పోటీ పరీక్షలకు ప్రామాణిక పుస్తకాలేవి.?

 పోటీ పరీక్షలకు  ప్రామాణిక పుస్తకాలేవి.?

పోటీ పరీక్షలు అంటేనే అనేక విషయాలపై మంచి పట్టు సాధించాలి. వీటికి సిద్ధమయ్యే అభ్యర్థులు ప్రైవేట్ పుస్తకాల కన్నా తెలుగు అకాడమీ ముద్రించే పుస్తకాలను ప్రామాణికంగా భావిస్తారు. పోటీ పరీక్షల నిపుణులు సైతం మొదటగా తెలుగు అకాడమీ పుస్తకాలను చదవాలని సూచిస్తుంటారు. ఇప్పటికే తెలుగు అకాడమీ పోటీ పరీక్షల నిమిత్తం చరిత్ర, భూగోళ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి పలు పుస్తకాలను ప్రచురించింది. వీటినీ అనుభవజ్ఞులైన విషయ నిపుణులచే రూపొందించడం జరుగుతోంది. 

పైగా ఆ పుస్తకాలపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు విడుదల చేసిన పలు ఉద్యోగ ప్రకటనల నిమిత్తం అని, సిలబస్ ను దృష్టిలో ఉంచుకుని ముద్రించడం జరిగిందని ముందుమాటలో స్పష్టంగా పేర్కొంటారు. తెలుగు అకాడమీ 1968లో రాష్ట్ర భాష సంస్థగా ఆవిర్భవించింది. ఇది వివిధ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షల కోసం ఎన్నో ప్రామాణిక పుస్తకాలను ముద్రించినది. అంతేకాకుండా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వంటి ఆనేక అకాడమీ పరీక్షల కోసం పలు పుస్తకాలను ముద్రిస్తోంది. వీటినీ రాయడానికి నిపుణులు పలు పుస్తకాలను రెఫరెన్స్​గా తీసుకుంటారు. ఈ సంస్థ విషయ కూర్పులో, భాష విషయంలో అకాడమీ కచ్చితమైన ప్రమాణాలు పాటిస్తూ పుస్తకాలు రచిస్తోంది.

ఏ పుస్తకాలను చదవాలి?

జూన్ 9,2024 న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)ఆధ్వర్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. అనంతరం ప్రశ్న పత్రానికి ప్రాథమిక కీ విడుదల చేసి, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. ఈ విషయంలో తప్పు  సమాధానాలపై ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా 7,191 అభ్యంతరాలు వచ్చాయి. వీటిని పరిశీలించిన టీజీపీఎస్సీ తుది కీలో రెండు ప్రశ్నలను మాత్రమే తొలగించి ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది. కానీ, తుది కీలో దాదాపు 14 ప్రశ్నలకు సమాధానాలు తప్పులున్నాయని ఆధారాలతో అభ్యర్థులు తెలంగాణ హైకోర్ట్ ను ఆశ్రయించారు. ఇందులో కచ్చితంగా 5 నుంచి 6 ప్రశ్నలకు తప్పు సమాధానాలున్నట్లు విషయ నిపుణులు సైతం చెబుతున్నారు. వీటికి రిఫరెన్స్​గా తెలుగు అకాడమీ పుస్తకాలను, అధికారిక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల అధికారిక సమాచారాన్ని చూపిస్తూ కోర్టులో సమర్పించారు. వీటికి స్పందనగా హైకోర్టు టీజీపీఎస్సీ బోర్డును కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. బోర్డు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో  తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. 

సమస్య పరిష్కరించకపోతే సంకట పరిస్థితి

టీజీపీఎస్సీ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న తెలుగు అకాడమీ ప్రతిష్టకు దెబ్బతీయడం ఎంత వరకు సమంజసనీయమని మేధావుల ప్రశ్న?  గతంలో పలు పోటీ పరీక్షలో అకాడమీ పుస్తకాలను రిఫరెన్స్​గా ధ్రువీకరించిన బోర్డ్, ఇప్పుడు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కీ విషయంలో ప్రామాణికం కాదనడం హాస్యాస్పదం. అభ్యంతరాలను అధికారికంగా వనరుల(authentic source)నుంచి మాత్రమే స్వీకరిస్తామని స్పష్టం చేసిన బోర్డ్.. ప్రవేట్ పుస్తకాలను, వికీపీడియాను కూడా రిఫరెన్స్​గా చూపించడమేంటి? అసలు పోటీ పరీక్షలకు ప్రామాణిక పుస్తకాలు ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు?  ఈ సమస్య పరిష్కరించకపోతే రానున్న కొన్ని నెలల్లో బోర్డ్ నిర్వహించే పరీక్షల ప్రశ్నల కూర్పు, సమాధానాల విషయంలో సంకట పరిస్థితి ఎదురుకానుంది. 

- సంపతి రమేష్ మహారాజ్,
సోషల్ ఎనలిస్ట్