ఏమనుకుంటున్నవ్​..ఎమ్మెల్యే రైట్ హ్యాండ్​ను : ఎమ్మెల్యే అనుచరుడి వార్నింగ్​

జిల్లాకే టైగర్​ను..​ఎంపీటీసీకి ఎమ్మెల్యే అనుచరుడి వార్నింగ్

పెద్దపల్లి, వెలుగు: ‘అరేయ్​ ఏమనుకుంటున్నవ్​.. ఎమ్మెల్యే రైట్​హ్యాండ్​ను..లారీ కిందేసి తొక్కిస్తా. అక్కడికి వచ్చిన్ననుకో చీర్తా’ అంటూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్​ ఎంపీటీసీ శ్రీనివాస్​ను పూసాల రవి అనే వ్యక్తి ఫోన్​లో బెదిరించాడు. ఎంపీటీసీ శ్రీనివాస్​ కథనం ప్రకారం.. కొంతకాలంగా కొలనూర్​నుంచి ఇటుక బట్టీల కోసం అనుమతులు లేకుండా మట్టిని తరలించుకుపోతున్నారు. ఒకవైపు లారీల వల్ల ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు పోతున్నాయి. రెండు రోజుల క్రితమే సుల్తానాబాద్​లో ఇసుక లారీ ఢీకొని ఓ వృద్ధురాలు చనిపోయింది.

దీంతో రాత్రి పూట లారీలు నడపొద్దని బుధవారం రాత్రి మట్టి తరలిస్తున్న ఓ లారీని కొలనూర్​లో అడ్డుకుని ఆపేశారు. దీంతో పూసాల రవి అనే వ్యక్తి ఎంపీటీసీ శ్రీనివాస్​కు ఫోన్​చేసి బూతులు తిట్టాడు. ‘నేనెవరో తెలుసా..ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి రైట్​హ్యాండ్​ని..జిల్లాకే టైగర్​ను. తలుచుకుంటే అదే లారీ కిందేసి తొక్కిస్తా..’అని వార్నింగ్​ఇచ్చాడు. దీంతో పూసాల రవిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పొత్కపల్లి పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశాడు.