రాష్ట్రాల ఏర్పాటులో అంబేడ్కర్ ఏం చెప్పాడంటే?

రాష్ట్రాల ఏర్పాటులో అంబేడ్కర్ ఏం చెప్పాడంటే?

రాజ్యాంగ నిర్మాత  అంబేద్కర్​ ఒక భాష ఒక రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఒక రాష్ట్రం ఒక భాష అంటే ఒక భాష వారితో ఎన్ని రాష్ట్రాలైనా ఉండవచ్చు. దీని అర్థం ఒకే భాష మాట్లాడే వారితో పలు రాష్ట్రాలు ఏర్పడవచ్చు. 1953, అక్టోబర్​ 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత భారత దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ అధికమైంది. ఈ డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని కేంద్రం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు 1953, డిసెంబర్​ 22న సయ్యద్​ ఫజల్​ అలీ అధ్యక్షతన రాష్ట్ర పునర్విభజన కమిషన్​ను నియమించింది. 1953, సెప్టెంబర్​ 30న రాష్ట్ర పునర్విభజన కమిషన్ తన నివేదికను కేంద్రానికి సమర్పించి భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయవచ్చని పేర్కొంది. రాష్ట్ర పునర్విభజన కమిషన్​, చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై 1955, డిసెంబర్​లో థాట్స్​ ఆన్​ లింగ్విస్టిక్​​ స్టేట్స్​ అనే పుస్తకంలో అంబేద్కర్​ తన అభిప్రాయాన్ని తెలిపాడు. 

బి.ఆర్​.అంబేద్కర్​ మొదట్లో పెద్ద రాష్ట్రాల ఏర్పాటుకే ఆసక్తి చూపారు. కానీ ఆ తర్వాత కాలంలో దేశంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులను గమనించి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మొగ్గు చూపాడు. థాట్స్​ ఆన్​ లింగ్విస్టిక్​ స్టేట్స్​ పుస్తకంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని వివరించారు. వీటిలో ముఖ్యమైనవి. 

1. సమర్థవంతమైన పాలన ఏర్పడుతుంది.
2. మెజార్టీ వర్గం నుంచి మైనార్టీ వర్గానికి రక్షణ ఉంటుంది. ప్రధానంగా అగ్రకులాల అకృత్యాల నుంచి నిమ్నకులాల వారికి రక్షణ ఉంటుంది.
3. చిన్న రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలకు, వారి భావోద్రేకాలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.
4. భాషా ప్రయుక్త రాష్ట్రాలు మంచిదే కానీ ఇలాంటి రాష్ట్రాల ఏర్పాటు వల్ల ఒక ప్రాంతం వారికి నష్టం వాటిల్లుతుంది అనుకుంటే ఒక భాషకు చెందిన వారితో 2, 3 రాష్ట్రాలు ఏర్పాటు చేయవచ్చు. 

ఒక భాష ఒక రాష్ట్రం

-    ఒక భాష ఒక రాష్ట్రం అంటే ఒక భాష వారితో కేవలం ఒక రాష్ట్రం మాత్రమే ఉండటం. ఒక రాష్ట్రం ఒక భాష అంటే ఒక భాష వారితో ఎన్ని రాష్ట్రాలైనా ఉండవచ్చు. దీని అర్థం ఒకే భాష మాట్లాడే వారితో పలు రాష్ట్రాలు ఏర్పడవచ్చు. అంబేద్కర్​ ఒక రాష్ట్రం ఒక భాష అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు.. 

-    1955, డిసెంబర్​లోనే అంబేద్కర్​ మధ్యప్రదేశ్​ను రెండుగా విభజించాలని, బిహార్​నూ రెండుగా విభజించి, ఉత్తర భాగానికి పాట్నా రాజధాని, దక్షిణ ప్రాంతానికి రాంచీని రాజధానిగా చేయాలని పేర్కొన్నాడు. అంబేద్కర్​ వెలిబుచ్చిన ఈ అభిప్రాయం 2000లో కార్యరూపం దాల్చింది. మధ్యప్రదేశ్​ నుంచి ఛత్తీస్​గఢ్​, బిహార్​ నుంచి జార్ఖండ్​​ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 

-    అంబేద్కర్​ భారత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత దేశ సంస్కృతిపై ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చారు. ఒకే భాష కలిగిన వారితో ఒకే రాష్ట్రం ఏర్పడితే వారి భాషా, సంస్కృతులను కాపాడుకోగలుగుతారని అభిప్రాయపడ్డారు. అదే విధంగా ఒకే భాష మాట్లాడే ప్రజలకు వివిధ రాష్ట్రాలు ఏర్పడటం వల్ల ప్రత్యేక నష్టం అంటూ జరగదు. ఉదాహరణకు హిందీ మాట్లాడే వారితో అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. వీరి గుర్తింపు దేశంలో ప్రత్యేకంగా ఉంది. ఉత్తరప్రదేశ్ లో అత్యధిక జనాభా ఉండటంతో దీనిని మూడు రాష్ట్రాలుగా విభజించాలని పేర్కొన్నారు.

-     బొంబాయి ప్రెసిడెన్సీని కూడా మూడు రాష్ట్రాలుగా విభజించాలని పేర్కొన్నాడు.  అంబేద్కర్​ పేర్కొన్న బొంబాయి ప్రెసిడెన్సీలో పేర్కొన్న మూడు రాష్ట్రాలు 1. మహారాష్ట్ర, 2. గుజరాత్​ 3. మరఠ్వాడ (నిజాం సంస్థానంలో భాగం) అయితే, బొంబాయి పట్టణానికి ప్రత్యేక పట్టణ రాష్ట్ర హోదాను కల్పించాలని పేర్కొన్నారు. 1966లో బొంబాయి నుంచి మహారాష్ట్ర, గుజరాత్​ రాష్ట్రాలు ఆవిర్భవించాయి. 

-    ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుపై అంబేద్కర్​ వ్యాఖ్యానిస్తూ పొట్టి శ్రీరాములు ఆత్మ శాంతి చేకూర్చడం కోసం జవహర్​లాల్​ నెహ్రూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడని పేర్కొన్నాడు. 

-    హైదరాబాద్​ ఉత్తర, దక్షిణ ప్రాంతానికి ఒక వారధిగా ఉంటుందని, రక్షణపరంగా ప్రాముఖ్యత కలిగి ఉన్నదని కాబట్టి హైదరాబాద్​ను దక్షిణ భారతదేశ రాజధానిగా చేయాలని ఉద్ఘాటించారు. చివరకు అంబేద్కర్​ చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై తన అభిప్రాయాన్ని తెలిపారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు అవసరమైనా స్వార్థపూరిత ప్రయోజనాలకు, కొందరి కుటిల రాజకీయాలకు తలొగ్గక ప్రజలకు లబ్ధి చేకూరేలా రాష్ట్రాల ఏర్పాటు జరగాలి. 

జేవీపీ కమిటీ 

1948, డిసెంబర్​లో జైపూర్​లో పట్ఠాభి సీతారామయ్య అధ్యక్షతన జరిగిన ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై జేవీపీ కమిటీని ఏర్పాటు చేశారు. జేవీపీ అంటే జవహర్​ లాల్​ నెహ్రూ, వల్లభాయ్​ పటేల్, పట్టాభి సీతారామయ్య. 1949లో జేవీపీ కమిటీ నివేదికను సమర్పిస్తూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు మరికొన్నాళ్లు వాయిదా వేయాలని సూచించింది. కానీ, ఆంధ్రా విషయానికి వస్తే మద్రాస్ ను వదులుకుంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చని పేర్కొంది. 

ఎస్​కే ధార్​ కమిషన్​ 

1948లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పరిశీలనకు ఎస్​కే ధార్​ కమిషన్​ ఏర్పాటు చేశారు. 1948, సెప్టెంబర్​ 17న హైదరాబాద్​ సంస్థానం భారత యూనియన్​లో విలీనమైంది. దీని తర్వాత ఆంధ్రాలో ఉన్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్​ పార్టీ నాయకులు ఆంధ్రా–తెలంగాణలతో విశాలాంధ్ర ఏర్పడాలని డిమాండ్​ చేస్తూ ఉద్యమాన్ని చేపట్టారు. అయితే, పరిపాలన ఆధారంగానే కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఎస్​కే ధార్​ కమిషన్​ తన నివేదికలో పేర్కొంది. 

ఫజల్​ అలీ కమిషన్​ 

1953, డిసెంబర్​ 22న కేంద్ర ప్రభుత్వం సయ్యద్​ ఫజల్​ అలీ నాయకత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషన్​ను ఏర్పాటు చేసింది. ఇందులో హెచ్​ఎన్​ కుంజ్రు, కేఎం ఫణిక్కర్​ సభ్యులు. రాష్ట్ర పునర్విభజన కమిషన్​ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించి అనేక వర్గాలు, సంస్థలు, వ్యక్తుల అభిప్రాయాలను తెలుసుకుని వారి నుంచి విజ్ఞప్తులను స్వీకరించింది. 1954, జూన్​, జులైలో రాష్ట్ర విభజన కమిషన్​ హైదరాబాద్​లో పర్యటించినప్పుడు కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డిలు ప్రత్యేక తెలంగాణ ఉండాలనే విజ్ఞప్తులు సమర్పించారు.

బూర్గుల రామకృష్ణారావు, రామానంద తీర్థ, మీర్​ మొహమ్మద్​ అలీఖాన్​ తదితరులు విశాలాంధ్రకు మద్దతుగా విజ్ఞప్తులు సమర్పించారు. ఉభయ ప్రాంతాల ప్రజల శ్రేయస్సు దృష్ట్యా తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచడమే మంచిది. దానికి హైదరాబాద్​ రాష్ట్రమని పేరు పెట్టవచ్చు. 1961లో జరగబోయే సాధారణ ఎన్నికల తర్వాత ఒకవేళ హైదరాబాద్​ రాష్ట్ర శాసన సభ్యుల్లో 2/3 వంతు మంది అంగీకరిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రాంతపు విలీనం గురించి ఆలోచించవచ్చు. అది జరగని పక్షంలో ప్రత్యేక రాష్ట్రంగానే కొనసాగాల్సి ఉంటుంది.  అయితే, కేంద్రం ఇందుకు భిన్నంగా  1956, నంబర్ 1న 14 భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది.