మనీలాండరింగ్ నిరోధక చట్టం ఇటీవలి కాలంలో విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చట్టం 2002లో ఆమోదం పొందింది. మాదకద్రవ్యాలు, చట్టవిరుద్ధమైన పదార్థాలు, ఉగ్రవాదం, అవినీతి, ఇతర వ్యవస్థీకృత నేరాలకు సంబంధించి అనేక విషయాలు ఈ చట్ట పరిధిలోకి వస్తాయి. ఈ నేరాల ద్వారా వచ్చే ఆదాయం పెద్ద మొత్తంలో అంతర్జాతీయంగా తరచూ లాండరింగ్చేయబడుతుంది. ఇది దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వాటిని నిరోధించే విధంగా ఈ చట్టం రూపుదిద్దుకుంది. ఆయా నేరాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్వాధీనం చేసుకోవడం, వాటికి పాల్పడిన వ్యక్తులను శిక్షించడం ఈ చట్టం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చట్టం నిర్దేశించిన లక్ష్యాలను డైరెక్టరేట్ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) అమలు చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖలోని ఆర్థిక దర్యాప్తు సంస్థ. సమన్లు జారీ చేయడం స్టేట్మెంట్లు తీసుకోవడం, సోదాలు చేయడం, విచారణ జరపడం, ఆస్తులను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేయొచ్చు.
దర్యాప్తు అధికారం కలిగి ఉన్నప్పటికీ, దీన్ని పోలీస్ ఏజేన్సీగా పరిగణనలోకి తీసుకోరు. మనీ లాండరింగ్నిరోధక చట్టంలోని సెక్షన్50 ప్రకారం వ్యక్తులకు సమన్స్ ఇచ్చే అధికారం ఈడీ అధికారులకు ఉన్నది. సాక్షులు కావొచ్చు, అనుమానితులు కావొచ్చు, నేరస్తులు కావొచ్చు, డాక్యుమెంట్స్ తీసుకొని రమ్మని, సాక్ష్యం ఇవ్వమని సమన్స్ జారీ చేసే అధికారం ఈడీ ఆఫీసర్లకు ఉన్నది. వాటిని జారీ చేసే అధికారం డైరెక్టర్, అదనపు డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్డైరెక్టర్స్థాయి అధికారులకు ఉంటుంది. ఈ సమన్స్అందుకున్న వ్యక్తి సత్యమే చెప్పాల్సి ఉంటుంది. దోష పూరిత స్వభావం ఉన్న ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. సమాధానాలు చెప్పకపోయినా, తప్పుడు సమాధానాలు చెప్పినా అది అదే చట్టంలోని సెక్షన్63 ప్రకారం నేరమవుతుంది. ఈ నిబంధన రాజ్యాంగం ప్రసాదించిన స్వీయనేరారోపణ వ్యతిరేక హక్కుకు వ్యతిరేకం అన్న వాదన కూడా ఉన్నది.
ఆర్టికల్20(3)కి వ్యతిరేకంగా సెక్షన్50?
మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్50 అనేది రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్20(3) హక్కుకు విఘాతం కలిగించడం లేదా? అన్న ప్రశ్న వస్తుంది. ఈడీ, తమకు సెక్షన్50 ప్రకారం సమన్స్ఇవ్వడాన్ని దాల్మియా సిమెంట్ లిమిటెడ్ వర్సెస్ ఇతరుల కేసులో పిటిషనర్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రశ్నిస్తూ ఇది రాజ్యాంగ వ్యతిరేకమని వాదనలు చేశారు. సమన్స్జారీ చేసినప్పుడు అధికారికంగా ఎట్లాంటి ఆరోపణలు చేయలేదని కోర్టు పేర్కొంది. ఐసీఐఆర్(ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు) నమోదు చేయబడిందని పిటిషనర్లు వాదించారు. పిటిషనర్లు నిందితులు కాదని, వారు కేవలం అనుమానితులని ఈడీ వాదించింది. ఈ సీఐఆర్ అనేది ఎఫ్ఐఆర్తో సమానం కాదని కోర్టు అభిప్రాయపడింది. విజయ్మండల్ చౌదరీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టులో త్రిసభ్య బెంచ్ తీర్పును ప్రకటిస్తూ మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని ముఖ్యమైన నిబంధనలన్నీ రాజ్యాంగబద్ధమేనన్న తీర్పు 2022 జులైలో ప్రకటించింది. అందులో సెక్షన్50 కూడా ఉంది. సెక్షన్50 కింద సమన్లు పంపినప్పుడు, రెండు కారణాల వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్20(3) ఇచ్చిన రక్షణను పొందలేరు. అప్పటికి ప్రాసిక్యూషన్ఫిర్యాదును దాఖలు చేయలేదన్నది మొదటి కారణం. సమన్స్ పంపిన సమయంలో వారు కేవలం అనుమానితులుగా ఉన్నారు. ఇది ఒక రకంగా రాజ్యాంగంలోని ఆర్టికల్20(3) ద్వారా ఇచ్చిన హక్కుకు భంగం కలిగించడమే. సెక్షన్50 ప్రకారం సమన్స్ అందుకున్న వ్యక్తి తనను తాను నేరంలో పేర్కొంటూ స్టేట్మెంట్ఇచ్చే అవకాశం ఉంది. ఆ ప్రకటన ఆధారంగా అతనిపై ప్రాసిక్యూషన్ కేసును దాఖలు చేయవచ్చు. విజయ్ మండల్ చౌదరి కేసు సుప్రీంకోర్టు పున: పరిశీలనలో ఉంది. అప్పటి వరకు ఈ నిబంధన ప్రకారం అందరూ నడవాల్సిందే. ఈ నిబంధన ప్రకారమే ఈడీ అధికారులకు సివిల్కోర్టు అధికారాలు ఉంటాయి. ఈ ప్రొసీడింగ్అన్నీ జ్యుడీషియల్ ప్రొసీడింగ్స్. తప్పుడు సాక్ష్యం ఇచ్చిన వ్యక్తుల మీద కేసులు పెట్టే అవకాశం ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ఈ నేరాలకు వర్తించదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సె.160 లో చెప్పిన విషయాలు ఈ కేసులకి వర్తించవు. మనీ లాండరింగ్ చట్టం ఓ కఠిన చట్టం. కఠినమైన నిబంధనలు. అయితే ఈ చట్టం కింద గత 17 ఏండ్లలో 400 అరెస్టులు జరిగాయి. కానీ శిక్షలు పడింది 25 మందికే.
రాజ్యాంగంలోని ఆర్టికల్20(3)
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్20(3) ప్రకారం ప్రతి వ్యక్తి తనకు తాను వ్యతిరేకంగా నేరారోపణ చేసుకోవడాన్ని నిషేధిస్తుంది. నేరానికి పాల్పడిన వ్యక్తిని అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వమని బలవంతం చేయకూడదు. ఒక వ్యక్తిని అధికారికంగా ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే ఆ నేరంలో ముద్దాయి అని అనుకోవాల్సి ఉంటుంది. ఎంపీ శర్మ వర్సెస్ సతీశ్చంద్ర కేసులో దరఖాస్తుదారులకు ఆర్టికల్20(3)తో రక్షణ లభిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎందుకంటే వాళ్ల పేర్లు ప్రథమ సమాచార నివేదికల్లో ఉన్నాయి. అదే విధంగా నిందితుడు స్టేట్మెంట్ఇచ్చే సమయంలో తప్పనిసరిగా నిందితుడి పాత్రలో ఉండాలని సుప్రీంకోర్టు స్టేట్ఆఫ్ ముంబాయి వర్సెస్ కతికలు ఒఘడు (ఏఐఆర్196 సుప్రీంకోర్టు 1808) కేసులో పేర్కొంది. స్టేట్మెంట్తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి నిందితుడిగా మారితే సరిపోదని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఈ కేసులో చూపిన వ్యత్యాసం చాలా ముఖ్యమైనది. ఈ సాంకేతిక లొసుగును దర్యాప్తు చేసే అధికారులు ఉపయోగించుకునే అవకాశం ఉన్నది. నేర సమాచారం అందినప్పుడు, దర్యాప్తు అధికారి నేరంతో సంబంధం ఉన్న వ్యక్తులను పిలిపించి వారి మీద అధికారిక ఆరోపణలు చేయకుండా వారి స్టేట్మెంట్లను తీసుకోవచ్చు. ఆ విధంగా ఆ వ్యక్తి రాజ్యాంగంలో చెప్పిన ఆర్టికల్ 20(3) రక్షణను పొందకుండా నిరోధించవచ్చు. వారి స్టేట్మెంట్ఆధారంగా వారిని నిందితులని చేసి ఆ తర్వాత ఫిర్యాదుని దాఖలు చేసే అవకాశం ఉంది. దాని వల్ల రాజ్యాంగ రక్షణ అనేది పక్కదారి పట్టే అవకాశం ఉంది. వారు రక్షణను క్లెయిమ్ చేసుకునే పరిస్థితి పోతుంది.
నిందితుడి స్టేట్మెంట్ తీసుకోవచ్చా?
మనీ లాండరింగ్యాక్ట్లోని సెక్షన్50ని గమనించినప్పుడు.. ఈ నిబంధన సాక్షి, నిందితుడికి మధ్య తేడా గుర్తించదు. సాక్షికి, నిందితుడికి సమన్స్ పంపడానికి ఈ సెక్షన్అనుమతి ఇస్తుంది. రమేశ్చంద్ర మెహతా వర్సెస్ స్టేట్ఆఫ్ బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు ‘ఎవరైనా వ్యక్తి’ అన్ని పదబంధంలో ముద్దాయి కూడా అన్న అర్థం ఉంటుందని స్పష్టం చేసింది. అందుకని సెక్షన్50లో చెప్పిన ‘ఏ వ్యక్తి అయినా’ అన్న పదబంధం ప్రకారం సాక్షిని పిలవవచ్చు. ముద్దాయిని కూడా పిలవవచ్చు. ఈ సమన్స్ అందుకున్న వ్యక్తికి తనను ఏ స్థాయిలో పిలిచారో తెలియదు. సెక్షన్50 ప్రకారం నిందితుడి స్టేట్మెంట్ను కూడా ఈడీ అధికారులు నమోదు చేయవచ్చు.
- డా. మంగారి రాజేందర్, జిల్లా జడ్జి(రిటైర్డ్)