తెలంగాణ తెచ్చింది.. అభివృద్ధి చేసింది నేనే: కేసీఆర్

 తెలంగాణ తెచ్చింది.. అభివృద్ధి చేసింది నేనే: కేసీఆర్
 
  • 50 ఏండ్ల దరిద్రాన్ని 10 ఏండ్లలో పోగొట్టినం 
  • వేరేటోళ్లకు ఓటేస్తే  నా కష్టం వృథా అవుతుంది
  • ఈ సారి అధికారంలోకి వచ్చాక గల్ఫ్ బాధితులకు న్యాయం చేస్తం
  • దుబ్బాకలో కత్తులే పట్టుకోవాలంటే మాకు పెద్ద కత్తులు దొరకవా?
  • జగిత్యాల, ఖానాపూర్, వేములవాడ, దుబ్బాక ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం

ఖానాపూర్/జగిత్యాల/వేములవాడ/సిద్దిపేట/దుబ్బాక, వెలుగు: చేతిలో పవర్ ​లేకుండా నేనేం చేయగలను. యుద్ధం చేసేటోడికి కత్తి ఇవ్వాలి. పవర్ ​ఇస్తేనే ఏదైనా చేయగలను. తెలంగాణ తెచ్చింది నేనే.. అభివృద్ధి చేసింది నేనే.. అంతకన్నా గొప్ప పదవి ఇంకేం లేదు’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. 50 ఏండ్ల దరిద్రాన్ని10 ఏండ్లలో పోగొట్టానని, వేరేవాళ్లకు ఓటేస్తే తన కష్టం వృథా అవుతుందని అన్నారు. 

అభ్యర్థితో పాటు వారి వెనుకున్న పార్టీ చరిత్ర చూసి ఓటేయాలని కోరారు. ఆదివారం జగిత్యాల, నిర్మల్​జిల్లా ఖానాపూర్, వేములవాడ, దుబ్బాకలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్​పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారని, ఇందిరమ్మ రాజ్యంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల వారెవరూ బాగుపడలేదన్నారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఆంధ్రాలో కలిసిందని మండిపడ్డారు. ‘‘ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్ నా కొడుకు రాముకు క్లాస్మెంట్. జాన్సన్ ను గెలిపిస్తే రాము ఖానాపూర్​ను దత్తత తీసుకుంటాడు. మూడోసారి అధికారంలోకి వచ్చాక గల్ఫ్ బాధితులకు న్యాయం చేస్తాం. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల మెడకు ఉరి ఖాయం. హస్తం నేతలు తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదు.. ముంచడం తప్ప. రాష్ట్రంలో కాంగ్రెస్​గాలి లేనేలేదు. బీఆర్ఎస్ అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయం. తెలంగాణ తేవడమే నాకు గొప్ప పదవి. ప్రజల ఆశీర్వాదంతో పదేళ్లు సీఎంగా పని చేశా. పేదరికం నిర్మూలన, వంద శాతం అక్ష్యరాస్యత సాధించడమే నా లక్ష్యం. కాంగ్రెస్ లో12 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. ఎవరు సీఎం అవుతారో.. వాళ్లకే తెలియదు’’ అని కేసీఆర్​చెప్పారు.

కోర్టు కేసుల వల్లే చెన్నమనేనికి టికెట్​ ఇయ్యలే..

జగిత్యాల అభివృద్ధికి జీవన్​రెడ్డి చేసిందేమీ లేదని కేసీఆర్​విమర్శించారు. ఉద్యమ సమయంలో ఆంధ్రా పాలకులతో కలిసి జీవన్​రెడ్డి తనపై ఎంపీగా పోటీ చేశాడని, చివరికి జనం తనకే పట్టం కట్టారని గుర్తుచేశారు. ప్రెస్​మీట్లు పెట్టి తనను తిడుతూ కూర్చుంటాడే తప్ప, జగిత్యాలను అభివృద్ధి చేయడన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ ను గెలిపిస్తే అల్లీపూర్ మండలంతోపాటు, జగిత్యాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు.  ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని కేసీఆర్​చెప్పారు. ఇడ్లి సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో ఏడుగురిని కాల్చి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. 

2004లో తెలంగాణ ఇస్తామంటేనే కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకున్నామని, చివరికి ఇవ్వకపోవడంతో దీక్షకు దిగానన్నారు. దేశంలోని 33 రాజకీయ పార్టీలను ఏకం చేసి తెలంగాణ సాధించామని కేసీఆర్​చెప్పారు. కోర్టు కేసులు ఉండటంతోనే వేములవాడ ఎమ్యెల్యే చెన్నమనేని రమేశ్​బాబుకు టికెట్​ఇవ్వలేదని స్పష్టం చేశారు. వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహరావును గెలిపించాలని కోరారు. మూడోసారి బీఆర్ఎస్​ను గెలిపిస్తే రాజన్న టెంపుల్ తోపాటు వేములవాడ ముఖచిత్రాన్ని మార్చుతామని హామీ ఇచ్చారు. రాజన్న తనకి సెంట్ మెంట్ దేవుడని చెప్పారు. తన పెండ్లి రాజన్న ఆలయంలోనే జరిగిందని గుర్తు చేశారు. ‘కాంగ్రెస్ అభ్యర్థి ఓట్లేయమని ఏడుస్తుండంట, ఏడిస్తే ఓట్లేస్తరా, ఆలోచించి ఓటేయాలి’ అని కేసీఆర్ సూచించారు.

దుబ్బాకలో దెబ్బతినొద్దు

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి తానొస్తే కథ ఒడిసిపోయేదని సీఎం కేసీఆర్ అన్నారు. నోటికొచ్చిన వాగ్దానాలు ఇచ్చి మోసకారులు గెలిచారని అసహనం వ్యక్తం చేశారు. గెలిచాక ఏ పని చేయలేదని, మరోసారి దుబ్బాకలో దెబ్బ తినకుండా చూసుకోవాలన్నారు. ‘‘దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి తిన్నొనికే ఇస్తరాకు.. నాగండ్లు ఎడ్లు.. గీసినోడిదే గుండంటూ’’ నోటికొచ్చిన హామీలు ఇచ్చారని కేసీఆర్​మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ విద్యాలయం ఇవ్వలేదన్నారు. వంద ఉత్తరాలు రాసినా పట్టించుకోలేదని,  జనాలను మోసం చేసిన బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. 

బీజేపీ అభ్యర్థికి ఓటేస్తే మోరీలో వేసినట్టేనన్నారు. దుబ్బాకలో కొట్లాడేటోనికి కత్తి ఇచ్చి, కొత్త ప్రభాకర్​రెడ్డిని గెలిపించాలని కోరారు. దుబ్బాక బిడ్డగా చెబుతున్నా బీఆర్ఎస్ చేతుల్లోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. దుబ్బాకలో గెలిచే ఎమ్మెల్యే, పార్టీ  రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ‘దుబ్బాకలో కత్తి పోట్లు ఎప్పుడైనా చూశామా? కత్తులే పట్టుకోవాలంటే మనకు దొరకవా? వాడికంటే పెద్ద కత్తులు దొరకవా? పద్ధతి కాదని ఎంత కోపమొచ్చినా అణచి వేసుకున్నాం. భగవంతుని దయవల్ల కొత్త ప్రభాకర్​రెడ్డి బతికి భయటపడ్డడు. దుబ్బాకలో పోటీ చేయాలని నేనే కొత్త ప్రభాకర్​రెడ్డిని స్వయంగా కోరాను. గెలిపిస్తే నెల రోజుల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి అన్ని సమస్యలను పరిష్కరిస్తాం”అని కేసీఆర్​
హామీ ఇచ్చారు.

కేసీఆర్​ను కలిసిన ఆస్ట్రేలియా బీఆర్​ఎస్ నాయకులు

హైదరాబాద్, వెలుగు: ఆస్ట్రేలియా బీఆర్ఎస్ అధ్యక్షుడు  కాసర్ల  నాగేందర్, ఆయన బృందం పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆదివారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యి తాము చేస్తున్న ప్రచార కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచించారు. మూడో సారి బీఆర్ ఎస్ ను గెలిపించడానికి ఎన్ ఆర్ఐ సెల్ నాయకులుప్రయత్నించాలన్నారు.