హైదరాబాద్, వెలుగు: వరద సాయంపై రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు సమర్పించిన నివేదికలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వాటిలో సరైన వివరాలు లేవని తప్పుబట్టింది. రూ.500 కోట్ల పరిహారంలో ఎవరికి ఎంత సాయం చేశారో సరిగ్గా తెలుపలేదని మండిపడింది. పూర్తి వివరాలతో రిపోర్టును అందజేయాలని ఆదేశించింది. అంటు వ్యాధులు ప్రబలకుండా ఏం చర్యలు చేపట్టారో వివరించాలని స్పష్టం చేసింది.
డాక్టర్ చెరుకు సుధాకర్ దాఖలు చేసిన పిల్‌పై శుక్రవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ వినోద్ కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. సర్కారు స్పెషల్ అడ్వొకేట్హరేందర్ పరి షద్ వాదనలు వినిపిస్తూ.. వరదల కారణంగా 49 మంది మృతి చెందారని, ముందస్తు జాగ్రత్తల కోసం రాష్ట్ర డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నేతృత్వంలో వాతావరణ వివరాలను గంట గంటకు రాష్ట్ర, జిల్లా పాలనాధికారులకు అందజేసినట్లు చెప్పారు. 10 ఎన్ఆర్ఎఫ్ టీమ్‌లు, 2 హెలికాప్టర్లతో పాటు ఐసీఎస్, రాష్ట్ర అగ్నిమాపకశాఖ, అత్యవసర సేవల విభాగం సిబ్బంది వరద సహాయ చర్యల్లో పాల్గొన్నారని వివ రించారు. 177 షెల్టర్లు ఏర్పాటు చేసి 11,748 మందికి ఆశ్రయం కల్పించినట్లు చెప్పారు. దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించినట్లు తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లిలో నలుగురు మృతిచెందారని ఆయన అన్నారు. బెంచ్ స్పందిస్తూ.. వరదల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరిహారంగా రూ.4 లక్ష ల చొప్పున ఎంత మందికి సాయం అందజేశారు? వరదల్లో నష్టపోయినవారిని ఎంత మందిని గుర్తించారు? సాయం అందుకున్న కుటుంబాల వివరాలు అంద జేయాలని ఆదేశించింది. పిటిషనర్ తరపు లాయర్ చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. వరదలు సంభవించిన నాలుగైదు రోజులపాటు అధికారులు స్పందించలేదన్నారు. వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు.
ఈ దశలో బెంచ్ జోక్యం చేసుకుంటూ.. ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో వ్యతిరేకత ఉండకూడదని, ప్రభుత్వంపై దాడికి దీన్ని వేదికగా వాడుకోరాదంది. ఇప్పుటికిప్పుడు పిటిషన్‌పై విచారణను ముగించడంలేదని తెలిపింది. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.