హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో దారుణం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లలకు సైనైడ్ ఇచ్చి, తల్లిదండ్రులు కూడా సైనైడ్ మింగారు.శుక్రవారం రాత్రి జరిగిన ఈ విషాద ఘటన.. శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన గాదు సతీశ్ (39) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఆయన సిద్దిపేట జిల్లా దౌలతాబాద్‌కు చెందిన వేద (35)ను 2012లో పెండ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కొడుకులు నిషికేత్ (9), నిహాల్(5) ఉన్నారు. నిషికేత్ నాలుగో తరగతి చదువుతుండగా, నిహాల్ ప్లే స్కూల్‌కు వెళ్తున్నాడు. బిర్లా కంపెనీలో పని చేస్తున్న సతీశ్.. బ్యాంక్ లోన్‌తో మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పరిధి కందిగూడలోని క్రాంతి పార్క్ రాయల్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొన్నాడు. కొన్నేండ్లుగా కుటుంబంతో అక్కడే ఉంటున్నాడు.
పిల్లల పరిస్థితి చూసి కుంగిపోయి..
సతీశ్ పిల్లలు ఇద్దరూ చిన్నప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. చిన్న కొడుకు నిహాల్ పుట్టుకతోనే చెవిటి, మూగ. నిహాల్ పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఎప్పుడూ కుమిలిపోయేవారు. దీనికి తోడు రెండు నెలల కింద పెద్ద కొడుకు నిషికేత్‌కు బ్రెయిన్ క్యాన్సర్ అని తేలింది. దీంతో తల్లిదండ్రులు మరింత కుంగిపోయారు. పిల్లల ట్రీట్ మెంట్ కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగేవారు. నిషికేత్ పరిస్థితి విషమంగా మారడం, నిహాల్ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో జీవితంపై విరక్తి చెందారు. పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పిల్లలకు నొప్పి తెలియకుండా ఉండేందుకు సైనైడ్ కొనుగోలు చేశారు. శుక్రవారం రాత్రి ఇద్దరు పిల్లలకు సైనైడ్ ఇచ్చి, ఆ తర్వాత సతీశ్, వేద కూడా సైనైడ్ మింగారు. శనివారం ఉదయం సతీశ్ కు ఆయన బావమరిది మణికంఠ కాల్ చేశాడు. అక్క, బావకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో సెక్యూరిటీకి ఫోన్ చేశాడు. సెక్యూరిటీ వాళ్లు సతీశ్ ఫ్లాట్ కు వెళ్లి, డోర్ కొట్టగా ఎవరూ తీయలేదు. దీంతో అనుమానం వచ్చి కుషాయిగూడ పోలీసులకు సమాచారమిచ్చారు.
నోట్ లో ఆస్తి పంపకాల వివరాలు..
పోలీసులు స్పాట్ కు వచ్చి పరిశీలించారు. బెడ్‌పై వేద, నిషికేత్, నిహాల్‌ల డెడ్‌బాడీలు.. అదే రూమ్ లో కింద సతీశ్ డెడ్ బాడీని గుర్తించారు. డైరీలో రాసిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ‘‘మమ్మల్ని ప్రశాంతంగానైనా చనిపోనివ్వండి” అని అందులో రాసి ఉంది. అలాగే తమ ఆస్తిని ఎవరెవరికి ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? ఏ అనాథాశ్రమానికి ఇవ్వాలి? లాంటి వివరాలు రాశారు. ‘‘మేం సైనైడ్ మింగాం. డెడ్‌బాడీలు తీసేటప్పడు జాగ్రత్తగా తీయండి” అని నోట్ లో రాశారు. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్పాట్ ను మల్కాజిగిరి డీసీపీ జానకి ధరావత్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.