కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్ట్ ఏమాయె..!

కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్ట్ ఏమాయె..!
  • జనవరిలో ఫీల్డ్ ఎంక్వైరీ చేసి రికార్డులు సీజ్ చేసిన ఆఫీసర్లు  
  • డీజీపీ రాజీవ్ రతన్ మరణం తర్వాత ముందుకు కదలని ఎంక్వైరీ  
  • ఎనిమిది నెలలైనా బయటికి రాని రిపోర్ట్‌‌ 
  • ఇరిగేషన్ ​ఆఫీసర్లలో చర్చ

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు చేపట్టిన విజిలెన్స్‌‌ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ ఎంక్వైరీ రిపోర్ట్‌‌ ఇంకా బయటికి రావట్లేదు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత రేవంత్‌‌ సర్కారు ఆదేశాలతో విజిలెన్స్‌‌ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ ఆఫీసర్లు రంగంలోకి దిగారు. ఎనిమిది నెలల కింద ఏకకాలంలో 12 చోట్ల ఫీల్డ్‌‌ ఎంక్వైరీ చేసి రికార్డులు సీజ్‌‌ చేశారు.

డీజీపీ రాజీవ్‌‌ రతన్‌‌ అకాల మరణం తర్వాత ఆ ఎంక్వైరీ ముందుకు కదలట్లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లింక్‌‌‒1లో చేపట్టిన పనుల్లో ఎక్కడ ఎంత మేరకు అవినీతి జరిగింది? ఎవరి వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది. బాధ్యులెవరు? వంటి విషయాలు ఇంకా బయటికి రాలేదు. విజిలెన్స్‌‌ ఎన్‌‌ఫోర్స్‌‌ మెంట్‌‌ చేపట్టిన ఎంక్వైరీ రిపోర్ట్‌‌ బయటికి రాకపోవడంతో ఇప్పటికీ సస్పెన్స్‌ కొనసాగుతోంది. 

జనవరిలో విజిలెన్స్‌‌ దాడులు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌లో జరిగిన అక్రమాలను నిగ్గుతేల్చేందుకు విజిలెన్స్‌‌ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ ఆఫీసర్లు  జనవరి 9న రంగంలోకి దిగారు. ఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా12 టీమ్‌‌లు ఇరిగేషన్‌‌ ఆఫీసుల్లో తనిఖీలు చేశాయి. హైదరాబాద్‌‌లోని జలసౌధతో పాటు పది చోట్ల దాడులు చేసి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాయి. లింక్‌‌‒1లో భాగంగా చేపట్టిన మేడిగడ్డ(లక్ష్మి), అన్నారం(సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీలతో పాటు మూడు పంప్‌‌హౌస్​ల నిర్మాణాలకు సంబంధించిన వివరాలను ఇరిగేషన్‌‌ ఇంజినీర్ల నుంచి సేకరించారు.

వీటికి సంబంధించిన టెండర్‌‌ డాక్యుమెంట్లు, ప్రాజెక్ట్‌‌ డిజైన్స్‌‌, డ్రాయింగ్స్‌‌, క్వాలిటీ కంట్రోల్‌‌, ఎస్కలేషన్‌‌ రిపోర్టులను స్వాధీనం  చేసుకున్నారు.  జలసౌధలోని ఈఎన్‌‌సీ జనరల్‌ మురళీధర్‌‌ రావు‌, ఓఅండ్‌ఎం ఈఎన్సీ నాగేందర్‌‌ రావు చాంబర్‌‌లో, సెంట్రల్‌‌ డిజైన్స్‌‌ ఆర్గనైజేషన్‌‌(సీడీవో) సీఈ ఆఫీస్‌‌, రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆఫీస్‌‌, వరంగల్‌‌, కరీంనగర్‌‌, రామగుండం, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలోని ఇరిగేషన్‌‌ ఆఫీసుల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు.

రికార్డుల స్వాధీనం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లింక్‌‌‒1లో  పనులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలకు సంబంధించిన అన్ని రికార్డులను విజిలెన్స్‌‌ అండ్‌‌ ఎన్‌‌ఫోర్స్‌‌ మెంట్‌‌ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎంక్వైరీ అంతా  చాలా గోప్యంగా జరిగింది.  చిన్న విషయం కూడా బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అతి కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. లింక్‌‌‒1లో పనిచేసిన ఇంజినీర్లలో ఏఈలు, డీఈఈలు, ఈఈలు, ఎస్‌‌ఈలకు సంబంధించిన ఫైల్స్‌‌, రికార్డులన్నీ వేర్వేరుగా కట్టలు కట్టారు.

ప్రాజెక్టు ప్లాన్స్‌‌, డిజైన్స్‌‌తో పాటు మెజర్​మెంట్ బుక్స్‌‌(ఎంబీలు) ఫీల్డ్‌‌ లెవెల్‌‌ ఇన్‌‌స్పెక్షన్‌‌ బుక్స్‌‌,  క్రాస్‌‌ సెక్షన్స్‌‌, ఎల్‌‌ఎస్‌‌ బుక్స్‌‌, డిజైన్‌‌ డ్రాయింగ్స్‌‌, హైడ్రాలిక్‌‌ పర్టిక్యులర్స్‌‌, డిజైన్‌‌ డిశ్చార్జి పేపర్స్‌‌, మోడ్‌‌ ఆఫ్‌‌ పేమేంట్‌, కాంట్రాక్ట్‌‌, సబ్‌‌కాంట్రాక్ట్‌‌ సంస్థలకు చెల్లించిన బిల్స్‌, ఎర్త్‌‌, సిమెంట్‌‌ వర్క్‌‌‌, భూసేకరణ, ప్రపోజల్స్‌‌ స్వాధీనం చేసుకున్నారు. రివైజ్డ్‌‌‌ ఎస్టిమేట్స్‌‌కు సంబంధించిన వివరాలు సేకరించారు. వీటన్నింటినీ హైదరాబాద్‌లోని‌ విజిలెన్స్‌‌ ఎన్‌‌ఫోర్స్‌‌ మెంట్‌‌ హెడ్‌‌ ఆఫీస్‌‌కు తరలించారు.

ఏసీబీ డీజీ సీవీ ఆనంద్​కు అదనపు బాధ్యతలు  

విజిలెన్స్‌‌ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డీజీ రాజీవ్‌‌ రతన్‌‌ జనవరి 17న భూపాలపల్లి జిల్లాలోని కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. 2022లో నీట మునిగిన కన్నెపల్లి, అన్నారం పంప్‌‌హౌస్​లను కూడా పరిశీలించి, అక్కడ పనిచేసిన ఇంజినీర్లతో మాట్లాడి వివరాలు సేకరించారు. తర్వాత ఆయన గుండెపోటుతో చనిపోయారు. ఆయన స్థానంలో మొదట ప్రస్తుత డీజీపీ జితేందర్​కు, తర్వాత  ఏసీబీ డీజీ సీవీ ఆనంద్​కు విజిలెన్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.  కానీ, ఇప్పటివరకు కాళేశ్వరంపై విజిలెన్స్‌‌ రిపోర్ట్‌‌ బయటకు రాకపోవడంపై ఇంజినీరింగ్‌‌ సర్కిల్స్‌‌లో చర్చ జరుగుతోంది.