కురవి, వెలుగు: డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ కు మహబూబాబ్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామంలో నిరసన సెగ తగిలింది. అభివృద్ధి పనులను ప్రారంభించడానికి కందికొండకు వస్తున్న ఆయనను కొందరు యువకులు, మహిళలు అడ్డగించే ప్రయత్నం చేశారు.
దీంతో పోలీసులు ఎమ్మెల్యేతో మాట్లాడిస్తామని సర్ది చెప్పి ఊరుకోబెట్టారు. శంకుస్థాపనల తర్వాత ఎమ్మెల్యే మాట్లాడి వెళ్తుండగా తమ గ్రామాన్ని ఏం అభివృద్ధి చేశారంటూ నిలదీసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో ఎమ్మెల్యే సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీపీ గుగులోతు పద్మ, రైతు కో ఆర్డినేటర్ రమేశ్, ఆత్మ చైర్మన్ తోటలయ్య, తహసీల్దార్ రఫీ, ఎంపీడీవో సరస్వతి పాల్గొన్నారు.