IND vs ENG: ఇండియా తొండాట ఆడి గెలిచిందా..! ఏంటి ఈ వివాదం..?

IND vs ENG: ఇండియా తొండాట ఆడి గెలిచిందా..! ఏంటి ఈ వివాదం..?

నాలుగో టీ20లో టీమిండియా విజయం వివాదాలకు దారితీస్తోంది. తుది జట్టులో చోటుదక్కని ఓ భారత పేసర్.. టీమిండియా బ్యాటింగ్ ముగిశాక కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వికెట్లు తీయడమే అందుకు ప్రధాన కారణం. మ్యాచ్ ముగిసిన అనంతరం ఓటమిపై స్పందించిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్.. భారత జట్టు వ్యూహాన్ని తప్పు బట్టాడు. ఇలా గెలవడం.. ఓ గెలుపేనా అన్నట్లు మాట్లాడాడు.

అసలేం జరిగినందంటే..?

భారత బ్యాటింగ్ ముగిశాక కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా యువ పేసర్ హర్షిత్ రాణా జట్టులోకి వచ్చాడు. శివమ్ దూబేకి కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చిన అతన్ని..  కెప్టెన్ సూర్య బాగా ఉపయోగించుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో తన కోటా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన రాణా.. 3 కీలక వికెట్లు పడగొట్టి.. జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. లివింగ్‌స్టోన్(9), జాకబ్ బెథెల్(6), జామీ ఓవర్టన్(19).. ముగ్గరిని పెవిలియన్ చేర్చాడు. ఇదే వివాదానికి అసలు కారణం. ఆఖరి బంతి వరకూ బ్యాటింగ్‌ చేసిన దూబెకు సడెన్‌గా ఎందుకు కంకషన్‌ అవసరమయ్యాడు? అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. 

బట్లర్ మాటల్లో వాస్తవమెంత..?

బట్లర్ మాటలు వాస్తవమేనా..! అన్నది పక్కనపెడితే, శివమ్ దూబే ఆఖరి బంతి వరకూ బ్యాటింగ్‌ చేశారనేది నిజం. అతడికి కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ అవసరమైంది కూడా చివరి ఓవర్‌లోనే. భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో.. జేమీ ఓవర్టన్ వేసిన ఐదో బంతి.. దూబే హెల్మెట్‌ను బలంగా తాకింది. ఆ బంతికి అతడు తప్పుకున్నా అయిపోయేది. బంతేగా మిగిలివుంది అన్నట్లుగా.. తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు. ఇదే వివాదానికి అసలు కారణం. ఆ సమయంలో కంకషన్ అవసరం రానిది.. భారత బ్యాటింగ్ ముగిశాక ఎందుకొచ్చిందన్నదే ఇంగ్లండ్ వాదన. పోనీ కంకషన్ తీసుకున్నా.. ఒక బ్యాటర్ స్థానంలో బౌలర్‌ని ఎలా అనుమతించారని ప్రశ్నిస్తున్నారు.

ఇన్నింగ్స్ ముగిశాక ఎందుకు తీసుకోవలసి వచ్చిందంటే..

శివమ్‌ దూబె బ్యాటింగ్‌ సమయంలో హెల్మెట్‌కు బంతి తాకింది.. 20వ ఓవర్ ఐదో బంతి.. ఆ సమయంలో అతనిలో ఎటువంటి లక్షణాలు కనిపించలేదట. ఓ పది నిముషాలు గడిచాక.. అనగా ఇన్నింగ్స్‌ బ్రేక్ సమయంలో కాస్త తలనొప్పి లక్షణాలు మొదలైనట్లు కోచ్ దృష్టికి తీసుకొచ్చాడు. దాంతో, అతడికి బదులు మరొకరి పేరును మ్యాచ్‌ రిఫరీకి తెలియజేసి.. రిఫరీ అనుమతి తీసుకున్నారు.

ALSO READ | రంజీ ట్రోఫీలో కోహ్లీ రోజుకు ఎంత సంపాదిస్తాడు..?

ఇక మ్యాచ్ విషయానికొస్తే, నాలుగో టీ20లో టీమిండియా 15 పరుగుల తేడావిజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్ చేజిక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సూర్య సేన 181 పరుగులు చేయగా.. ఛేదనలో ఇంగ్లీష్ జట్టు 166 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఈ ఇరు జట్ల మధ్య ఆదివారం(ఫిబ్రవరి 2) ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఆఖరి టీ20 జరగనుంది.