పోప్ ఫ్రాన్సిస్ ఖననం ఎక్కడ.. 100 ఏళ్ల తర్వాత మారిన ప్రదేశం : కొత్త పోప్ను ఎలా ఎన్నుకుంటారు..?

పోప్ ఫ్రాన్సిస్ ఖననం ఎక్కడ.. 100 ఏళ్ల తర్వాత మారిన ప్రదేశం : కొత్త పోప్ను ఎలా ఎన్నుకుంటారు..?

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ క్రిస్టియన్లకు స్పిరిచువల్ లీడర్ గా దశాబ్ద కాలం పాటు సేవలు అందించిన పోప్ ఫ్రాన్సిస్ కనుమూయడం ప్రపంచ వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. రోమన్ క్యాథలిక్ చర్చ్ పోప్ గా కొనసాగుతున్న ఫ్రాన్సిస్ తన 88వ ఏటా మృతి చెందారు. ఏప్రిల్ 21, సోమవారం ఆయన చనిపోయినట్లు వాటికన్ సిటీ ప్రకటించింది. అయితే ఆయన మరణానంతరం.. శతాబ్దాలుగా అనుసరిస్తున్న విధానం ద్వారా తదుపరి పోప్ ను ఎన్నుకోనున్నారు. అయితే ఈ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ ఖననం ఎక్కడ చేస్తారు.. అలాగే తదుపరి పోన్ ఎన్నిక విధానం ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. 

పోప్ ఎప్పుడు ఎన్నికయ్యారు.. ఖననం ఎక్కడ..?

పోప్ ఫ్రాన్సిస్ 2013 మార్చిలో ఎన్నికయ్యారు. లాటిన్ అమెరికా నుంచి ఎన్నికైన తొలి పోప్ ఫ్రాన్సిస్ కావడం విశేషం. 12 ఏళ్లు పోప్ గా ఉన్న ఫ్రావిన్స్.. క్యాథలిక్ సమాజంలో, చర్చ్ లలో సంస్కరణలు తీసుకొచ్చారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా చర్చ్ లు ఉండాలని ఆయన సూచించారు. మానవత్వం, సామాజిక న్యాయం తో పాటు చర్చిలలో భారీ సంస్కరణలు తీసుకొచ్చారు. మోడ్రన్ చర్చ్ టీచింగ్స్ లో మానవత్వం, దయతో కూడిన బోధనలు ఉండాలని ఆయన చేసిన కృషికి ఆయనను ‘ప్రజల పోప్’ అని పిలుచుకున్నారు. 

సాధారణంగా పోప్ అంతిమ సంస్కారాలు సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. కానీ తాను బతికున్నప్పుడే తన అంత్యక్రియలు ఎలా జరపాలో పోప్ ఫ్రాన్సిస్ ఎన్నుకున్నారట. గతంలో మూడు అంచెలున్న శవపేటికలలో పోప్ ను ఖననం చేసే ఆచారం ఉండేది. కానీ అందుకు భిన్నంగా సింపుల్‌గా ఉండే.. చెక్క శవపేటికలో తన పార్థివదేహాన్ని ఉంచాలని ఆయన కోరారట.

ఈ క్రమంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచేందుకు జింక్ ఖనిజ పట్టీతో తయారు చేసిన శవపేటికను సిద్ధం చేయనున్నారు. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చిలో ఎత్తుగా ఉండే కాటాఫల్క్ ప్రదేశంలో ప్రజల సందర్శనార్థం పోప్ ఫ్రాన్సిస్ పార్థివదేహాన్ని ఉంచుతారు. రోమ్‌లోని సెయింట్ మేరీ మేజ‌ర్ బాసిలికా చ‌ర్చిలో పోప్ ఫ్రాన్సిస్‌ను ఖ‌న‌నం చేయనున్నారు. వాటికన్ సిటీ కాకుండా మ‌రో ప్రదేశంలో రోమ‌న్ క్యాథ‌లిక్ చ‌ర్చి మత పెద్దను ఖననం చేయడం ఈ వందేళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. 

కొత్త పోప్ ను ఎలా ఎన్నుకుంటారు..?

పోప్ అస్తమయంతో తదుపరి పోప్ ను ఎన్నుకోనున్నారు. సీనియర్  మోస్ట్ క్లరిక్స్ లో నుంచి ఒకరిని కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ సభ్యులు తదుపరి పోప్ ను ఎన్నుకుంటారు. 80 ఏండ్ల వయసు లోపల ఉన్న 252 మంది సభ్యులు, 138 కార్డినల్స్ కొత్త పోప్ ఎన్నికకు సంబంధించి ఓటు వేసే అధికారం కలిగిఉంటారు. పూర్తిగా రహస్యంగా సిస్టీన్ చాపెల్ లో ఓటింగ్ జరుగుతుంది. సిస్టీన్ చాపెల్ అనేది వాటికన్ సిటీలోని పోప్ అధికారిక నివాసమైన అపోస్టోలిక్ ప్యాలెస్‌లోని ప్రార్థనా మందిరం. అయితే ఈ ప్రక్రియ కొన్ని రోజుల నుంచి వారాలు పట్టవచ్చు. కొత్త పోప్ ను ఎన్నుకునే వరకు చర్చ్ బాధ్యతలు కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ నిర్వహిస్తారు.

ప్రతి ఓటింగ్ సెషన్ బ్యాలట్స్ ను తగలబెట్టడం ద్వారా ముగుస్తుంది. చిమ్నీ నుంచి వచ్చే పొగ రంగును బట్టీ ఓటింగ్ ప్రోగ్రెస్ లో ఉందనే సంకేతం ఇస్తుంది. నల్లటి పొగ వస్తే ఫలితాలు పూర్తి కాలేదని, తెల్లటి పొగ వస్తే ఎన్నిక సక్సెస్ అయినట్లు గుర్తు. 

తదుపరి పోప్ ఎవరు కావచ్చు?

బాప్టిజం తీసుకున్న రోమన్ కాథలిక్ క్రిస్టియన్ ఎవరైనా పోప్ అయ్యేందుకు అర్హుడు. అయితే చరిత్ర ఆధారంగా చూస్తే ఎక్కువ పోప్ లు ఇటాలియన్లే. ఇప్పటి వరకు పనిచేసిన 266 పోప్ లలో 217 మంది ఇటాలియన్లే. అయితే అర్జెంటీనా నుంచి ఎన్నికైన పోప్ ఫ్రాన్సిస్ మాత్రం ఆ సంప్రదాయానికి తెరదించారు. అయితే తదుపరి పోప్ మరోసారి యూరప్ నుంచే ఉంటారని  తెలుస్తోంది. అదికూడా ఇటలీ నుంచే ఉండవచ్చునని భావిస్తున్నారు.