ఐపీఎల్ మ్యాచ్ లకు కొన్ని రోజుల నుంచి వర్షం అంతరాయం కలిగిస్తుంది. దేశంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా వర్షం వదల్లేదు. ఈ క్రమంలో చాలా మ్యాచ్ లు రద్దయ్యాయి. నిన్న (మే 19) కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ కూడా వర్షం ధాటికి కొట్టుకుపోయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దీంతో రాజస్థాన్ మూడో స్థానంతో సరిపెట్టుకొని టాప్ 2 లో ఉండే అవకాశాన్ని కోల్పోయింది. లీగ్ మ్యాచ్ లైతే చెరొక పాయింట్ తో సరిపెట్టేస్తారు. అయితే ప్లే ఆఫ్స్ లో లెక్క ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ లో భాగంగా ఆదివారం (మే 19) లీగ్ మ్యాచ్ లన్నీ ముగిసిపోయాయి. మంగళవారం (మే 21) నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు ప్రారంభమవుతాయి. కోల్ కతా నైట్ రైడర్స్ 20 పాయింట్లతో పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు మంగళవారం (మే 21) జరగనున్న క్వాలిఫయర్ 1 లో తలపడతాయి.
17 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ మూడో స్థానానికి పరిమితమైతే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పాయింట్లతో ప్లే ఆఫ్ స్థానాన్ని దక్కించుకున్న నాలుగో జట్టుగా నిలిచింది. ఈ రెండు జట్లు బుధవారం (మే 22) ఎలిమినేటర్ లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ రెండు మ్యాచ్ లతో పాటు శుక్రవారం (మే 24) క్వాలిఫయర్ 2, ఆదివారం (మే 26) ఫైనల్ మ్యాచ్ లు జరుగుతాయి.
ప్లే ఆఫ్ మ్యాచ్ లకు వర్షం అంతరాయం కలిగించినా అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎదుకంటే ప్లేఆఫ్ మ్యాచ్ లకు రిజర్వ్ డేను కేటాయించారు. మ్యాచ్ జరిగే రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగిస్తే మ్యాచ్‌ను ముగించడానికి 120 నిమిషాల అదనపు సమయం అందుబాటులో ఉంది. లీగ్ మ్యాచ్‌లకు 60 నిమిషాలుగా ఉన్న సమయాన్ని మరో 60 నిమిషాలు కేటాయించారు.
రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ మొత్తం వర్షం కారణంగా రద్దయితే పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచిన జట్టును విజేతగా నిర్ణయిస్తారు. దీని ప్రకారం క్వాలిఫయర్ 1లో సన్ రైజర్స్ కంటే కోల్ కతా టాప్ లో ఉంది కాబట్టి ఫైనల్ కు దూసుకెళ్తుంది. మరోవైపు బెంగళూరు కంటే రాజస్థాన్ కు ఖాతాలో ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఎలిమినేటర్ లో తలపడే ఈ రెండు జట్లలో రాజస్థాన్ జట్టును విజేతగా నిర్ణయిస్తారు.