
- ఎక్కడికక్కడ స్తంభించిన పబ్లిక్ సర్వీస్ వ్యవస్థలు
- లక్షల మందిపై తీవ్ర ప్రభావం
- ఫ్రాన్స్‌లో హై వోల్టేజ్ విద్యుత్ లైన్ దెబ్బతినడమే కారణం!
- సమస్యను పరిష్కరించే పనిలో ఆయా దేశాలు నిమగ్నం
న్యూఢిల్లీ: యూరప్ దేశాలైన స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్‌లలో విద్యుత్ సరఫరాకు సోమవారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆయా దేశాల్లో సబ్‌వే నెట్‌వర్క్‌లు, మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు, ట్రాఫిక్ లైట్లు, ఏటీఎంలు, ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థలు, ఎయిర్ పోర్టులు, మెట్రో స్టేషన్లు స్తంభించిపోయాయి. ఫలితంగా లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫ్రాన్స్‌లోని అలరిక్ పర్వతంపై జరిగిన అగ్నిప్రమాదం వల్ల హై వోల్టేజ్ విద్యుత్ లైన్ దెబ్బతినడమే ఈ విద్యుత్ అంతరాయానికి కారణమని తెలుస్తున్నది. విద్యుత్ సరఫరాకు జరిగిన అంతరాయంతో స్పెయిన్‌లో అంధకారం నెలకొంది.
రాజధాని అయిన మాడ్రిడ్ తోపాటు అక్కడి ప్రధాన సిటీలైన బార్సిలోనా, వాలెన్సియా, సెవిల్లె తదితర ప్రాంతాల్లో పవర్ సప్లై పూర్తిగా నిలిచిపోయింది. మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ 27,500 మెగావాట్ల నుంచి 15,000 మెగావాట్లకు పడిపోయిందని స్పెయిన్ పవర్ గ్రిడ్ ఆపరేటర్ రెడ్ ఎలెక్ట్రికా తెలిపింది. మాడ్రిడ్‌లోని స్పెయిన్ పార్లమెంట్, దేశవ్యాప్తంగా ఉన్న సబ్‌వే స్టేషన్లు చీకటిలో మునిగాయని వెల్లడించింది.
కోర్టుల సేవలు నిలిచిపోయాయని..ఏటీఎంలు, ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థలు స్తంభించాయని చెప్పింది. స్పెయిన్‌లోని మాడ్రిడ్, బార్సిలోనా విమానాశ్రయాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ట్రాఫిక్ లైట్లు పనిచేయకపోవడంతో లిస్బన్, మాడ్రిడ్‌లో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు పనిచేయకపోవడంతో కాల్స్ చేయడం సాధ్యపడలేదు. దాదాపు దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ స్పందించారు. రెడ్ ఎలెక్ట్రికా కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి, విద్యుత్ పునరుద్ధరణ పనులను స్వయంగా పర్యవేక్షించారు.
పోర్చుగల్, ఫ్రాన్స్‌లోనూ చీకటే..
అలాగే..పోర్చుగల్‌లోని లిస్బన్, పోర్టో, ఫారోతో సహా దేశవ్యాప్తంగా పవర్ సప్లై ఆగిపోయింది. దాంతో లిస్బన్ మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. పవర్ సప్లై నిచిపోవడంతో లిస్బన్ విమానాశ్రయం మూతపడింది. ఇతర విమానాశ్రయాలు జనరేటర్‌లపై పరిమితంగా పనిచేశాయని ఈ-రెడెస్ సంస్థ వెల్లడించింది. స్పెయిన్ లో తలెత్తిన సమస్యలే పోర్చుగల్‌లోనూ ఉన్నాయని అధికారులు వెల్లడించారు. పోర్చుగల్ ప్రధానమంత్రి లూయిస్ మాంటెనెగ్రో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
విద్యుత్ సరఫరా అంతరాయం సమస్యను వేగంగా పరిష్కరిస్తామన్నారు. ఇక.. దక్షిణ ఫ్రాన్స్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా పవర్ సప్లైలో అంతరాయం వల్ల ప్రభావితమయ్యాయని ఫ్రెంచ్ గ్రిడ్ ఆపరేటర్ ఆర్‌టీఈ వెల్లడించింది. అయితే, కొద్దిసేపుట్లోనే విద్యుత్తును పునరుద్ధరించామని తెలిపింది.
ఈ భారీ విద్యుత్ సరఫరా అంతరాయానికి ఫ్రాన్స్‌లోని అలారిక్ పర్వతంపై జరిగిన అగ్నిప్రమాదమే కారణమని అధికారులు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదం ఓ హైవోల్టేజ్ విద్యుత్ లైన్‌ను దెబ్బతీసినట్లు గుర్తించామన్నారు. సమస్యను పూర్తిగా పరిష్కరించడానికి ఒక వారం పట్టవచ్చని పోర్చుగల్ గ్రిడ్ ఆపరేటర్ ఆర్‌ఈఎన్ సంస్థ పేర్కొంది.