విశ్లేషణ: దళితులకు కాంగ్రెస్​ మళ్లా దగ్గరైతదా?

కాంగ్రెస్​ పార్టీకి తరతరాలుగా దళితులే వెన్నెముక. జాతిపిత మహాత్మాగాంధీ తన పొలిటికల్​ మిషన్​ అయిన దేశ స్వాతంత్ర్యాన్ని సాధించడానికి సమాంతరంగా అంటరానితనానికి వ్యతిరేకంగా చరిత్రాత్మకమైన పోరాటాన్ని సాగించారు. ఇందులో భాగంగా సామాజికంగా, సాంస్కృతికపరంగా దళితులను పైకి తెచ్చేందుకు ఎన్నో చర్యలను తీసుకున్నారు. ఇందిరాగాంధీ ఈ పోరాటాన్ని మరో దశకు తీసుకెళ్లారు. ఆర్థిక, రాజకీయ సాధికారతను కల్పించడం ద్వారా సమాజంలో వారికి గుర్తింపును ఇచ్చారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దళితులు దూరమవుతున్నారు. అసలు కాంగ్రెస్​ పార్టీకి దళితులు ఎందుకు దూరమవుతున్నరు? ఆ పార్టీని వారు వదిలేయడానికి కారణమేంటి? మళ్లీ దళితులకు కాంగ్రెస్​ పార్టీ దగ్గర కాగలదా?

‘ద దళిత్​ ట్రూత్’ కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నాయకుడు కొప్పుల రాజు రాసిన పుస్తకమిది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని రాహుల్​గాంధీ రిలీజ్​ చేశారు. ఈ పుస్తకంలో దళితులు కాంగ్రెస్​కు ఎందుకు దూరమవుతున్నారు? వారిని తిరిగి తమ పార్టీవైపునకు తీసుకురావడం ఎలా? అనే ప్రశ్నలకు ఆయన సమాధానాలు వెతికే ప్రయత్నం చేశారాయన. ఈ అంశాన్ని మూడు భాగాలుగా ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు దళితుల కోసం చేసింది అసమానమైనది. దళితులతో బంధాన్ని కాంగ్రెస్​ ఎందుకు కోల్పోతోంది. మళ్లీ వారిని కాంగ్రెస్​వైపునకు తీసుకురావడం ఎలా? అనే అంశాలపైనే ఆయన ప్రధానంగా ఫోకస్​ పెట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్​ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గురించి కొప్పుల రాజు ప్రస్తావించారు. 40 ఏండ్ల వయసులో ఆయనను సీఎం చేసింది కాంగ్రెస్​ పార్టీయేనని, 1960 నుంచి 1962 వరకు ఆయన సీఎంగా, 1962 నుంచి 1963 వరకు కాంగ్రెస్​ పార్టీకి తొలి దళిత ప్రెసిడెంట్​గా వ్యవహరించారని గుర్తు చేశారు. మండల్​ కమిషన్​ రావడానికి చాలాకాలం ముందే దామోదరం సంజీవయ్య.. ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రిగా ఓబీసీలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 27 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన విషయాన్ని వివరించారు. అప్పట్లో కాంగ్రెస్​ పార్టీ ఎలక్టోరల్​ బేస్​ మొత్తం ప్రధానంగా దళిత్–ముస్లిం–బ్రాహ్మిణ్​ కాంబినేషన్​లోనే ఉండేది. అయితే ఓట్​ బేస్ ​మూడుగా విడిపోవడంతో కాంగ్రెస్​ పార్టీ రాజకీయ భవిష్యత్తు క్రమంగా దెబ్బతింటూ వచ్చింది. దళితులు బీఎస్పీ వైపు అడుగులు వేస్తే, ముస్లింలు థర్డ్​ ఫ్రంట్​ పార్టీల చెంతకు చేరారు. ఇక బ్రాహ్మణులు పూర్తిగా బీజేపీ వైపు మొగ్గు చూపారు. తాము కోల్పోయిన ఎలక్టోరల్​ బేస్​ను తిరిగి సాధించడమే రాహుల్​గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్​ పార్టీ ముందు ఉన్న ప్రధాన లక్ష్యం.

కీలకపాత్ర వహిస్తున కొప్పుల రాజు
దళితులకు సంబంధించిన ఎంతో కీలకమైన ఈ పని కోసం రాహుల్​గాంధీ.. కొప్పుల రాజును ఎంచుకున్నారు. ఆయనను ఇటీవల ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డిపార్ట్​మెంట్స్​కు అబ్జర్వర్​గా అపాయింట్​ చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సోనియాగాంధీ ఆధ్వర్యంలో నేషనల్​ అడ్వయిజరీ కౌన్సిల్ (ఎన్ఏసీ) సెక్రటరీగా రాజు గతంలో పనిచేశారు. ఆ తర్వాత ఏఐసీసీ ఎస్పీ డిపార్ట్​మెంట్​ చైర్మన్​గా ఆయన అపాయింట్​ అయ్యారు. అంటే దళితులను దగ్గర చేసుకోవడానికి మాత్రమే కాదు మొత్తం ఓటర్లలో 85 శాతం వరకూ ఉన్న బహుజనులు, దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనార్టీలకు చేరువ కావడానికి కొప్పుల రాజు కీలకమని కాంగ్రెస్​ పార్టీ భావిస్తోంది. ఈ చర్యలు 2024 జనరల్​ ఎలక్షన్ల నాటికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్​ పార్టీకి పునరుత్తేజం ఇవ్వడానికి ఎంతో ముఖ్యమైనవి.

గాంధీల ప్రయాణం
అంటరానితనానికి వ్యతిరేకంగా జరిపిన పోరాటంతోనే కాంగ్రెస్​ లో మహాత్మాగాంధీ ప్రయాణం కీలక దశకు చేరుకుంది. గాంధీ దళితులను హరిజనులుగా పిలిచేవారు. వారి కోసం హరిజన ఫండ్​ ఏర్పాటు చేశారు. హరిజన వాడల్లో ఎన్నో పనులు చేపట్టారు. ద హరిజన్​ పేరుతో ఒక న్యూస్​ పేపర్​ను కూడా తీసుకొచ్చారు. హరిజనులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసేలా పెద్ద కులాల వాళ్లను ప్రోత్సహించారు. అంటరానితనాన్ని అంతం చేయడంలో భాగంగా చేపట్టినవే ఈ కార్యక్రమాలన్నీ. హరిజనులకు ఆలయాల్లోకి ప్రవేశం కల్పించారు. ఇతర హిందూ కులాల్లో దళిత సమానత్వం అనే విషయాన్ని బలంగా తీసుకెళ్లారు. ఇక దళితులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడానికి ఇందిరాగాంధీ ఎన్నో చర్యలు చేపట్టారు. అందుకే ఇందిరాగాంధీని అణగారిన వర్గాల వారు ఒక గొప్ప శక్తిలా చూసేవారు. కాలానుగుణంగా దళితులు కాంగ్రెస్​ పార్టీకి దూరమయ్యారు. ఒకానొక దశలో మైనార్టీలు కూడా కాంగ్రెస్ ను వదిలిపెట్టేశారు. దీంతో కాంగ్రెస్​ పార్టీ పొలిటికల్, ఎలక్టోరల్​ బేస్​ దారుణంగా దెబ్బతింది. అది ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. రాహుల్​గాంధీ దళితులను తిరిగి కాంగ్రెస్​కు దగ్గర చేయడమే లక్ష్యంగా తన పొలిటికల్​ జర్నీని స్టార్ట్​ చేశారు. మహాత్మాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని ఉత్తరప్రదేశ్​లోని ఒక గ్రామంలోని దళితుల ఇంట్లో రాహుల్​గాంధీ రాత్రి బస చేశారు. 

కరాచీ తీర్మానం
1931లో పండిట్​ జవహర్​లాల్​ నెహ్రూ కాంగ్రెస్​ పార్టీ కరాచీ సెషన్​లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో సంపూర్ణ స్వాతంత్ర్యం తమ పార్టీ లక్ష్యంగా ప్రకటించారు. దీనికి అనుబంధంగా ప్రజలందరికీ సమానత్వం అనే విషయంపై ఇచ్చి దళితులు, మైనార్టీలకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. అలాగే ప్రాథమిక హక్కులతోపాటు పౌర హక్కులకు రక్షణ కల్పిస్తూ తీర్మానం చేశారు. కరాచీ తీర్మానం, నెహ్రూ రిపోర్ట్​ ఆ తర్వాత రాజ్యాంగ రూపకల్పనకు దారి చూపింది. 1949లో ఏర్పాటైన రాజ్యాంగ అసెంబ్లీకి నెహ్రూ వీటి ఆధారంగానే లక్ష్యాలను నిర్దేశించారు. 

అంబేద్కర్​కు గాంధీ మద్దతు
మహాత్మాగాంధీ సూచనలతోనే డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ను రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్​గా నియమించారు. అంబేద్కర్​ను, శ్వామా ప్రసాద్​ ముఖర్జీని కేంద్ర మంత్రులుగా చేయాలని, తద్వారా ప్రొవిజనల్​ గవర్నమెంట్​ను, నేషనల్ గవర్నమెంట్ గా మార్చాలని కూడా గాంధీనే సూచించారు. ఈ ప్రభుత్వం 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల వరకు కొనసాగింది. దళితుల కోసం కాంగ్రెస్​ పార్టీ ఏం చేసిందో కొప్పుల రాజు ఒక లిస్ట్​ను తయారు చేశారు. అంటరానితనం నిషేధించారు. రాజ్యాంగం ప్రకారం దళితులు, మైనార్టీలకు హక్కులు కల్పించారు. ఇలా ఏర్పాటు చేసిన రాజ్యాంగ వ్యవస్థల వల్ల అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వాలకు పథకాలను అమలు చేయడం తేలికైంది. ప్రీమెట్రిక్, పోస్ట్​ మెట్రిక్​ స్కాలర్​షిప్​లను అందించడం, సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేయడంలో దీనిలో భాగమే. దళితుల కోసం ఎన్నో పటిష్ట పథకాలను తీసుకొచ్చారు. జీవనం కోసం ఆర్థిక సాయం అందించడం, ఇంటి స్థలాల కేటాయింపు మొదలైన వాటి వల్ల దళితుల్లో నమ్మకం పెరిగింది. ఆ తర్వాత రాజీవ్​గాంధీ చరిత్రాత్మకమైన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, 1989ని అమలులోకి తెచ్చారు. అలాగే నేషనల్​ షెడ్యూల్​ క్యాస్ట్స్ ఫైనాన్స్, డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ ఏర్పాటు చేసి దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడ్డారు. 

సవాళ్లు ఎన్నో ఉన్నయ్
అంబేద్కర్​ సిద్ధాంతాలతో మళ్లీ కాంగ్రెస్​ పార్టీవైపునకు దళితులను తీసుకురావడం అనేది కొప్పుల రాజు ముందు ఉన్న సవాల్. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్​ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కాన్షీరాం మొదలుపెట్టిన పోరాటాన్ని మాయావతి వదిలి పెట్టి రాజకీయాల నుంచి పక్కకు తప్పుకోవడం ఒక్కటే చిన్న కాంతిరేఖ. విస్తృత స్థాయిలో కార్యక్రమాలను చేపట్టడం ద్వారా మళ్లీ దళితులకు కాంగ్రెస్​ పార్టీ చేరువయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా వారి మనసులను గెలుచుకోవచ్చు. అయితే ఈ విషయంలో కొప్పుల రాజుకు ఒక అసాధారణ నిబద్ధత ఉంది. అది ఆయన ప్రయత్నాలను విజయవంతం చేయవచ్చు.

అంబేద్కర్​ చూపిన మార్గంలో..
సమానత్వం అనే లక్ష్యాన్ని సాధించడానికి రాజ్యాంగాన్ని ఒక చుక్కానిలా వాడుకోవాలని తన పుస్తకంలో కొప్పుల రాజు సూచించారు. తన పుస్తకం పరిచయంలో అంబేద్కర్​ విగ్రహాల గురించి వివరిస్తూ.. ఒకచేత్తో రాజ్యాంగాన్ని పట్టుకుని, మరో చేత్తో ముందుకెళ్లే దారి చూపించడం అనేది అద్భుతమని కొనియాడారు. ‘‘ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా కలిగి ఉండి, చరిత్రలో ఎక్కువ కాలం పాటు వివక్షను ఎదుర్కొన్నది దళితులే. రాజ్యాంగంలో హామీ ఇచ్చిన ప్రకారం వారికి సమానత్వాన్ని అందించడానికి, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా వారు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. ఈ పుస్తకం వారి పోరాటాలను తెలియజేయడానికే”అని రాజు వెల్లడించారు. భారత రాజ్యాంగం సామాజిక సంస్కరణలకు ఒక చుక్కాని, సమాజంలో వేళ్లూనుకుపోయిన అసమానతల నుంచి స్వేచ్ఛనిచ్చే సాహసోపేతమైన ప్రయత్నమిది అని చెప్పారు. 

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- పర్సా వెంకట్​, పొలిటికల్​ ఎనలిస్ట్​