- రైతుబంధు ఇస్తున్నాం కదా అంటూ ఎమ్మెల్యే దాటవేత
- అప్పుల వడ్డీలకు కూడా రైతుబంధు సరిపోతలేదని రైతుల ఆగ్రహం
నేలకొండపల్లి, వెలుగు: పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి రైతుల నుంచి చుక్కెదురైంది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల్లో రైతు వేదికలలో రైతులతో అధికారులు రైతు దినోత్సవ సభలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు స్ఠానిక ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కూసుమంచి మండలంలో రైతులతో మాట్లాడిన అనంతరం నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లి రైతు వేదికలో పాల్గొన్న ఆయనకు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతుండగా.. పంట రుణ మాఫీ ఎందుకు చేయలేదంటూ రైతులు నిలదీశాయి. దీంతో ఎమ్మెల్యే.. ‘‘రైతుబంధు ఇస్తున్నాం కదా” అని దాటవేసేందుకు ప్రయత్నించడంతో రైతులు మరిన్ని ప్రశ్నలు సంధించారు.
‘‘మీరు ఇచ్చే రైతుబంధు రుణాల వడ్డీకి సరిపోవడంలేదు. ముందుగా ఇరవై ఐదు వేలు, తర్వాత యాభై వేలు, ఆ తర్వాత లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాం అని ప్రకటన చేసి నాలుగేండ్లయినా ఇప్పటికీ చేయలేదు. టైంకు వడ్లు కొనడంలేదు. రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటే రైతు దినోత్సవం పేరిట సంబురాలు ఏంది?” అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి సభా ప్రాంగణం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు సభలో ఎమ్మెల్యే పాల్గొనాల్సి ఉండగా.. అక్కడ అంతకు ముందే రైతులకు, అధికారులకు మధ్య మక్కల కొనుగోళ్ల విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ పరిణామాలతో ఎమ్మెల్యే పొన్నెకల్లులో జరిగే కార్యక్రమానికి హాజరుకాలేదు. కాగా, రైతులకు రుణమాఫీ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి రైతులు విన్నవిస్తున్నట్లు ముద్రించిన పోస్ట్ కార్డు స్థానిక సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ అయింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మం డలం వెంకటాపూర్, ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామాల్లో రైతులు నిరసన తెలి పారు. వెంకటా పూర్లో వేదిక మీదున్న జడ్పీటీసీ లక్ష్మణ్ రావు, ఎంపీటీసీ తిరుపతిని రుణమాఫీపై మేడిశెట్టి బాలయ్య తదితర రైతులు ప్రశ్నించారు. ప్రభుత్వం రుణమాఫీ చేయ లేదని, చెడగొట్టు వానలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేలు ఇస్తాన ని ఇప్పటికీ ఇవ్వలేదని నిలదీశారు. వేడుకలను బహిష్కరిస్తున్నామని అక్కడి నుంచి రైతులు వెళ్లిపోయారు.