1947లో భారత్ - పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు జమ్మూకశ్మీర్ సంస్థానాన్ని స్వతంత్రంగా ఉంచాలని మహారాజా హరిసింగ్ భావించాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కొన్ని షరతులతో 1947, అక్టోబర్ 26న జమ్మూకశ్మీర్ సంస్థానాన్ని అధికారికంగా డొమినియన్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసేందుకు ఒప్పందంపై సంతకం చేశారు. దీంతో జమ్మూకశ్మీర్ భారత యూనియన్‌లో విలీనమైంది.
ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్‌పై సంతకం: 1947, అక్టోబర్ 26న పాకిస్తాన్ నుంచి పష్తూన్ గిరిజనుల దండయాత్రను ఎదుర్కొని భారత యూనియన్‌లో విలీనం అయ్యేందుకు మహారాజా హరిసింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్‌పై కొన్ని షరతులతో సంతకం చేశాడు. 1947, అక్టోబర్ 27న అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ ఈ ఒప్పంద పత్రాన్ని ఆమోదించాడు.
భారత్ - పాకిస్తాన్ యుద్ధం(1947-48): విలీనం తర్వాత భారత్, పాకిస్తాన్ల మధ్య చెలరేగిన ఘర్షణలు యుద్ధానికి దారితీశాయి. ఈ యుద్ధానికి ముగింపు పలకడానికి నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) అని పిలిచే కాల్పుల విరమణ రేఖను ఏర్పాటు చేశారు.
1948, మార్చి: జమ్మూకశ్మీర్‌లో మహారాజా హరిసింగ్ షేక్ అబ్దుల్లా ప్రధాన మంత్రిగా
తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
1949: షేక్ అబ్దుల్లాతోపాటు మరో ముగ్గురు భారత రాజ్యాంగ సభలో చేరి జమ్మూకశ్మీర్
ప్రత్యేక హోదాపై చర్చలు జరిపి జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేలా విదేశీ వ్యవహారాలు, రక్షణ, కమ్యూనికేషన్ అంశాలతో షేక్ అబ్దుల్లా రూపొందించిన ఆర్టికల్స్ 370ను ఆమోదించారు. ఆ తర్వాత భారత్‌లో కలిసిన జమ్మూకశ్మీర్ ఆర్టికల్ 370 కింద కొన్ని ప్రత్యేక అధికారాలతో కొనసాగింది.
2019, ఆగస్టు 5: 2019, ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏలను రద్దు చేసి జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.
2019, అక్టోబర్ 31: జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019 అక్టోబర్, 31 నుంచి అమల్లోకి వచ్చింది.
2023, డిసెంబర్ 11: ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
2024, అక్టోబర్: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ఎన్నికయ్యాక కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జమ్మకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.