ఉన్నట్టుండి మీ అకౌంట్ ఉన్న బ్యాంకు మూతపడితే ఏమి చేయాలి..? డబ్బు మొత్తం తిరిగి ఇస్తారా..?

ఉన్నట్టుండి మీ అకౌంట్ ఉన్న బ్యాంకు మూతపడితే ఏమి చేయాలి..? డబ్బు మొత్తం తిరిగి ఇస్తారా..?

బ్యాంకు ఆకస్మికంగా కుప్పకూలడం అనేది 100 శాతం జరుగుతుందని చెప్పలేనప్పటికీ.. అలా మూతపడిన బ్యాంకు ఘటనలు దేశంలో బోలెడు ఉన్నాయి. ఆర్‌బీఐ నిబంధనలు అతిక్రమించి అడ్డగోలుగా లోన్లు ఇచ్చి.. వాటిని తిరిగి రాబట్టుకోలేక దివాళా తీసిన బ్యాంకులు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ అటువంటి 7 సహకార బ్యాంకుల లైసెన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రద్దు చేసింది.

ఒకవేళ అలాంటిదే జరిగి.. మీ అకౌంట్ ఉన్న బ్యాంకు మూతపడితే ఏం జరుగుతుంది..? ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం తిరిగి ఇస్తారా లేదా..! ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) సంగతేంటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఏదేని ఒక బ్యాంకు సంక్షోభాన్ని ఎదుర్కొని మూతపడింది అనుకుంటే.. మీ ఖాతాల్లో ఉన్న మొత్తం తిరిగి చెల్లించరు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు.. కొంత మొత్తానికి ఎలా భరోసా ఇస్తారో.. ఆర్బీఐ సైతం ప్రతి డిపాజిటర్‌కు ఒక్కో బ్యాంకుకు రూ. 5 లక్షల వరకు బీమా ఉంటుంది. ఒకవేళ విలీన ప్రక్రియ ద్వారా సదరు బ్యాంకును మరొక బ్యాంకులో విలీనం చేస్తే.. మీ డబ్బు సురక్షితం.

బ్యాంక్ వైఫల్యం సమయంలో మొదట ఏమి జరుగుతుంది.. ?

ఏదేని సంక్షోభం ఎదురై బ్యాంకు పతనం సందర్భంలో కింది దశలు సాధారణంగా జరుగుతాయి.

మారటోరియం: బ్యాంకు లిక్విడిటీ(నగదు కొరత) సంక్షోభాన్ని ఎదుర్కొంటే, బ్యాంకు లావాదేవీలను నిరోధించడానికి RBI తాత్కాలిక నిషేధాన్ని విధించవచ్చు. దీనర్థం డిపాజిటర్లు నిషేధ కాలంలో పెద్ద మొత్తంలో డబ్బు ఉపసంహరించుకోలేరు.

రిజల్యూషన్ లేదా విలీనం: బ్యాంక్‌ను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించలేమని ఆర్‌బీఐ భావిస్తే.. మరొక స్థిరమైన బ్యాంక్‌లో విలీన ప్రక్రియకు మార్గం చూపొచ్చు. ఇలా విలీనం చేయడం ద్వారా విఫలమైన బ్యాంక్‌లోని డిపాజిటర్లు వారి ఖాతాలను కొత్త బ్యాంకుకు బదిలీ చేస్తారు. ఖాతాలో ఉన్న డబ్బుకు డోకా ఉండదు. 

ALSO READ | ఉద్యోగులకు గిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా టాటా కార్లు, రాయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

లిక్విడేషన్: ఒకవేళ విలీన ప్రక్రియ సాధ్యం కానట్లయితే, బ్యాంక్ లిక్విడేషన్ ద్వారా వెళుతుంది. ఇక్కడ డిపాజిటర్లు వారి బీమా చేసిన డిపాజిట్లలో రూ. 5 లక్షల వరకు పొందేలా DICGC నిర్ధారిస్తుంది. ఆ రూ. 5 లక్షల మొత్తం చేతికందేసరికి నెలల నుండి సంవత్సరాల వరకు సమయం పట్టవచ్చు.

డబ్బు మొత్తం తిరిగి ఇవ్వరా..? ఎందుకు..?

నా ఖాతాలో 10 కోట్ల రూపాయలు ఉన్నాయి. నాకు రెండు.. మూడు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) ఉన్నాయి. ఆ మొత్తం తిరిగి ఇవ్వాల్సిందే అంటే కుదరదు. బ్యాంకు విఫలమైతే డిపాజిట్ బీమా కవరేజీ నిబంధనల ప్రకారం.. ఆర్బీఐ అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) డిపాజిటర్లందరికీ బీమా రక్షణను అందిస్తుంది. కాకపోతే, ఆ బీమా మొత్తానికి పరిమితులు ఉన్నాయి. 

  • ప్రతి డిపాజిటర్‌కు ఒక్కో బ్యాంకుకు రూ. 5 లక్షల వరకు బీమా ఉంటుంది. ఈ పరిమితి ఒక బ్యాంక్‌లోని అన్ని ఖాతాలలో డిపాజిటర్ కలిగి ఉన్న డబ్బు మొత్తానికి వర్తిస్తుంది.
  • మీకు ఒకే బ్యాంక్‌లో బహుళ ఖాతాలు (పొదుపు ఖాతా, FD వంటివి) ఉన్నా.. మొత్తం బీమా కవర్ రూ.5 లక్షలకే పరిమితం.
  • అందునా, ఆ రూ.5 లక్షలలోనే అసలు, వడ్డీ రెండూ ఉంటాయి. ఒకవేళ మీ మొత్తం బ్యాలెన్స్ రూ.5 లక్షలలోపు అయితే అంతా చేతికొస్తుంది. 

ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBలు), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) వంటి సంస్థలు ప్రభుత్వ మద్దతు కారణంగా సురక్షితం. అలాగే HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు ఆర్బీఐ నిబంధనలకు లోబడే పని చేస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన చిక్కల్లా.. చిన్న చిన్న బ్యాంకులు. ఉదాహరణకు కోఆపరేటివ్ బ్యాంకులు. 

ఈ ఏడాది మూతపడిన బ్యాంకులు

  • సుమర్‌పూర్ మర్కంటైల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 
  • జై ప్రకాష్ నారాయణ్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్ 
  • శ్రీ మహాలక్ష్మి మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్
  • హిరియూర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్
  • సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ (ముంబై)
  • పూర్వాంచల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (ఉత్తరప్రదేశ్‌) 
  • బనారస్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్