోగంతోపాటు సామాజిక భద్రత కల్పిస్తామని 2025-26 కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 21న పార్లమెంటులో హామీ ఇచ్చారు. కానీ, రెండు మాసాలు పూర్తయినప్పటికీ కనీసం అమలుకు కార్యాచరణ రూపొందించలేదు. నిర్మలా సీతారామన్ తమ ప్రసంగంలో.. దేశంలో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల గిగ్ వర్కర్లు కొత్తయుగం సేవలు ఆర్థిక వ్యవస్థకు, గొప్ప చైతన్యాన్ని అందిస్తున్నారు. వారి సేవలను ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు.
ప్రభుత్వం వారికి గుర్తింపు కార్డులతో పాటు, సామాజిక భద్రతా కవరేజీని, ఇ- శ్రామ్ పోర్టల్లో నమోదు, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన
( పిఎంజెఏవై) కింద ఆరోగ్య సంరక్షణ సదుపాయాన్ని అందిస్తామని వెల్లడించారు. గిగ్ వర్కర్స్కు వారి ఉద్యోగాలు గౌరవంగా ఉండేందుకు అన్ని రక్షణలు కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఇప్పటివరకు వారి ఉద్యోగ, సామాజిక భద్రతపైన, ప్రావిడెంట్ ఫండ్ లేదా పూర్తి ఆరోగ్య కవరేజీ గురించి ఏర్పాట్లు చేపట్టలేదు.
సామాజిక భద్రత కల్పించే చట్టాలను సవరించిన కేంద్రం
గిగ్ వర్కర్లను గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పటమేగాని వారి భద్రతకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు నేటికీ జారీ చేయలేదు. ఆన్ లైన్ సేవల్లో పనిచేస్తున్న దాదాపు కోటి మంది గిగ్-వర్కర్లకు సహాయం చేసే అవకాశం ఉంది అని మాత్రమే తెలిపారు. ఇటీవలి భారతదేశం గిగ్, ప్లాట్ఫారమ్ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్నందున, 2030 నాటికి ఈ రంగంలో 2.35 కోట్లకు గిగ్-వర్కర్ల సంఖ్య పెరుగుతుందని అంచనాను బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్ఫాం ఎకానమీ జూన్ 2022లో ప్రచురించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కోట్లాదిమంది కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమం కోసం ఉన్న చట్టాలను మార్పులుచేసి 4 లేబర్ కోడ్స్‌గా మార్చి 2025 ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోనికి తెచ్చింది. కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నందున అధికారికంగా ప్రకటించలేదు.
కేంద్రం కట్టుబడి ఉన్నదంటున్నది!
కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి డా. శోభా కరంద్లాజే 2024 నవంబర్లో రాజ్యసభలో గిగ్ వర్కర్స్ భద్రతకు హామీ ఇచ్చారు, సామాజిక భద్రత కోడ్ 2020.. గిగ్ వర్కర్లు, ప్లాట్ఫారమ్ కార్మికులకు రక్షణ, ప్రమాద బీమా, ఆరోగ్యం, ప్రసూతి ప్రయోజనాలు, వృద్ధాప్య రక్షణ మొదలైన విషయాలపై తగిన సామాజిక భద్రతా చర్యలను రూపొందించడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అయితే, ఫిబ్రవరి 1, 2025న గిగ్ వర్కర్ల యూనియన్ ఢిల్లీలో రద్దు చేయడమైంది.
గిగ్, ప్లాట్ఫారమ్ కార్మికులు రక్షణలు లేనివారిగా రోడ్డున పడ్డారు. అయితే, కేంద్ర కార్మికశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ.. దాదాపు కోటి మంది గిగ్ కార్మికులకు సాధికారత, ఇతర అసంఘటిత రంగాలలోని కార్మికులకు సామాజిక భద్రత ప్రయోజనాలను విస్తరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని తెలిపారు.
గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం భరోసా
రాష్ట్రంలో పనిచేస్తున్న గిగ్ ప్లాట్‌ఫామ్ వర్కర్లకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు.. సంక్షేమం, సామాజిక భద్రత, బీమా తదితర సదుపాయాలు కల్పించేందుకు కార్మిక శాఖ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్ల ( రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం ) ముసాయిదా బిల్లు రూపొందించింది. ఈ బిల్లుపై ఈ నెల 28 వరకు అభ్యంతరాలు స్వీకరించి తుది ముసాయిదా సిద్ధం చేయనుంది. ఈ ముసాయిదాలో గిగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత, బీమా, హక్కుల కోసం ప్రభుత్వం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనుంది.. ఈ బోర్డుకు సంక్షేమ నిధిని సమకూర్చనుంది. ఈ కార్మికులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయనుంది. కాగా, రాష్ట్రంలో గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్ల ముసాయిదా బిల్లును ప్రజాభిప్రాయ సేకరణకు అందుబాటులో ఉంచారు.
కార్మిక దినోత్సవం రోజు (మే 1)న బిల్లును అమలులోనికి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే బోర్డుకు కార్మిక శాఖ మంత్రి చైర్మన్ గా, కార్మికశాఖ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి సీఈఓగా ఉంటారు. గిగ్ వర్కర్ల నుంచి నలుగురు, అగ్రిగేటర్ల నుంచి నలుగురు, గిగ్ వర్కర్ల కోసం పనిచేస్తున్న పౌర సంఘాల నుంచి ఇద్దరు చొప్పున సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. నామినేటెడ్ సభ్యుల పదవీ కాల పరిమితి మూడేళ్లు ఉండేవిధంగా డ్రాఫ్ట్ బిల్లు రూపొందించారు.
గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా
రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మందికి పైగా రవాణా, ఫుడ్ ప్యాకేజ్డ్ డెలివరీలో గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తించేలా 2023 డిసెంబర్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే కొత్త చట్టం దేశానికి మార్గదర్శకంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు.
ఈ బోర్డు మే 1 నుంచి అమలులోనికి వస్తున్నందున.. 45 రోజులలోగా అగ్రిగేటర్లు, యాజమాన్యాలు ఈ సంక్షేమ బోర్డులలో రిజిస్టర్ చేసుకోవాలి. ప్రతి గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్ తమపేర్లు నమోదు చేసుకునేందుకు సెల్ఫ్ రిజిస్టర్ వ్యవస్థను అందుబాటులోనికి తెచ్చారు. ఈ వివరాలను బోర్డు వెబ్ పోర్టల్లో పొందుపరిచారు. ఈ పనులు చేసేవారిలో చాలామంది మైగ్రేట్ వర్కర్స్ ఉన్నందున, ప్రతి మూడు నెలలకు ఒకసారి తమ వద్ద నమోదైన వర్కర్ల వివరాల్లో మార్పులు చేర్పులను బోర్డుకు అందజేయాలి.
కార్మికుల సంక్షేమానికి నిధి
కార్మికుల సామాజిక భద్రత కోసం ప్రత్యేక నిధిని అగ్రిగేటర్లు, ప్లాట్‌ఫామ్‌ల యజమానులు,.. గిగ్ వర్కర్లకు ప్రతి లావాదేవీకి చేసే చెల్లింపుల్లో 1 శాతానికి తక్కువ కాకుండా రెండు శాతానికి మించకుండా జమ చేయాలి. ఎవరైనా అగ్రిగ్రేటర్ యజమాన్యం ఫీజును సంక్షేమ నిధికి చెల్లించకుంటే ఏడాది జైలు లేదా రూ.2 లక్షల జరిమానా లేదా రెండు విధించే అంశాన్ని చట్టంలో పొందుపరిచారు. గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్లను దర్యాప్తు నోటీసు లేకుండా తొలగించడానికి వీల్లేదు. గిగ్ వర్కర్లు వినియోగదారులను భౌతిక, మానసిక వేధింపులకు గురిచేసినట్టు గుర్తిస్తే వారిని వెంటనే తొలగించవచ్చు. గిగ్ వర్కర్లకు యాజమాన్యాలు సకాలంలో చెల్లింపులు చేయాలి.
గిగ్ వర్కర్ల ఉద్యోగ సామాజిక భద్రత పథకాల చెల్లింపులు, ఇతర ప్రోత్సాహకాలపై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమిస్తుంది. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తయారుచేసిన బిల్లు www.labour.telangana.gov.in వెబ్ సైట్లో అందుబాటులో ఉంది. ఈ బిల్లుపై సూచనలు, సలహాలు, అభ్యంతరాలు ఈ నెల 28న సాయంత్రం 5 గంటల వరకు లేబర్ కమిషనర్ కార్యాలయంలో అందించాలని కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. గిగ్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు తీసుకురావటాన్ని కార్మికులు స్వాగతిస్తున్నారు.
ఉజ్జిని రత్నాకర్ రావు,- ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు