
కేంద్రానికి మెహబూబా ముఫ్తీ ప్రశ్న
శ్రీనగర్ : అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ బార్డర్వద్ద ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతలు ఏర్పడటం బాధాకరమని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు. చైనా మన భూభాగాలను ఆక్రమిస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏమీ చేయకపోవడం దురదృష్టకరమని ఆమె విమర్శించారు. ‘‘లడఖ్‌లో చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లోనూ ఆక్రమించారని ఓ బీజేపీ ఎంపీ చెప్తున్నారు. చైనా సైనికులు మన సోల్జర్లను కొట్టారు. మనోళ్లు తిరిగి కొట్టేందుకు మాత్రం కేంద్రం అనుమతించలేదు. ఇది చాలా బాధాకరం. చైనా మన భూముల్ని ఆక్రమిస్తుంటే కేంద్రం వద్ద సమాధానమే లేదు” అని ముఫ్తీ మండిపడ్డారు. కాగా, కాశ్మీర్ సిటిజన్లను కేంద్రం నమ్మదని, అందుకే యూనిక్ ఐడీలు సృష్టించి తమ పౌరులపై నిఘా వేయాలనుకుంటోందని ఆరోపించారు.