
ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావం చేసే అంశాల్లో ద్రవ్యోల్బణం ఒకటి. నిత్యం ధరలు పెరగడమే ద్రవ్యోల్బణం. ఇందుకు రెండు కారణాలుంటాయి. సమిష్టి డిమాండ్ పెరగడం, ప్రభుత్వం లోటు విత్తాన్ని అవలంబించడం నిత్యం ధరల పెరుగుదలకు కారణమవుతాయి. అలాగే, పోటీ రహిత మార్కెట్లో కృత్రిమ కొరతలు సృష్టించడం ద్వారా ఉత్పత్తిదారులు లబ్ధి పొందుతారు. భారతదేశంలో అనుకున్న స్థాయిలో ఉత్పత్తి పెరగకపోవడం, నిత్యావసర వస్తువులు దాచివేయడం, ప్రభుత్వ మద్దతు ధరల విధానం ధరల పెరుగుదలకు కారణమవుతుంది.
ద్రవ్యోల్బణం: నిరంతరం ధరలు పెరగడమే ద్రవ్యోల్బణం. ధరలు పెరిగేటప్పుడు ఉత్పత్తి, ఉద్యోగిత వృద్ధి చెందుతాయి.
డిస్ ఇన్ఫ్లేషన్: ధరలు పెరుగుతున్నప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ధరలు తగ్గితే దానిని డిస్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇందులో ధరలు తగ్గేటప్పుడు ఉత్పత్తి, ఉపాధి స్థాయిలు తగ్గవు. అంటే నిరుద్యోగితపై ఎలాంటి ప్రభావాన్ని చూపకుండా దవ్రోల్బణాన్ని తగ్గించడం.
ప్రతి ద్యవ్యోల్బణం: ఇది ద్రవ్యోల్బణానికి వ్యతిరేకమైన స్థితి. ధరలు తగ్గుతూ ఉండే పరిస్థితి లేదా ద్రవ్యం విలువ పెరుగుతూ ఉండే పరిస్థితిని డిఫ్లేషన్ అంటారు. సమిష్టి డిమాండ్ కొరత వల్ల ఇది ఏర్పడవచ్చు. ఈ కాలంలో నిరుద్యోగిత పెరుగుతుంది. ద్రవ్యం విలువ పెరగడం అంటే వస్తు సేవల ధరలు తగ్గడం. లేదా ధరల స్థాయి తగ్గడం అంటే ద్రవ్యం విలువ పెరుగడమే ప్రతి ద్రవ్యోల్బణం.
రిఫ్లేషన్: ఆర్థిక వ్యవస్థలో ప్రతి ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ధరల స్థాయి పెరిగితే దానిని రిఫ్లేషన్ అంటారు. ఇన్ ఫ్లేషన్ లోనూ రిఫ్లేషన్లోనూ ధరలు పెరుగుతాయి. అయితే, ఇన్ఫ్లేషన్లో ధరలు పెరుగుదల మార్కెట్ శక్తుల వల్ల జరిగితే, రిఫ్లేషన్లో ధరలు పెరుగుదల ప్రభుత్వ చర్యల వల్ల పెరుగుతుంది. డిఫ్లేషన్, డిసిన్ఫ్లేషన్ల్లో ధరలు తగ్గును. ఈ రెండింటికి ప్రధానమైన తేడా డిఫ్లేషన్లో మార్కెట్ శక్తుల వల్ల ధరలు తగ్గుతాయి. నిరుద్యోగిత పెరుగుతుంది. డిసిన్ఫ్లేషన్లో ప్రభుత్వ చర్యల వల్ల ధరలు తగ్గుతాయి. ఉత్పత్తి, ఉద్యోగితపై చెడు ప్రభావం చూపదు. ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్లు రెండూ చెడ్డవే. రెండింటిలో డిఫ్లేషన్ మరీ చెడ్డది. కీన్సు ప్రకారం ద్రవ్యోల్బణం అన్యాయం, ప్రతి ద్రవ్యోల్బణం ఆచరణ యోగ్యం కాదు.
స్టాగ్ఫ్లేషన్: సాధారణంగా ద్రవ్యోల్బణ కాలంలో ఉద్యోగిత రేటు పెరుగుతుంది. అంటే ధరల పెరుగుదలతోపాటు ఆర్థిక వృద్ధి జరుగుతుంది. కానీ విచిత్రంగా ఒకవైపు ధరలు పెరుగుతూ మరోవైపు స్తబ్దత లేదా నిరుద్యోగిత కలిసి ఉంటే దానిని స్టాగ్ఫ్లేషన్ అంటారు. శామ్యూల్సన్ ఈ పదాన్ని ఉపయోగించారు. ఈ కాలంలో ద్రవ్యోల్బణ స్థాయి ఎక్కువ ఉండటమేకాక నిరుద్యోగిత స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో స్తబ్దత లేదా నిరుద్యోగిత అనేది అధిక ద్రవ్యోల్బణ రేటుతో కూడి ఉంటుంది. అధిక ద్రవ్యోల్బణ రేటు అధిక నిరుద్యోగిత రేటు కలిసి ఉండటమే ఈ స్థితి.
సప్లయి వైపు కారణాలు: ఉత్పత్తి వ్యయాలు పెరగడం ద్వారా ధరలపై ప్రభావాన్ని చూపుతుంది. అయితే, పోటీ రహిత మార్కెట్లో కృత్రిమ కొరతలు సృష్టించడం ద్వారా ఉత్పత్తిదారులు లబ్ధి పొందుతారు. భారతదేశంలో అనుకున్న స్థాయిలో ఉత్పత్తి పెరగకపోవడం, నిత్యావసర వస్తువులు దాచివేయడం, ప్రభుత్వ మద్దతు ధరల విధానం ధరల పెరుగుదలకు కారణమవుతుంది.
వ్యవసాయరంగంలో అస్థిర వృద్ధి: ప్రకృతి వైపరీత్యాలు, ఆహార ధాన్యాల కొరత ఏర్పడినప్పుడు వాటి ధరలు పెరుగుదల ఇతర ధరలపై పడుతుంది. ఆహార ధరలు పెరిగినప్పుడు పారిశ్రామిక శ్రామికులు తమ వేతనాలు పెంచమని కోరతారు. దీంతో పారిశ్రామిక వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి.
నిత్యావసర వస్తువుల దాచివేత: పంటల వైఫల్యం పెద్ద రైతులను, హోల్ సేల్ వ్యాపారస్తులను వ్యవసాయ ఉత్పత్తులను దాచివేయడాన్ని ప్రోత్సహిస్తుంది. ఉల్లిపాయలు, నూనెగింజలు, పప్పుధాన్యాలు ఈ మధ్యకాలంలో దాచివేయడంతో ధరలు పెరుగుదలకు ఇది దోహదపడుతుంది.
ప్రభుత్వ వ్యవసాయ ధరల విధానం: మార్కెట్లోకి వచ్చే ఆహార ధాన్యాల మిగులు పెంచేందుకు ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధరలను ప్రకటిస్తుంది. దీని వల్ల రైతుల వ్యయాలు రికవరీ కావడమే కాక, కొంత లాభాలు కూడా మిగులుతున్నాయి. కొంతమంది ఆర్థికవేత్తలు ప్రతి సంవత్సరం ఎంఎస్పీ పెంచడం వల్ల కూడా ధరలు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.
పాలిత ధరలు పెరగడం: ప్రభుత్వ సంస్థల నష్టాలు తగ్గించుకునేందుకు పాలిత ధరలను ప్రభుత్వం పెంచుతుంది. ఇది కూడా కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్కి దోహదపడుతుంది. గత రెండు దశాబ్దాల నుంచి పెట్రోలు, పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గు, ఇనుము, ఉక్కు, విద్యుత్ ఎరువులు తదితర పాలిత ధరలు పెరుగుతున్నవి. ఉత్పత్తి కారకాల సప్లయి కొరత, అధిక వేతన రేట్లు, అంతర్జాతీయ అంశాలు, అధిక పన్నుల రేట్లు కూడా ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమవుతున్నాయి.
ద్రవ్యోల్బణ ప్రభావం
మితమైన ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు మంచిదే. ఏడాదికి 4–5శాతం ధరలు పెరిగితే పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం ఏర్పడి ఆదాయం, ఉపాధి పెరుగుతుంది. అయితే, ప్రణాళికా కాలంలో పెరిగిన ధరలు ఆర్థిక వ్యవస్థకు మంచి కంటే చెడు ఎక్కువ చేస్తాయి.
ఉత్పత్తిపై ద్రవ్యోల్బణ ప్రభావం: స్వల్ప మోతాదులో పెరిగే ద్రవ్యోల్బణం ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితస్థాయి చేరిన తర్వాత ద్రవ్యోల్బణం ఉత్పత్తిపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. ఉదా: అస్థిరత ఏర్పడటం, పొదుపు తగ్గడం, బ్లాక్ మార్కెట్ ఏర్పడటం, వస్తు నాణ్యత తగ్గడం మొదలైనవి.
పంపిణీపై ప్రభావం: ద్రవ్యోల్బణ కాలంలో సంపద పేద, మధ్యతరగతి ప్రజల నుంచి ధనిక వర్గాలకు బదిలీ అవుతుంది. ఫలితంగా ఆదాయ అసమానతలు పెరుగుతాయి. స్థిర ఆదాయం గలవారు, జీతాలు పొందే ఉద్యోగులు, రుణదాతలు, వేతనాలు పొందే శ్రామికవర్గం వారు నష్టపోతారు. రుణగ్రహీతలు. షేర్ మార్కెట్లో వాటాదారులు, వ్యవసాయం చేసే పెద్ద భూస్వాములు లబ్ధి పొందుతారు.
ప్రభుత్వ కార్యకలాపాలపై ద్రవ్యోల్బణ ప్రభావం: ప్రభుత్వ ప్రాజెక్టులపై వ్యయం పెరుగుతుంది. పాలనా వ్యయం పెరుగుతుంది.
విదేశీ చెల్లింపుల శేషంపై ప్రతికూల ప్రభావం: ధరలు పెరగడం వల్ల ఎగుమతుల డిమాండ్ తగ్గుతుంది. మరోవైపు విదేశీ వస్తువులు చౌక కావడంతో దిగుమతులు పెరుగుతాయి. ఫలితంగా విదేశీ చెల్లింపుల శేషంలో లోటు ఏర్పడుతుంది. పైగా దిగుమతులను సరళీకరించడం వల్ల వ్యాపార లోటు మరింత పెరుగుతుంది.
ద్రవ్యోల్బణం కారణాలు: ద్రవ్యోల్బణానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి.
డిమాండ్ పెరుగుదలను ప్రేరేపించే అంశాలు: సమిష్టి డిమాండ్ పెరగడం వల్ల ముఖ్యంగా ప్రభుత్వ వ్యయం పెరగడం, లోటు విత్తాన్ని అవలంబించడం వల్ల ధరలు పెరగడానికి కారణమవుతుంది.
ప్రభుత్వ వ్యయం పెరగడం: ప్రణాళికా కాలంలో ప్రభుత్వ వ్యయం పెరుగుతూ వస్తుంది. 1960–61లో జీడీపీలో ప్రభుత్వ వ్యయ శాతం 15.3శాతం. కాగా 2019–20లో 29.8శాతం. ప్రభుత్వ వ్యయంలో 57శాతం అభివృద్ధేతర కార్యకలాపాలపై జరుగుతోంది. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ధరలు పెరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా సప్లయి పెరగలేదు. వడ్డీ చెల్లింపులు రక్షణ వ్యయం, సబ్సిడీలు పెరుగుట వల్ల బడ్జెట్ లోటు పెరిగి ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది.
లోటు విత్తం: వ్యయానికి సరిపడినంతగా రాబడి సమకూర్చుకోలేనప్పుడు లోటు విత్తం ద్వారా (అప్పులు) నిధులు సమకూర్చుకుంటారు.
జనాభా పెరుగుదల, ఎగుమతులు పెరగడం, ప్రజల వినియోగం పెరుగుదల, ద్రవ్య సప్లయి పెరుగుదల ఇందుకు కారణమవుతున్నాయి.
ఆర్థికాభివృద్ధికి ఆటంకం: ప్రణాళికా కాలంలో నిరంతరం ధరలు పెరగడం వల్ల అది అభివృద్ధికి ఆటంకంగా మారింది. ప్రణాళికా వ్యయం నిర్ణయించబడిన తర్వాత, ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రణాళికా అంచనాలను సవరించరు. ఫలితంగా సకాలంలో ప్రాజెక్టులు పూర్తికావు. ధరలు నిరంతరం పెరగడం వల్ల పొదుపులు నిరుత్సాహపరచబడుతాయి. పశ్చిమ దేశాల్లో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు పొదుపు చేస్తాయి. ద్రవ్యోల్బణ కాలంలో ఈ సంస్థలు లాభాల కోసం ఎక్కువ పెట్టుబడి పెడతాయి. కానీ మనదేశంలో గృహరంగం ఎక్కువగా పొదుపు చేస్తుంది. ద్రవ్యోల్బణం వల్ల పొదుపు వాస్తవ విలువ తగ్గుతుంది. ఫలితంగా పెట్టుబడి రేటు తగ్గుతుంది.
రంగరాజన్ నివేదిక ప్రకారం ఆర్థిక వృద్ధి– ద్రవ్యోల్బణం మధ్య విలోమ సంబంధం ఉందా లేదా అనే సమస్య ఉంది. స్వల్ప కాలంలో అధిక వృద్ధిరేటు అధిక ద్రవ్యోల్బణ రేటు వద్ద సాధించవచ్చు. కానీ దీర్ఘకాలంలో అధిక ధరలు వద్ద అధిక వృద్ధిని సాధించలేం. మరో రకంగా చెప్పాలంటే ధరల స్థిరత్వం ఉన్నప్పుడే వృద్ధి సాధించడానికి మంచి వాతావరణం ఉంటుంది. అప్పుడే సాంఘిక న్యాయం సాధించబడుతుంది.