
‘‘పిట్ట కొంచెం.. కూత ఘనం” ఈ సామెత డీప్‌సీక్ ఏఐకి సరిగ్గా సరిపోతుంది. ఈ స్టార్టప్‌లో పనిచేసేది సుమారు 200 మంది ఉద్యోగులు. కంపెనీ కోసం ఖర్చు చేసింది రూ. 50 కోట్ల కంటే తక్కువే. కానీ.. వందల కోట్లతో ఏర్పాటు చేసి, వేల మంది ఉద్యోగులతో నడుపుతున్న కంపెనీలకు కూడా గట్టి పోటీని ఇస్తోంది. వాటితో సమానంగా సర్వీస్‌లు అందిస్తోంది. అంతేనా.. డీప్ సీక్ ఎంట్రీతో అమెరికాలో ఎన్నో టెక్ కంపెనీల స్టాక్స్ కుప్పకూలాయి. కొన్ని లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. తక్కువ ఖర్చు, పరిమిత వనరులతో తయారైనా... తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని దూసుకుపోతోంది డీప్‌సీక్.
మెరుగైన పనితీరు..
అన్ని కంపెనీలు ఏఐని డెవలప్ చేయడానికి ఖరీదైన, అధునాతన చిప్‌లపై ఆధారపడుతున్నాయి. కానీ.. డీప్‌సీక్ చౌకగా దొరికే తక్కువ కెపాసిటీ చిప్‌లను వాడి ఏఐని డెవలప్ చేసింది. అందుకే 5.6 మిలియన్ల డాలర్లతోనే కంపెనీని ఏర్పాటు చేయగలిగారు. తక్కువ ఖర్చుతో తయారైనప్పటికీ 10 బిలియన్లకు పైగా విలువైన చాట్ జీపీటీతో సమానంగా, కొన్ని విషయాల్లో దానికంటే మెరుగ్గా పనిచేస్తోంది. ముఖ్యంగా మ్యాథ్స్, రీజనింగ్, కోడింగ్ లాంటి ప్రశ్నలకు చక్కగా వివరణలతో సమాధానాలు ఇస్తోంది. అయితే.. కొన్ని సున్నితమైన రాజకీయ ప్రశ్నలకు మాత్రం ఇది సమాధానాలు చెప్పడం లేదు. ముఖ్యంగా చైనా సరిహద్దు గొడవలు, తైవాన్ వార్, చైనా ప్రధాన మంత్రికి సంబంధించిన విషయాలపై ఇది స్పందించడంలేదు.
ఎన్విడియాపై ఎఫెక్ట్
గ్లోబల్ టెక్ రేస్‌లో కొన్నేండ్లుగా అమెరికా ఆధిపత్యం కొనసాగుతోంది. పైగా.. టెక్నాలజీ డెవలప్మెంట్లో తమను దాటేస్తారనే ఉద్దేశంతో చైనాతో పాటు మరికొన్ని దేశాలకు ఏఐ కోసం వాడే అడ్వాన్స్డ్ చిప్స్ ఎగుమతిపై ఆంక్షలు విధించింది. అలాంటి చిప్‌లను ఎక్కువగా ఎన్విడియా అనే అమెరికన్ కంపెనీ తయారుచేస్తోంది. చాట్‌జీపీటీ కోసం ఈ చిప్‌లనే వాడారు. కానీ.. ఇప్పుడు డీప్‌సీక్ సక్సెస్‌తో ఏఐ బాగా పనిచేయాలంటే అత్యాధునిక చిప్‌లు అవసరమనే భావన పోయింది. దాంతో ఎన్విడియా కంపెనీ స్టాక్స్ విలువ 17 శాతం పడిపోయింది. దీంతోపాటు చాలా టెక్ కంపెనీలు, పెట్టుబడి దారులు తమ సంపదను కోల్సోవాల్సి వచ్చింది.
గట్టి పోటీ!
చాట్‌జీపీటీ లాంటి ప్రపంచ ప్రసిద్ధ ఏఐ మోడల్స్‌కు కూడా డీప్‌సీక్ గట్టి పోటీని ఇస్తోంది. చాట్ జీపీటీ ఫ్రీగా ఇవ్వని చాలా సర్వీసులు ఇది ఫ్రీగా అందిస్తోంది. ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ కూడా డీప్‌సీక్‌పై స్పందించాడు. ‘‘డీప్‌సీక్ ఆవిష్కరించిన ఆర్1 మోడల్ ఆకట్టుకుంటోంది. కొత్త పోటీదారుడు రావడం మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. మేము త్వరలోనే మరింత మెరుగైన మోడల్‌ను తీసుకొస్తాం” అన్నాడు. ఇది చాట్‌జీపీటీతోపాటు గూగుల్, మెటా లాంటి దిగ్గజ సంస్థలకు కూడా పోటీని ఇస్తోంది.
ఇది సేఫేనా?
అన్ని ఏఐ ప్లాట్‌ఫామ్స్ లాగే డీప్‌సీక్ మీద కూడా చాలామందిలో సేఫ్టీకి సంబంధించిన ఆందోళనలు ఉన్నాయి. పైగా ఇది చైనా నుంచి రావడం వల్ల ఆ ఆందోళనలు మరింత ఎక్కువయ్యాయి. ఎక్స్పర్ట్స్ మాత్రం సేఫ్ కాదనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కానీ.. డేటా ప్రైవసీ విషయంలో అన్ని ఏఐ మోడల్స్‌తోనూ జాగ్రత్తగానే ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే.. ఆస్ట్రేలియా సైన్స్ మినిస్టర్ ఎడ్ హుసిక్ మాత్రం డీప్‌సీక్ విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. డీప్‌సీక్ నుంచి సెన్సిటివ్ డేటా అనుకోకుండా ఓపెన్ ఇంటర్నెట్‌కు వెళ్లినట్టు ఇజ్రాయెల్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ విజ్ తెలిపింది. అందులో డిజిటల్ సాఫ్ట్‌వేర్ కీలు, చాట్ లాగ్‌లు లాంటివి కూడా ఉన్నాయి. అయితే.. ఆ డేటాని గంటలోపే డీప్‌సీక్ తొలగించిందని విజ్ సహ వ్యవస్థాపకుడు అమీ లుత్వాక్ చెప్పాడు.
ఎలా ఉపయోగించాలి?
డీప్‌సీక్ కూడా చాట్ జీపీటీలాగే పనిచేస్తుంది. యాపిల్ స్టోర్, యాప్‌స్టోర్, కంపెనీ వెబ్సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే.. దీన్ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కొంత పర్సనల్ డేటా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ప్రశ్నలు, పజిల్స్.. ఇలా ఏది అడిగినా సమాధానాలుచెప్తోంది. క్రియేటివ్ కంటెంట్‌ని రూపొందించడంలో కూడా సాయం చేస్తుంది. ఇందులో ప్రస్తుతం R1, V3 అనే రెండు మోడల్స్ ఉన్నాయి.
కంటెంట్ క్రియేషన్: ఇది బ్లాగ్స్, ఈ–మెయిల్స్, సోషల్ మీడియా అప్‌డేట్స్... లాంటివి రాయడంలో సాయం చేస్తుంది.
లెర్నింగ్: డీప్‌సీక్ చాలా కష్టమైన కాన్సెప్ట్స్‌ని కూడా సులభంగా మార్చి వివరిస్తుంది. పిల్లలకు హోంవర్క్ నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు కోడింగ్ టాస్క్‌ల వరకూ అన్నింటికీ దీన్ని వాడుకోవచ్చు.
చక్కని పరిష్కారం: ఇది క్లిష్టమైన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్, కోడ్స్‌లో లోపాలు, లాజికల్ పజిల్స్‌ని కూడా క్షణాల్లో పరిష్కరిస్తుంది. పైగా.. దాన్ని పరిష్కరించడానికి ఎలాంటి మెథడ్స్‌ని వాడిందో వివరంగా చెప్తుంది.
టాస్క్ ఆటోమేషన్: డీప్‌సీక్ ఒక విషయానికి సంబంధించిన అనేక కథనాలను ఒకచోటికి చేర్చడం, నివేదికలు రాయడం, ప్రాజెక్ట్‌ల కోసం కొత్త ఐడియాలు ఇవ్వడం.. లాంటివి చేస్తుంది. దీనివల్ల చాలా టైంని ఆదా చేసుకోవచ్చు.
‘‘మనుషుల్లాగే మెషిన్లు కూడా ఆలోచించగలిగితే ఎలా ఉంటుంది?’’ ఈ ఆలోచన నుంచి పుట్టిందే ఏఐ. అది కొన్నేళ్ల నుంచి అభివృద్ధి చెందుతూ వస్తోంది. అందులో భాగంగానే వచ్చిన ఓపెన్ ఏఐ కంపెనీ చాట్‌జీపీటీతో ఏఐలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. దాంతో మార్కెట్లో అప్పటికే ఉన్న దిగ్గజ టెక్ కంపెనీలు మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్, అమెజాన్ లాంటివి కూడా సొంతంగా ఏఐని డెవలప్ చేశాయి. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశాయి. ఇప్పుడు వాటన్నింటినీ తలదన్నేలా ఒక చిన్న చైనా కంపెనీ ‘డీప్‌సీక్’ అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చింది. రావడంతోనే అమెరికన్ స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కంపెనీలన్నీ అలర్ట్ కావాలని సూచించాడు. ఇప్పటివరకు టెక్నాలజీలో మమ్మల్ని మించినవాళ్లే లేరని చెప్పుకుంటున్న టెక్ కంపెనీలు కూడా డీప్‌సీక్ ఎంట్రీతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.
అసలేంటి ఈ డీప్‌సీక్
డీప్‌సీక్ రిలీజైన కొన్ని రోజుల్లోనే అమెరికాలో యాపిల్ యాప్ స్టోర్ డౌన్‌లోడ్స్(ఫ్రీ యాప్స్)లో టాప్‌కి చేరుకుంది. ఏఐ ఎక్స్పర్ట్స్, ప్రపంచ టెక్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. ఈ డీప్‌సీక్‌ను చైనాకు చెందిన లియాంగ్ వెన్‌ఫెంగ్ స్థాపించాడు. 1980లో చైనాలోని గ్వాంగ్ డాంగ్‌లో పుట్టిన లియాంగ్.. జెజియాంగ్ యూనివర్సిటీ నుంచి ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ చేశాడు. 2015లో కో– ఫౌండర్‌గా హై–ఫ్లయర్ కంపెనీ పెట్టాడు. ఆ తర్వాత 2023లో డీప్‌సీక్ పేరుతో ఒక చిన్న ఏఐ స్టార్టప్ పెట్టాడు. చైనాలోని టాప్ యూనివర్సిటీల నుంచి కొంతమంది టెక్ స్టూడెంట్లను అందులో చేర్చుకున్నాడు. 200 మంది ఎంప్లాయిస్తోనే కంపెనీ నడుపుతున్నాడు. చాట్ జీపీటీ లాంటి ఇతర టాప్ ఏఐ మోడల్స్‌లోని ప్రీమియం ఆప్షన్స్‌ని వాడుకోవాలంటే ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు చేసి సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలి. కానీ.. డీప్‌సీక్‌ని ఎవరైనా ఫ్రీగా వాడుకోవచ్చు.