Bangladesh: 30 రోజుల్లోనే బంగ్లాదేశ్ మటాష్.. ఎందుకిలా.. కారణం ఏంటి.. ఏం జరగబోతుంది..?

Bangladesh: 30 రోజుల్లోనే బంగ్లాదేశ్ మటాష్.. ఎందుకిలా.. కారణం ఏంటి.. ఏం జరగబోతుంది..?

బంగ్లాదేశ్. 2022 జనాభా లెక్కల ప్రకారం.. బంగ్లాదేశ్ జనాభా 17.12 కోట్లు. 1971 మార్చిలో పాకిస్తాన్ నుంచి విముక్తి పొంది స్వతంత్ర్య దేశంగా ఏర్పడింది. తొమ్మిది నెలల పాటు సాగిన ఈ సంఘర్షణలో 30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. పోరాడి స్వాతంత్ర్ర్యాన్ని సొంతం చేసుకున్న బంగ్లాదేశ్ విద్యార్థుల ఆందోళనలతో మరోసారి రక్తసిక్తంగా మారింది. నిరసనల్లో 300 మంది ప్రాణాలు కోల్పోయిన దయనీయ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఉంది. కేవలం నెల రోజుల్లో బంగ్లాదేశ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిప్పు రవ్వగా మొదలైన విద్యార్థుల నిరసనలు అగ్ని గుండంగా మారి దేశాన్ని దహించేస్తున్నాయి. దేశ ప్రధాని ప్రాణ భయంతో దేశం విడిచి వెళ్లిన భయానక పరిస్థితులు బంగ్లాదేశ్లో నెలకొన్నాయి. సరిగ్గా నెల రోజుల క్రితం బంగ్లాదేశ్ ఎలా ఉంది..? ఇప్పుడెలా ఉంది..? 

జులై 1: బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల వారసుల కోటా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు నిరసనలు మొదలుపెట్టారు. యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లను, రైల్వే లైన్లను ముట్టడించారు. రిజర్వేషన్ల కోటా విధానంలో సంస్కరణలు తీసుకురావాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ నిరసనలపై దేశ ప్రధాని షేక్ హసీనా చేసిన కామెంట్ విద్యార్థులు మరింత రెచ్చిపోయేందుకు కారణమైంది. విద్యార్థులు వారి సమయాన్ని వృధా చేసుకుంటున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు విద్యార్థుల్లో ఉద్యమ కాంక్షను మరింత రగిల్చాయి.

జులై 18: విద్యార్థుల నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. హింసాత్మకంగా మారడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్లలో జరిగిన ప్రతి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని షేక్ హసీనా ప్రకటన చేశారు. ప్రధాని ప్రకటనతో విద్యార్థులు మరింత రెచ్చిపోయారు. బంగ్లాదేశ్ టెలివిజన్ హెడ్ క్వార్టర్స్ను, ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. దీంతో.. ప్రభుత్వం ఇంటర్నెట్ను నిలిపివేసింది. అల్లర్లు మరింత హింసాత్మకంగా మారి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఈ పరిణామాల కారణంగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించి సైన్యాన్ని మోహరించింది.

జులై 21: ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల వారసుల కోటాను ఐదు శాతానికి తగ్గించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. 93 శాతం నియామకాలు మెరిట్ ఆధారంగానే చేపట్టాలని తేల్చి చెప్పింది. మిగిలిన రెండు శాతంలో ఒక శాతం గిరిజనులకు, మరొక శాతం ట్రాన్స్ జెండర్లు, దివ్యాంగులకు కేటాయించాలని స్పష్టం చేసింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను పునరుద్ధరిస్తూ బంగ్లాదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. అయినప్పటికీ విద్యార్థుల ఆగ్రహం చల్లారలేదు. స్వాతంత్ర్య సమరయోధుల వారసుల కోటాను పూర్తిగా రద్దు చేయాలన్నది విద్యార్థుల నుంచి వ్యక్తమవుతున్న డిమాండ్.

ఆగస్ట్ 4: రిజర్వేషన్ల అంశంపై ఆగస్ట్ 7న సుప్రీం కోర్టు విచారణ ఉండటంతో వందల సంఖ్యలో నిరసనకారులు ఆగస్ట్ 4న రోడ్లెక్కారు. ప్రభుత్వ మద్దతుదారులకు, విద్యార్థులకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆదివారం నాడు జరిగిన  హింసాత్మక ఘటనల్లో 14 మంది అధికారులతో పాటు మొత్తం 68 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.

నిరసనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ 300 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. నిరసనకారులు దుకాణాలకు నిప్పు పెట్టారు. బస్సులను తగలబెట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ‘అంతిమ పోరాటం’ పేరుతో విద్యార్థులకు నిరసనకారులు పిలుపునివ్వడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. సోమవారం నాడు వేల సంఖ్యలో విద్యార్థులు ఢాకా వీధుల్లోకి చేరుకుని నిరసనలకు దిగారు. ప్రధాన మంత్రి షేక్ హసీనా అధికారిక నివాసంలోకి కూడా ప్రవేశించారు. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవడంతో చేసేదేమీ లేక ఎలాంటి సందేశం ఇవ్వకుండానే ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం సైనిక పాలన నడుస్తోంది.

బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల అంశంపై ఆగస్ట్ 7న బంగ్లాదేశ్ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణ అనంతరం పరిస్థితులు సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉండనుందోననే చర్చ అక్కడి ప్రజల్లో మొదలైంది. విద్యార్థుల డిమాండ్లకు తలొగ్గి స్వాతంత్ర్య సమరయోధుల వారసుల కోటాను సుప్రీం కోర్టు ఒకవేళ పూర్తిగా రద్దు చేస్తే అమరుల కుటుంబాలు రోడ్డెక్కే పరిస్థితులు కచ్చితంగా ఉన్నాయి. అదేగానీ జరిగితే బంగ్లాదేశ్ పరిస్థితి పెనం మీద నుంచి పొయిలో పడ్డట్టు తయారవడం ఖాయం. ఇప్పటికే గత నెల రోజుల నుంచి నెలకొన్న పరిణామాల వల్ల బంగ్లాదేశ్కు భారీగా నష్టం జరిగింది. ప్రధాని దేశం విడిచి వెళ్లిపోవడంతో ఆ దేశం పరువు పోయింది. ఈ పరిస్థితుల్లో అల్లర్లు మరింత పెరిగితే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుంది.