- ఉత్తరాఖండ్ జల విలయంలో 171 మంది మిస్సింగ్.. 26 మంది మృతి
- టన్నెల్‌లో 35 ప్రాణాలు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
- స్నిఫర్ డాగ్స్, బుల్డోజర్లు, జేసీబీలతో రెస్క్యూ పనులు
- బురద, నురగ, శిథిలాలతో నిండిపోయిన టన్నెళ్లు
- 27 మందిని కాపాడిన జవాన్లు
- గ్లేసియర్‌పై సర్వేలెన్స్‌కు డీఆర్డీవో సైంటిస్టులు
ఉత్తరాఖండ్‌లో ధౌలి గంగ ఉప్పెనలా ముంచెత్తిన ఘటనలో 171 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. 26 డెడ్ బాడీస్‌ను వెలికితీసిన రెస్క్యూటీమ్.. 27 మందిని కాపాడింది. తపోవన్ దగ్గర టన్నెల్‌లో చిక్కుకున్న 35 మందిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. స్నిఫర్ డాగ్స్, బుల్డోజర్లు, జేసీబీలతో పనులు కొనసాగుతున్నాయి. నందాదేవి గ్లేసియర్‌లో మంచు చరియలు విరిగిపడటంతో గంగానది పోటెత్తిన విషయం తెలిసిందే. భారీ వరద కారణంగా రెండు హైడల్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. వాటిల్లో పనిచేస్తున్న వాళ్లంతా గల్లంతయ్యారు. ప్రస్తుతం ధౌలి గంగా రివర్ వ్యాలీతోపాటు టన్నెళ్లు బురదతో నిండిపోయాయి.
డెహ్రాడూన్/న్యూఢిల్లీ: ప్రళయ గంగమ్మ ధాటికి విలవిల్లాడిన ఉత్తరాఖండ్ తేరుకోలేదు. గంగా ఉపనది ధౌలి గంగ ఉప్పెనలా ముంచెత్తిన ఘటనలో రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి. తపోవన్ -విష్ణుగఢ్ ప్రాజెక్ట్ దగ్గర హెడ్ రేస్ టన్నెల్(హెచ్ఆర్టీ)లో 30-–35 మంది కార్మికులు చిక్కుకున్నారు. వందలాది మంది సిబ్బంది, బురదను తొలగించే పనిలో ఉన్నారు. ‘‘టన్నెల్‌లో చిక్కుకున్న వర్కర్లను కాపాడేందుకు మా టీమ్స్ ఆదివారం రాత్రి నుంచి పని చేస్తున్నాయి. స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ పంపాం. అందరినీ కాపాడగలమని భావిస్తున్నాం. టన్నెల్‌లో భారీగా నురగ, బురద, చెత్త పేరుకుపోయింది. 100 మీటర్ల దాకా క్లియర్ చేశారు. ఇంకా 100 మీటర్ల మేర శిథిలాలు తొలగించాల్సి ఉంది”అని ఐటీబీపీ స్పోక్స్‌పర్సన్ తెలిపారు.
ఎటుచూసినా బురద
ధౌలి గంగా రివర్ వ్యాలీ ఎటు చేసినా మొత్తం బురద తో నిండిపోయింది. చాలా నిర్మాణాలు కొట్టుకుపోయాయి. మరెన్నో బురద కింద కప్పబడిపోయాయి. టన్నెళ్లు కూడా బురద, నురగ, శిథిలాలతో నిండిపోయాయి. టన్నెళ్లలో చిక్కుకున్న వారిని గుర్తించి, కాపాడేందుకు స్నిఫర్ డాగ్స్, బుల్డోజర్లు, జేసీబీలను అక్కడికి తెప్పించారు.
భారీ టన్నెల్.. సింగిల్ ఎంట్రీ..
250 మీటర్ల పొడవు, 12 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు ఈ టన్నెల్‌కు ఒకే ఎంట్రీ పాయింట్ ఉంది.
టన్నెల్ వంగిపోవడంతో అక్కడ నురుగు, బురద, శిథిలాలను తొలగించడం కష్టంగా మారింది.
ఎంతదూరంలో వర్కర్లు చిక్కుకుపోయారు? అం దరూ ఒకేచోట ఉన్నారా? అనేది తెలియరాలే.
రక్షించిన వారికి వెంటనే ట్రీట్‌మెంట్ అందించేందుకు మెడికల్ సిబ్బంది డ్రాగన్ లైట్ సెట్లు, ఆక్సిజన్ సిలిండర్లు, స్ట్రెచర్లతో రెడీగా ఉన్నారు.
ఇప్పటిదాకా వరదల్లో చిక్కుకున్న 27 మందిని కాపాడినట్లు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది. తపోవన్ దగ్గర రెండు టన్నెల్స్‌లో 12 మందిని, రిషిగంగ సైట్ దగ్గర 15 మందిని సేఫ్‌గా బయటికి తీసుకొచ్చామని చెప్పింది.
ఈ డిజాస్టర్‌కు కారణమేంటనేది ఇంకా తెలియరాలేదు. క్లైమేట్ చేంజ్ వల్లే జరిగిందని ఎక్స్పర్టులు అంటున్నారు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకు సైంటిస్టుల టీమ్ వెళ్లింది. డీఆర్డీవోలోని స్నో, అవలాంచె స్టడీ ఎస్టాబ్లిష్మెంట్ (ఎస్ఏఎస్ఈ)కు చెందిన సైంటిస్టులు ఆదివారం రాత్రే డెహ్రాడూన్ చేరుకున్నారు. నందాదేవి గ్లేసియర్‌పై సర్వేలెన్స్ కోసం జోషిమఠ్‌కు వెళ్లారు.
ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్లలో సాయం చేసేందుకు తాము రెడీగా ఉన్నామని యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ చెప్పారు.
171 మంది మిస్సింగ్
ఈ ప్రమాదంలో 171 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. 26 డెడ్ బాడీలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. మరో 27 మందిని కాపాడారు. తపోవన్ దగ్గర టన్నెల్‌లో చిక్కుకున్న 35 మందిని కాపాడేందుకు వివిధ దళాలకు చెందిన సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. స్నిఫర్ డాగ్స్, బుల్డోజర్లు, జేసీబీలతో పనులు చేస్తున్నారు. అందరినీ ప్రాణాలతో బయటికి తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్లు, సహాయక చర్యలను ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
చలికాలంలో వరదెట్ల వచ్చింది?
చలికాలం ఇంకా పోనేలేదు. టెంపరేచర్లేమో మైనస్‌లలో రికార్డవుతున్నాయి. ఇట్లాంటి వాతావరణంలో ఉత్తరాఖండ్‌లో వరదెలా వచ్చింది? మంచు కరిగి ఈ విపత్తు ఎలా ముంచుకొచ్చింది? అంటే దీనికంతటికీ వాతావరణ మార్పే కారణమని సైంటిస్టులు చెబుతున్నారు. మామూలుగా చలికాలంలో గ్లేసియర్స్ ప్రాంతమంతా ఫ్రీజ్ అయిపోయి ఉంటుందని, గ్లేసియర్ సరస్సులు కూడా ఒకదానికొకటి గట్టిగా అంటిపెట్టుకొని ఉంటాయని వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ సైంటిస్టు మనీశ్ మెహతా చెప్పారు. అయితే మూడు దశాబ్దాలుగా గ్లోబల్ టెంపరేచర్లు పెరిగి గ్లేసియర్స్ కరిగి పోతున్నాయంటున్నారు. హిమాలయాల్లోని రిషిగంగ ప్రాంతంలో 8 గ్లేసియర్స్‌పై కిందటేడాది పరిశోధన చేశామని చెప్పిన ఆయన.. ఆ పరిశోధన వివరాలు వెల్లడించారు.
8 గ్లేసియర్స్‌పై స్టడీ
రిషిగంగ ప్రాంతంలోని 8 గ్లేసియర్స్‌లో గత మూడు దశాబ్దాల్లో 10 శాతానికి పైగా మంచు తగ్గిపోయిందని మనీశ్ వివరించారు. 1980లో 243 చదరపు కిలోమీటర్లున్న గ్లేసియర్స్ వైశాల్యం.. 2017కు వచ్చేసరికి 217 చదరపు కిలోమీటర్లకు పడిపోయిందని తెలిపారు. ఈ 8 గేస్లియర్స్‌లో ఉత్తరి నందాదేవిలో అతి ఎక్కువగా 17 శాతం మంచు తగ్గిందన్నారు. ప్రపంచంలోని ఇతర గ్లేసియర్స్‌తో పోలిస్తే హిమాలయాల్లోని గ్లేసియర్స్ త్వరగా కరిగిపోతున్నాయని, 1980 నుంచి ఇప్పటివరకు 25 శాతం మంచు టెంపరేచర్లు పెరగడం వల్ల కరిగిందని వివరించారు. దీని వల్ల గ్లేసియర్స్ సమతౌల్యం దెబ్బతిని విపత్తులు సంభవిస్తున్నాయని చెప్పారు. ఇంకొందరు సైంటిస్టులేమో గ్లేసియర్స్ లోలోపల కరిగిపోతున్నాయని చెప్పారు. చాలా ప్రాంతాల్లో ఐస్.. మెల్టింగ్ స్టేజ్‌కు చేరుకుందన్నారు. వాతావరణ మార్పులు ఇలాగే పెరిగితే, టెంపరేచర్లు పెరుగుతూ పోతే మరో 15 ఏండ్లలో మధ్య, తూర్పు హిమాలాయలు కనుమరుగైపోతాయని హెచ్చరిస్తున్నారు.
మృతుల సంఖ్య పెరగొచ్చు
ఆదివారం నందాదేవి గ్లేసియర్‌లో మంచు చరియలు విరిగిపడటంతో గంగానది పోటెత్తింది. ధౌలి గంగా రివర్ వ్యాలీలో ఉప్పొంగింది. ఎన్టీపీసీకి చెందిన తపోవన్-విష్ణుగఢ్ హైడల్ ప్రాజెక్ట్, రిషి గంగా హైడల్ ప్రాజెక్టులను ముంచెత్తింది. దీంతో ఆ రెండు ప్రాజెక్టులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అక్కడ పని చేస్తున్న వాళ్లంతా గల్లంతయ్యారు. స్థానికులు, గొర్లకాపరులు, కట్టెలు ఏరుకునేందుకు వెళ్లిన వాళ్లు కూడా కనిపించడం లేదని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పటిదాకా 18 డెడ్ బాడీలను రివకర్ చేశామని, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ వెల్లడిం చింది. ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది కలిసి సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఒక్క ఫోన్ కాల్.. 12 మందిని బతికించింది
ఉత్తరాఖండ్‌లో టన్నెల్‌లో చిక్కుకున్న వర్కర్లను కాపాడిన ఐటీబీపీ సిబ్బంది
300 మీటర్ల లోతు టన్నెల్. 12 మంది వర్కర్లు బిజీగా పని చేస్తున్నారు. ఇంతలో బయటి నుంచి కొందరు అరవడం స్టార్ట్ చేశారు. ‘బయటకు వచ్చేయండి.. వచ్చేయండి’ అంటున్నారు. ఆ మాటలు వీళ్లకు అర్థమై స్పందించేలోపు ఒక్కసారిగా బురద, నీళ్లు ముంచేశాయి. అంతే.. ఇక టన్నెల్ నుంచి బయటపడటం కష్టమని వర్కర్లు ఫిక్స్ అయిపోయారు. బతుకు మీద ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఒక్క ఫోన్ కాల్.. వాళ్లందరినీ కాపాడింది. ఒక వర్కర్ ఫోన్‌లో సిగ్నల్ రావడంతో ఆయన వెంటనే మేనేజర్‌కు ఫోన్ చేయడం.. ఆ మేనేజర్ ఐటీబీపీ సిబ్బందికి కాల్ చేయడం చకచకా జరిగిపోయింది. వాళ్లు వెంటనే టన్నెల్ దగ్గరకు చేరుకుని అందరినీ కాపాడారు. ఉత్తరాఖండ్‌లో అకస్మాత్తుగా వరద ముంచెత్తడంతో చమోలీలోని తపోవన్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన అండర్ గ్రౌండ్ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులు చెప్పిన ఒళ్లు గగుర్పొడిచే విషయాలివి.
7 గంటలు టన్నెల్‌లోనే..
ప్రాజెక్టు జనరల్ మేనేజర్ వెంటనే పోలీసులకు చెప్పడంతో ఐటీబీపీ సిబ్బంది టన్నెల్ దగ్గరకు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారని అధికారులు చెప్పారు. ఆదివారం పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 7 గంటల పాటు టన్నెల్‌లోనే వర్కర్లు ఉన్నారని వివరించారు. సన్నని సొరంగం తవ్వి అందరినీ కాపాడారన్నారు. ఆ వెంటనే సంఘటన జరిగిన ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐటీబీపీ ఆస్పత్రికి ట్రీట్‌మెంట్ కోసం తరలించారని చెప్పారు. వేరే ప్రాంతాల్లో ఉన్న సొరంగాల్లోనూ కొందరు చిక్కుకున్నారని, వాళ్లను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. వరదల వల్ల రోడ్లు, బ్రిడ్జిలు కూలి రాకపోకలు ఆగిపోయిన 13 గ్రామాల్లోని ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందిస్తున్నారు.
For More News..