కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే 55 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ పత్రాలను అందించింది. నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిల బెట్టుకునే క్రమంలో జాబు క్యాలెండర్లను విడుదల చేసింది. దాని ప్రకారం భవిష్యత్తులో జరగబోయే ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చే ప్రక్రియ, భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతుందని కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులకు భరోసా ఇచ్చింది.
ఈ ప్రక్రియ ఆటంకం లేకుండా నిర్వహించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉంది. కాగా, గడిచిన పదేండ్లలో అరకొర ఉద్యోగాల భర్తీ, శాస్త్రీయ పద్ధతిలో నియామక ప్రక్రియ చేపట్టకపోవడం వల్ల చాలావరకు ఉద్యోగ నియామకాలు కోర్టు కేసులలో నలిగిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు పాఠ్యాంశాలను తయారు చేసేందుకు ప్రొఫెసర్ హరగోపాల్ ఆధ్వర్యంలో.. 2015లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్‌ను నిర్ధారించడానికి కమిటీని నియమించింది. ఈ కమిటీ గత పాఠ్యాంశాలలో మార్పులు, చేర్పులను చేసి తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సిలబస్‌ను తయారుచేసింది.
నూతనంగా చేర్చిన సిలబస్‌లో తెలంగాణకు సంబంధించిన అంశాలను జోడించడం, గతంలో ఉన్న పుస్తకాలు ఏవీ కూడా తెలంగాణకు సంబంధించిన అంశాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల, నూతన పాఠ్యాంశాలకు అనుగుణంగా చాలామంది రచయితలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ సిలబస్ అనుగుణంగా పుస్తకాలను రచించారు. ఇంతకుముందు ఈ నూతనంగా చేర్చిన అంశాలపైన ఎటువంటి ప్రామాణికమైన పుస్తకాలు లేవు. దీంతో కొత్తగా మార్కెట్లోకి వచ్చిన పుస్తకాలలో కొన్నింటిని ప్రామాణికంగా భావించి విద్యార్థులు తమ ప్రిపరేషన్ మొదలుపెట్టారు.
మారిన సిలబస్‌కు అనుగుణంగా తెలుగు అకాడమీ పుస్తకాలను తయారుజేసింది. గత ప్రభుత్వం కూడా పోటీ పరీక్షల్లో ఉన్న సిలబస్ ఆధారంగా వివిధ సబ్జెక్టుల నిష్ణాతులతో తెలుగు అకాడమీ పుస్తకాలను తయారు చేయించింది. ఈ తెలుగు అకాడమీ పుస్తకాల తయారీలో ఒక్కొక్క సబ్జెక్టుకు ఆయా సబ్జెక్టులలో నిష్ణాతులైన అనుభవం ఉన్నవారిని సంపాదకులుగా నియమించింది. ఇలా కొంతమంది కలిసి తెలుగు అకాడమీ పుస్తకాలను తయారుజేశారు. ఇలా తయారైన పుస్తకాలనే తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ప్రామాణికంగా భావించి హాజరయ్యారు.
కోచింగ్ సెంటర్ల అశాస్త్రీయ పుస్తకాలు
చాలా కోచింగ్ సెంటర్లు తెలుగు అకాడమీ పుస్తకాలను, ఇతర పద్ధతుల ద్వారా సమకూర్చుకున్న పాఠ్యాంశాలను గైడ్ల రూపంలో ప్రింట్ చేసి అధిక ధరలకు అమ్మి డబ్బును సొమ్ము చేసుకున్నారు. సబ్జెక్టుకు సంబంధించిన డిగ్రీలు లేని వారు కూడా చాలామంది కోచింగ్ సెంటర్లలో పనిచేస్తున్నారు. ఉద్యోగాల కోసం ప్రిపేరై ఉద్యోగాలు రానివారు కోచింగ్ సెంటర్లు పెట్టుకొని ప్రామాణికం లేని మెటీరియల్ తయారుచేసి విద్యార్థులకు అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం తయారవుతున్న విద్యార్థులకు ఈ మధ్యకాలంలో టీజీపీఎస్సీ చేసిన కామెంట్స్ కొంత నిరాశకు గురి చేసింది. తాము తెలుగు అకాడమీ పుస్తకాలలో, కోచింగ్ సెంటర్ల పుస్తకాలలో కోట్ చేసిన వాటిని ప్రామాణిక ఆధారంగా భావించలేమని టీజీపీఎస్సీ చెప్పడం జరిగింది. చాలామంది అభ్యర్థులు తెలుగు అకాడమీ పుస్తకాలపైనే ఆధారపడి చదివారు.
వారు కొన్ని ప్రశ్నలకు టీజీపీఎస్సీ ఇచ్చిన ఆన్సర్ ‘కీ’లకు పొంతనలేదని కోర్టును ఆశ్రయించారు. తెలుగు అకాడమీ పుస్తకాలనే ప్రామాణికంగా తీసుకున్నట్టు కోర్టుకు వివరించారు. కానీ, ఇందుకు భిన్నంగా టీజీపీఎస్సీ తెలుగు అకాడమీ పుస్తకాలకు ఎటువంటి ప్రామాణికం లేదని కోర్టుకు సమర్పించారు. ఇవి కేవలం రన్నింగ్ నోట్స్, గైడ్స్ లా మాత్రమే పనికొస్తాయని వీటికి ఎటువంటి ప్రామాణికత లేదని టీజీపీఎస్సీ తెలపడంతో అభ్యర్థుల్లో సందిగ్ధతకు దారితీసింది.
ప్రామాణిక పుస్తకాలను ప్రభుత్వం ప్రతిపాదించాలి
తెలంగాణ కల్చర్, తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి ఎటువంటి ప్రామాణిక పుస్తకాలు లేవు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ప్రామాణికంగా తీసుకోవడానికి ఎన్సీఈఆర్టీ కూడా తెలంగాణ సంస్కృతి, సామాజిక చరిత్ర పైన ఎటువంటి పుస్తకాలను ముద్రించలేదు. దీంతో సందిగ్ధ పరిస్థితుల్లో పోటీ పరీక్షలకు తయారవుతున్న విద్యార్థులు ఉన్నారు. కాబట్టి, ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను ప్రామాణిక పద్ధతిలో తయారు చేయడానికి ఒక కమిటీని నియమించాలి. ఆ నియమించిన కమిటీ రూపొందించిన పుస్తకాలను మాత్రమే ప్రామాణికంగా పరిగణించాలి.
టీజీపీఎస్సీ ఏయే పుస్తకాలు ప్రామాణికమైనవి, అభ్యర్థులు ఏ పుస్తకాలను చదవాలో తమ వెబ్సైట్లో ఒక గైడ్‌లైన్స్ రూపంలో ప్రతిపాదించాలి. వాటిని మాత్రమే చదివేటట్టు కోచింగ్ సెంటర్లు కూడా తమ ఇష్టానుసారంగా పుస్తకాలను తయారు చేయకుండా కోచింగ్ సెంటర్ల పైన ఒక నియంత్రణ కమిటీని నియమించాలి. ప్రభుత్వం ఎప్పుడూ కోచింగ్ సెంటర్ల పైన ఒక నిఘా ఉంచాలి.
అశోక్ నగర్ మరియు కోటి చౌరస్తాలలో చాలామంది రచయితలు పోటీ పరీక్షల కోసం ఎటువంటి ప్రమాణాలు పాటించని చాలా పుస్తకాలను ప్రచురిస్తున్నారు. విక్రయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన విద్యా కమిషన్ దీనిపైన దృష్టి కేంద్రీకరించి మంచి నిపుణులతో ప్రామాణికమైన బుక్కులను రూపొందించి పోటీ పరీక్షలకు తయారయ్యే వారికి అందిస్తే బావుంటుంది.
అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు హైదరాబాద్‌కు వచ్చి కోచింగ్ తీసుకునే ఆర్థిక స్తోమత లేని వారికి ఈ ప్రామాణిక పుస్తకాలు వారి జీవితాల్లో వెలుగులు నింపే ఆశాజ్యోతిగా ఉంటాయి. చాలామంది విద్యార్థులకు చదవాలని కుతూహలం ఉన్నా సరైన పుస్తకాలు లేక వెనకబడుతున్నారు. కాబట్టి, ఇది ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వం గుర్తించాలి.
- డా. ఏ శంకర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఐలమ్మ మహిళా యూనివర్సిటీ-