వేములవాడను దత్తత తీసుకుంటానన్న కేటీఆర్​ ఇన్నాళ్లు ఏం చేసిండు : బండి సంజయ్

వేములవాడను దత్తత తీసుకుంటానన్న కేటీఆర్​ ఇన్నాళ్లు ఏం చేసిండు : బండి సంజయ్
  • రాజన్న టెంపుల్​కు ప్రధానిని పిలిచి ప్రత్యేక నిధులు తెస్తమని హామీ

వేములవాడ/ఆదిలాబాద్, వెలుగు: పేదల భూములు కబ్జా చేసి,  రాచరిక పాలన కొనసాగించాలనుకునే వాళ్లపైకి బుల్డోజర్ నడిపించే ప్రభుత్వం కావాలని బీజేపీ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్​లీడర్లకు అటు కర్నాటకలో, ఇటు తెలంగాణలో పైసలు ఇచ్చి, పోటీచేయించేదే సీఎం కేసీఆర్​అని, వాళ్లు గెలిస్తే మళ్లీ బీఆర్ఎస్​లోకి పోతారని ఆయన ఆరోపించారు. సోమవారం ఆయన వేములవాడ, ఆదిలాబాద్​లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్​ప్రయత్నాలన్నీ కేటీఆర్​ను సీఎం చేసేందుకే అని, అదే జరిగితే కవిత, హరీశ్​రావు, సంతోశ్​బతుకులు ఆగం అవుతాయన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు గ్యారంటీ లేదని,  బీఆర్ఎస్, కాంగ్రెస్  తమ కుంటుంబాల కోసం పని చేస్తాయని సంజయ్​విమర్శించారు. ‘‘ఎన్నికలొస్తేనే అయ్యాకొడుకులకు మతం గుర్తుకొస్తుంది. రాజన్న ఆలయాన్ని దత్తత తీసుకుంటానంటున్న కేటీఆర్.. ఇన్నాళ్లు ఏం చేసినవ్, వేములవాడకు రూ. 400 కోట్లు ఇస్తానని మోసం చేసిన చరిత్ర కేసీఆర్​ది. నేను అభివృద్ధి గురించి మాట్లాడితే.. కేసీఆర్​బాబ్రీ మసీదు కూల్చివేత గురించి మాట్లాడుతుండు. బీఆర్ఎస్​ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఎంఐఎం లీడర్లకు పదవులు వస్తయి. హిందువులు రోడ్ల మీద పడతారు. హిందూ దేవతలను కించపరిచిన వారికి కేసీఆర్​మద్దతు తెలుపుతుండు’’ అని అన్నారు. పదేండ్లలో వేములవాడకు ఏం చేశారో కేసీఆర్​ చెప్పాలని డిమాండ్​చేశారు. ఎంపీగా ఉంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం  నిధులు తెచ్చానన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరెక్కువ నిధులు ఖర్చు చేశారో చర్చకు సిద్ధమా? అని కేసీఆర్​కు సవాల్​విసిరారు. తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోందని, దానికి  ఉపఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలిపారు.  కేటీఆర్​ఇంటర్వ్యూల ప్రచారాలను నమ్మొద్దని, గతంలో ఇట్లనే ప్రచారం చేస్తే జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటిందని సంజయ్​అన్నారు.

జోగురామన్న చేసిందేమీ లేదు..

ఆదిలాబాద్​లో జోగు రామన్న చేసిందేమీ లేదని, కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ నుంచి పటాన్​చెరు వరకు రైల్వే లైన్ కోసం రూ.5,760 కోట్లు,  రైల్వే అభివృద్ధి కోసం రూ.18 కోట్లు, అమృత్ పథకం కింద రూ.42 కోట్లు, బోరజ్ – చంద్రపూర్ రోడ్డు కోసం రూ.300 కోట్లు, రిమ్స్ కోసం రూ.150 కోట్లు కేటాయించిందన్నారు.  జోగు రామన్న మున్నూరు కాపులకు ఏం చేయలేదని, ఈసారి ఆయనకు ఓటేస్తే  మురికి కాలువలో పడుతుందన్నారు. హైదరాబాద్, ఢిల్లీకి తిరుగుతూ పోరాడితేనే ఆదిలాబాద్ అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు.  ఆదిలాబాద్ లో ఎమ్మెల్యే కొడుకు మున్సిపల్ చైర్మన్ అయ్యారని, కానీ ఇక్కడ నడిచేది వైస్ చైర్మన్ రాజ్యమేనన్నారు. మరోసారి జోగు రామన్న గెలిస్తే అతడిని చైర్మన్ చేసి.. ఎంఐఎంకు వైస్ చైర్మెన్ ఇస్తారని ఆరోపించారు. 12 శాతం ఓట్ల కోసం హిందూ దేవతలను కించపరిచిన వారికి మద్దతు తెలుపుతావా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. కేసీఆర్ ఒంట్లో హిందూ రక్తం ప్రవహిస్తే ఓవైసీ దగ్గరకు వెళ్లి హనుమాన్ మందీర్ లో చాలీసా చదివించే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. వేములవాడ బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికాస్​రావు,  వేములవాడ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బీజేపీ ఆదిలాబాద్​అభ్యర్థి పాయల్ శంకర్ పాల్గొన్నారు.