తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా.. అలాగే డబ్బు, మద్యం ఇతర విలువైన వస్తువులను ఓటర్లను ప్రలోభపెట్టడానికి రవాణా లేదా నిలువ ఉంచిన సందర్భాలలో నిఘా పెట్టి కేసులు నమోదు చేయడం జరుగుతున్నది. ఇందుకోసం చెక్‌పోస్టులు, పోలీసు గస్తీలు వంటివి నిర్వహిస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద గానీ లేక ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకున్న డబ్బు, మద్యం, బంగారం వంటి వాటిని జప్తు చేసి సంబంధిత అధికారులకు అప్పజెప్పడం జరుగుతోంది.
- క్రికెట్ మ్యాచ్‌లో ఒక్కొక్క ఓవర్ తరువాత స్కోరు చెప్పినట్టుగా ప్రతిరోజు లెక్కలు కట్టి ప్రసార మాధ్యమాలకు తెలుపడం, వాటి ద్వారా ప్రజలకు తెలియడం జరుగుతున్నది. అయితే మొత్తం జప్తు చేసిన డబ్బు, బంగారం, ఇతర విలువైన వస్తువులు వాటికి తగిన ఆధారాలు చూపించినా రెండు, మూడు రోజుల తరువాత సంబంధిత యజమానులకు అందజేయడం జరుగుతోంది. ఇంతవరకు జప్తు చేసిన దానిలో 90% ఎన్నికలకు సంబంధం లేదని, అలాగే యజమానులు సంబంధించిన పత్రాలు చూపించడంతో వదిలిపెడుతున్నారు. కానీ, వదిలిపెట్టిన విషయాలు పత్రికలలో రావడం లేదు. ఇప్పటివరకు అంటే 10 నవంబర్‌నాటికి దాదాపుగా రూ. 500 కోట్ల డబ్బు జప్తు చేసినారనుకుంటే, దానిలో 90% (అంటే 450 కోట్లు) జప్తు చేసిన రెండు మూడు రోజులలో విడుదల చేయడం జరిగింది. ప్రజలకు మాత్రం రూ.500 కోట్లు పట్టుకున్నట్టుగా, వాటిని ఓటర్లకు పంచడానికి తీసుకెళుతున్నట్టుగా చెప్పడంతో ప్రజలలో లేనిపోని అపోహలు కలుగుతున్నాయి.
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చెప్పినా...
ఎన్నికలకు సంబంధించిన డబ్బు ఏదైతే కేసు నమోదు చేస్తారో ఆ డబ్బు, బంగారం వంటివి మాత్రమే ప్రజలకు తెలపాలని, అంటే డబ్బు జప్తు చేసిన వెంటనే కాకుండా రెండు, మూడు రోజులలో విచారణ చేసి డబ్బు వాపసు ఇవ్వగా మిగిలిన డబ్బు కానీ, బంగారం వంటివి పత్రికల ద్వారా ప్రజలకు తెలపాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాయడం జరిగింది. కానీ, ఇది అమలు జరగడం లేదు. ఇకపోతే ఎన్నికలకు సంబంధించిన డబ్బు జప్తు చేసి కేసు నమోదు చేసినప్పుడు డబ్బు రవాణా చేస్తున్న డ్రైవరు లేక డబ్బు పంచుతున్న కార్యకర్తపై కేసు నమోదు చేయడం జరుగుతోంది. సాధారణంగా పోలీసు శాఖ వారు ఈ కేసుల విచారణ చేపట్టకపోవడం, ఒకవేళ విచారణ జరిగినా కోర్టులో కేసు కొట్టి వేయబడుతుంది. డబ్బు ఏ అభ్యర్థి తరఫున రవాణా లేక పంపకం జరుగుతుందో ఆ అభ్యర్థిని నేరస్థుడిగా నమోదు చేస్తే కోర్టులో అభ్యర్థికి శిక్షపడే అవకాశముంది. కానీ, అలా జరగడం లేదు.
కేసులే తప్ప శిక్షలు లేవు
కోడ్ ఉల్లంఘన వంటి కేసులలో చాలావరకు విచారణ పూర్తి అయ్యి కోర్టులలో దాఖలు చేయగా చాలామటుకు కేసులు కొట్టి వేయబడ్డాయి. ఇకపోతే డబ్బు, మద్యం వంటి కేసులలో కొన్నిటి విచారణ పూర్తి కాలేదు. 2018 ఎన్నికలలో వేల కోట్ల రూపాయిలు ఓటర్లకు పంచడం, అలాగే మద్యం ఏరులై పారినా ఇంతవరకు ఎవరికీ శిక్ష పడలేదు.
ఉదాహరణకు కొన్ని కేసులు : మధిర టౌన్ పోలీసువారు ఎన్నికల సందర్భంలో ఒక కేసులో 14,96,000, రెండవ కేసులో 49 లక్షలు పట్టుకొని ఎస్.బి.ఐ మధిరలో 6.8% వడ్డీతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం జరిగింది. ఎన్నికల సందర్భంలో జప్తు చేసిన డబ్బు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం విడ్డూరంగా ఉంది. ఇంతవరకు ఆ కేసులలో ఏమీ చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా 4 డిసెంబర్ 2018 నాడు ఎస్‌ఐ శ్రీనివాస్, పెంబర్తి చెక్‌పోస్టు వద్ద రాత్రి సమయంలో ఒక కారులో రూ.5,80,65,000 నగదు రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. విచారణలో ఆ డబ్బు హవాలా రూపంలో తీసుకొని వస్తున్నామని దానిని రూ. 1.5 కోట్లు నామా నాగేశ్వరరావుకు, రూ.2.3 కోట్లు కొండా మురళికి, రూ.2 కోట్లు వడ్డిరాజు రవిచంద్రకి అందజేయడానికి తీసుకెళుతున్నామని అందులో ప్రయాణిస్తున్న కీర్తి కుమార్ జైన్ తెలిపినాడు. ఈ కేసులో ఇంతవరకు ఏమీ చర్యలు తీసుకోలేదు. మరోకేసు.. మాదాపూరు పోలీసు సిబ్బంది రూ.2 కోట్లు ఎన్నికల కోసం రవాణా చేస్తుండగా పట్టుకొని క్రైమ్ నం. 260/2019 కేసు నమోదు చేసినారు. ఇంతవరకు పట్టుకున్న రూ. 2 కోట్ల సంగతి ఏమైందో తెలియదు. అలాగే పోలీసు వారు కేసు విచారణలో ఉందని కాలం గడుపుతున్నారు. కోసగి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అభ్యర్థి ఇంట్లో రూ.17.5 కోట్లు జప్తుచేసినారని పత్రికలలో వార్తలు వచ్చినాయి. అటు తరువాత ఐటి శాఖ అధికారులు వివరణ ఇస్తూ రూ.51 లక్షల డబ్బు దొరికిందని చెప్పారు. క్రైమ్. నం.194/2018 కేసు నమోదు చేసినా ఇంతవరకు డబ్బు విషయం కానీ కేసు విషయంగానీ పట్టించుకున్న నాథుడు లేడు.
విచారణలో జాప్యం, సాక్ష్యాలు లేక కేసుల కొట్టివేత
చాలా కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అలాగే సరియైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసులు కొట్టివేయబడుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల సందర్భంలో సంబంధిత అధికారులు ప్రతిరోజు డబ్బు, బంగారం పట్టుకుంటున్నట్టు చెపుతున్న కేసులలో చాలామటుకు వదిలివేయడం జరుగుతుంది. ఇక ఎక్కడన్నా కొన్ని కేసులు నమోదు చేసినా సరియైన దర్యాప్తు జరుగక కోర్టులలో కొట్టివేసే ప్రమాదముంది. ఎన్నికల కమిషన్ వారు ఎన్నికలలో డబ్బు, మద్యం పాత్రను అరికట్టడానికి చేస్తున్న ప్రయత్నం అభినందించదగినదే. కానీ, ఎన్నికలు అయిన మరునాడే నమోదు చేసిన కేసుల గురించి పోలీసు శాఖగానీ, ఆబ్కారీ శాఖగానీ పట్టించుకోకపోవడంతో ఇదంతా తూతూ మంత్రంగా, ఒక ప్రహసనంగా మారిపోయింది. దీంతో అభ్యర్థులు సబ్ చల్తాహై అనుకుంటున్నారు. ఎన్నికలు పూర్తి అయిన తరువాత కమిషన్ వారు కేసులు త్వరితగతిన విచారించాలని, అలాగే డబ్బు, మద్యం పంచిన అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరుతున్నది.
ALSO READ: 14 సీట్లతో బీజేపీ చివరి లిస్ట్.. మూడు స్థానాల్లో క్యాండిడేట్ల మార్పు
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో నమోదైన మొత్తం కేసులు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించి విశ్లేషించడం జరిగింది.
-యం. పద్మనాభరెడ్డి,
ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్