సీసీఐ జరిమానా పై స్పందించిన గూగుల్‌

సీసీఐ జరిమానా పై స్పందించిన గూగుల్‌

గూగుల్‌పై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్ ఇండియా(సీసీఐ) రూ.936.44 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో గూగుల్‌ స్పందించింది. వినియోగదారులు, డెవలపర్లకు మెరుగైన సేవలు అందించడానికి తాము  కట్టుబడి ఉన్నామని తెలిపింది. సీసీఐ తీసుకున్న నిర్ణయంపై ఎలా ముందుకు వెళ్లాలని  సమీక్షించుకుంటున్నామని తెలిపింది. "ఆండ్రాయిడ్‌, గూగుల్ ప్లే అందించే సాంకేతికత, భద్రత, వినియోగదారు రక్షణలు, అసమానమైన ఎంపికలు, సౌలభ్యం నుంచి భారతీయ డెవలపర్లు ప్రయోజనం పొందారు. ఖర్చులను తక్కువగా ఉంచడం ద్వారా, మా మోడల్ భారతదేశ డిజిటల్ పరివర్తనకు శక్తినిచ్చింది. కోట్ల మందికి డిజిటల్‌ మాధ్యమాలను విస్తరించింది" అని వెల్లడించింది. 

జరిమానా విధించడం వారంలో రెండోసారి

గూగుల్ పై సీసీఐ జరిమానా విధించడం వారంలో ఇది రెండోసారి.  అక్టోబరు 20న గూగుల్ పై  రూ.1,337.76 కోట్ల  ఫైన్ విధించగా.. తాజాగా రూ.936.44 కోట్ల జరిమానా వేసింది. మార్కెట్లో తనకున్న ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసి.. ప్లే స్టోర్ పాలసీలకు విరుద్ధంగా గూగుల్ వ్యవహరించినందుకు ఈ జరిమానా విధించామని సీసీఐ వెల్లడించింది. ఇలాంటి అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అనుసరించొద్దని   ఆదేశించింది.  గూగుల్ ప్లే స్టోర్  లో పోటీ వ్యతిరేక పద్ధతుల (యాంటీ కాంపిటీటివ్ ప్రాక్టీసెస్ )కు తావు లేకుండా చేసేందుకు అనుసరించాల్సిన 8 దిద్దుబాటు చర్యలతో కూడిన సీజ్ అండ్ డెసిస్ట్ ఆర్డర్ ను సీసీఐ జారీ చేసింది. 

జీపీబీఎస్.. యాప్ డెవలపర్స్

మొబైల్ యాప్స్ డెవలప్ చేసే వారు బిల్లింగ్ కోసం తప్పకుండా గూగుల్ ప్లే బిల్లింగ్ సిస్టమ్ (జీపీబీఎస్) నే వాడాలనే నిబంధన అమల్లో ఉంది. యాప్స్ నిర్వాహకులు పేమెంట్స్ పొందడానికి, ఇన్ యాప్ కొనుగోళ్ల కోసం కూడా జీపీబీఎస్ నే వాడాల్సి వస్తోంది. జీపీబీఎస్ వినియోగించని యాప్ డెవలపర్స్ .. వారి ప్రోడక్ట్స్ ను గూగుల్ ప్లే స్టోర్ లో లిస్ట్ చేసుకునే పరిస్థితి లేదు. ఈవిధంగా ఏకపక్షంగా గూగుల్ ప్లే స్టోర్ నిబంధనలు ఉన్నాయని సీసీఐ ఇవాళ విడుదలచేసిన ప్రెస్ రిలీజ్ లో ప్రస్తావించింది. యాప్ డెవలపర్స్ ఏదైనా థర్డ్ పార్టీ బిల్లింగ్ ప్రాసెసింగ్ సర్వీసును వాడుకోకుండా నిలువరించరాదని గూగుల్ కు సీసీఐ నిర్దేశించింది. 

అక్టోబరు 20  జరిమానా ఎందుకంటే ?

ఇక  అక్టోబరు 20న  గూగుల్ పై సీసీఐ రూ.1,337.76 కోట్ల  జరిమానా విధించింది.  ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఎకో సిస్టమ్ లో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తున్నందుకు ఈ ఫైన్ వేశామని సీసీఐ పేర్కొంది. స్మార్ట్ ఫోన్ పనిచేయాలంటే ఒక ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ (ఓఎస్) కావాలి.  ఆండ్రాయిడ్ అనేది ఒక ఓఎస్. దీన్ని గూగుల్ 2005లో కొనుగోలు చేసింది. ప్రస్తుతం మొబైల్ కంపెనీలన్నీ దాదాపు ఆండ్రాయిడ్ ఓఎస్ నే వాడుతున్నాయి. ఆండ్రాయిడ్ ఓఎస్ తో పాటు ప్లే స్టోర్, గూగుల్ సెర్చ్, గూగుల్ క్రోమ్, యూట్యూబ్ తదితర అప్లికేషన్ల ద్వారా పోటీ వ్యతిరేక పద్ధతులను గూగుల్ అవలంభిస్తోందని  సీసీఐ తెలిపింది. గూగుల్ తమ వినియోగదారులను పెంచుకోవాలనే తాపత్రయంలో ఇలా చేస్తోందని పేర్కొంది. నిర్ణీత గడువులోగా పోటీ వ్యతిరేక పద్ధతులను మానుకోవాలని గూగుల్ కు అక్టోబరు 20న హితవు పలికింది.